Take a fresh look at your lifestyle.

రైతులంటే ఎంత చులకన.. !

రైతులంటే నాయకులకు ఎంత చులకన భావమన్నది లఖింపూర్‌ ‌ఖేరీ సంఘటన చెప్పకనే చెబుతున్నది. దేశానికి వెన్నెముక రైతే అని, రైతే రాజని చెప్పుకునే మాటలన్నీ కంటితుడుపు చర్యలేనన్నది దీని వల్ల స్పష్టమవుతున్నది. అన్నదాత అయినా ఏ దాత అయినా తాము చెప్పినట్లు వినకపోతే ఎంతకైనా సిద్ధపడుతారన్నది దీని వల్ల తెలుస్తున్నది. దాదాపు పది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఎండ, వాన, చలి అనకుండా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా రైతాంగం తమ వంతు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ రంగంలో తాము చేసిన మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రసక్తిలేదని మొండికేసింది. రైతులు కూడా అంతే మొండిగా వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసే చట్టాలను వెనక్కు తీసుకునే వరకు ఆందోళన విరమించేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయంలో రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి పదకొండు సార్లు చర్చలు జరిగినా లాభం లేకుండా పోయింది.

పైగా రైతు సంఘాల నాయకులు చెబుతున్న ప్రకారం తమ మాటను వినాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతున్నదని, తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తమకు ప్రాణభయం ఏర్పడిందని చాలా కాలంగా వారు ఆవేదన వ్యక్తంచేస్తునే ఉన్నారు. దానికి తగినట్లుగా ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ‌ఖేర్‌ ‌జిల్లా బన్సీపూర్‌ ‌వద్ద జరిగిన సంఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డిల్లీ సరిహద్దుల్లో మాదిరిగానే ఇక్కడ కూడా రైతులు తమ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అధికారులు, నాయకులు వెళ్ళే మార్గంలో ప్లకార్డులు, బ్యానర్లతో నినాదాలు చేశారు. వారి శాంతియుత ప్రదర్శనను నాయకులు హింసాత్మకంగా మార్చారు. కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి అజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా వాహన శ్రేణిలోని ఒక కారు గుమికూడి ఉన్న రైతులమీదకు అకారణంగా దీసుకు రావడంతో నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు. లఖింపూర్‌ ‌ఖేరీలోని టికోనియా ప్రాంతంలో గల అగ్రసేన్‌ ‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభకు హాజరు కావడానికి ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ‌ప్రసాద్‌ ‌మౌర్య వొస్తున్నాడని తెలిసి ఆయన్ను ఘెరావ్‌ ‌చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ విషయంలో సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం కూడా ఉంది. అయినా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ఒక పక్క ప్రయత్నం చేస్తుండగానే కేంద్ర మంత్రి అధికార వాహనశ్రేణిలోని ఒక వాహనం వారిపైకి దూసుకువచ్చింది. దీంతో నలుగురు రైతులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అనుకోని ఈ పరిణామానికి దిగ్భ్రాంతికి గురైన రైతులు వాహనంలోని వారిపై దాడి చేశారు. ఈ కొట్లాటలో వాహన డ్రైవర్‌, ‌ముగ్గురు బిజెపి కార్యకర్తలతో పాటు ఇతరులు కలిసి అయిదుగురి వరకు మరణించినట్లు తెలస్తున్నది. మొత్తం మీద ఎనిమిది నుండి తొమ్మిది మంది ప్రాణాలు తీసిన ఈ సంఘటనకు మీరంటే మీరు బాధ్యులని రైతు నాయకులు, రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఉత్తరప్రేదేశ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం మరణించిన రైతులకు 45 లక్షలు, గాయపడిన వారికి పది లక్షల చొప్పున తాత్కాలిక సహాయాన్ని ప్రకటించింది. రైతు నేతలు కూడా దీంతో తాత్కాలికంగా తమ ఆందోళనను విరమించినప్పటికీ మంత్రి అజయ్‌ ‌మిశ్రా, ఆయన కుమారుడు అశేష్‌ ‌మిశ్రాను అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్‌ ‌చేస్తున్నారు. అయితే వారిపైన మాత్రం పోలీసు కేసు నమోదుకాగా, పదవీ విరమణ చేసిన న్యాయాధిపతితో విచారణ చేపడుతామని యుపి ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్‌ ‌ప్రకటించడంతో తాత్కాలికంగా కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే రైతులు గత పది నెలలుగా చేస్తున్న ఆందోళనపై కక్ష్యసాధింపు చర్యగానే కారుతో వారిపై దాడి జరిగిందా లేక మరేదైనా కారణముందా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఏదిఏమైనా రైతులు నెలల తరబడి రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేస్తుంటే బాధ్యతాయుత ప్రభుత్వాలు వారి సాధక బాధకాలను విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి, కార్లతో దాడి చేయడం మాత్రం అమానుష చర్య అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో తమ ఆందోళనను తెలిపే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ ‌నాయకులు ప్రియాంకా గాంధీ, పంజాబ్‌లో సిద్దూను. అలాగే ఎస్పీ నేత అఖిలేష్‌ ‌యాదవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికైన కేంద్ర సర్కార్‌ అనవసర కాలయాపన చేయకుండా అన్నదాతలను ఆందోళనకారులుగా మార్చకుండా సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

Leave a Reply