వికారాబాద్: వ్యవసాయ పనుల్లో అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పౌసమి బసు తెలిపారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని స్త్రీశక్తి భవన్లో వికారాబాద్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో, ఎంపిఓ, ఏపీఓ, టీఏఏలతో గ్రామాలలో చ్ఱెపడుతున్న పారిశుధ్య ఎన్ఆర్ఈజిఎస్ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించాలని తెలిపారు. అదే విధంగా వారానికొకసారి మోరీలను శుభ్రం చేయాలని తెలిపారు. పెద్ద మురుగునీటి కాలువలను నెలకు ఒకరోజు శుభ్రం చేయాలని తెలిపారు.
గ్రామాల్లో డెంగ్యూ మలేరియా వంటి రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలను పాటించాలన్నారు. వాటర్ ట్యాంకులను ప్రతి నెలకు ఒకసారి శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉంటూ ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు గ్రామాలను సందర్శించి పనులను చేపట్టాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కూలీలు రైతులు చేసే వ్యవసాయ, వరి ధాన్యం సేకరణ పనుల్లో భౌతిక దూరం పాటించాలని, అదే విధంగా మాస్కులు తప్పనిసరిగా ధరించి పనులు చేపట్టేలా చూడాలన్నారు. గ్రామాలలో ట్యాక్స్ కలెక్షన్ వందశాతం చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఒక్కరూ నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో కృష్ణన్ జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా వికారాబాద్ ఎంపీడీఓ సుభాషిని తదితరలు పాల్గొన్నారు.