Take a fresh look at your lifestyle.

ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాస్ కొరోనా చికిత్స కు రూ. 28,99,535

  • కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ఆగడాలను ప్రభుత్వం అడ్డుకోలేదా  ?
  • కొరోనా వైద్యం పేరుతో రోగులకు చుక్కలు చూపిస్తున్న ఓ కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌
  • ఆ ‌హాస్పిటల్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు
  • అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ‌చేసిన ప్రకటన గాలికేనా ?

‌కొరోనా వైరస్‌ ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌కు వరంగా మారింది. మానవతా ధృక్పదంతో వైద్య సేవలు అందించి బాధితుల ప్రాణాలను కాపాడే బాధ్యతను మరచి బాధితుల నుంచి అందిన కాడికి దండుకుంటూ పీల్చి పిప్పి చేస్తున్నాయి. కొరోనా రోగుల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని హైకోర్టు మొట్టి కాయలు వేసినా, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ఆగడాలపై శాపనార్థాలు పెట్టినా ఏమాత్రం స్పందించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలోని కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌కొరోనా వైద్యం పేరుతో కాసులు ఏరుకుంటున్నాయి. కొరోనా బాధితుల నుంచి ఇష్టం వచ్చినట్లు దోచుకుంటూ రోగం నయం చేయకపోగా, వైద్య వృత్తి నైతిక ధర్మాన్ని గాలికి వదిలేసి చివరికి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడానికి అడిగినంత ఇస్తేనే అప్పజెబుతాం లేదంటే లేదని బేరసారాలాడుతుండటం సమాజంలోని ప్రతీ ఒక్కరినీ కలచివేస్తున్నది. కొరోనా వైరస్‌ ‌ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి వైద్య చికిత్సల పేరుతో రూ. లక్షలు గుంజుతున్నారని హైదరాబాద్‌ ‌నగరంలోని ఓ కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌పై లెక్కలేనన్ని విమర్శలు, ఫిర్యాదులు వచ్చాయి. ఈ హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలతో పాటు బాథిత కుటుంబ సభ్యులు సైతం ఫిర్యాదులు చేశారు. హైకోర్టు సైతం కొరోనా బాధితుల నుంచి ఫీజుల పేరుతో విచ్చలవిడిగా డబ్బు దండుకుంటున్న ఆ కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా ఆ హాస్పిటల్‌పై ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు, సీఎం కేసీఆర్‌ ‌కూడా అసెంబ్లీ సాక్షిగా కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌కొరోనా దందాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతగనం ప్రజలను దోచి వారు ఏం చేస్తారని మండిపడ్డారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్ ‌ఫోర్స్ ‌కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల దందాపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కొన్ని హాస్పిటళ్లు కొరోనా ట్రీట్‌మెంట్‌ ‌పేరిట డబ్బు సంపాదించుకుంటున్నాయని మండిపడ్డారు. దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు లక్షలు పీడించడం సరికాదన్నారు. ఈ సమయంలోనూ ఇలా పీడించడం ఏంటని ప్రశ్నించారు.

corporate hospitals

వాడు ఎవడైనా కానీ..ఏ హాస్పిటల్‌ అయినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాం. దుర్మార్గం కదా.. లోకం అల్లాడుతుంటే… ఈ సమయమే దొరికిందా? అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ ఏర్పాటు చేశామని, ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల దోపిడీ నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఏ హాస్పిటల్‌ అయినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అయినప్పటికీ ఆ హాస్పిటల్‌ ‌యాజమాన్యానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. ఈ హాస్పిటల్‌ అకృత్యాలను ప్రశ్నించడమ మన వోట్లతో పుట్టి ఎమ్మెల్యేలు, మంత్రులకే అసాధ్యమవుతున్నది. కార్పొరేట్‌ ‌ను నియంత్రించడం అసాధ్యమని తేలిపోయింది. ఇప్పటికే ఆ హాస్పిటల్‌ ‌లిస్టులో వందల మంది బాధితులు ఉండగా, తాజాగా జనగామ• జిల్లాకు జఫర్‌గఢ్‌కు చెందిన పాత్రికేయుడు బెలిదె శ్రీనివాస్‌ ‌కూడా చేరాదు. సికిండ్రాబాద్‌లోని ఆ ప్రముఖ కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌లొ కొరోనా చికిత్స కోసం చేరిన శ్రీనివాస్‌కు 33 రోజులకు చేసిన చికిత్సకు గాను అక్షరాలా రూ. 28,99,535 బిల్లు వేశారు. అందులో రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కింద చెల్లించి, మరో రూ. 11 లక్షలు నగదు రూపంలో ఆ పాత్రికేయునికి చెందిన కుటుంబం చెల్లించింది. శ్రీనివాస్‌ ‌ప్రాణాలు కాపాడుకునేందుకు ఉన్న భూములు ఇంట్లో నగలు అమ్మి ఎలాగోలా మరి కొంత మొత్తం చెల్లిద్దామని హాస్పిటల్‌కు వెళితే ఇంకో రూ. 11 లక్షలు చెల్లించాలంటూ శ్రీనివాస్‌ ‌కుటుంబ సభ్యులకు చుక్కలు చూపించారు.

శ్రీనివాస్‌ ‌కుటుంబ సభ్యులు చికిత్సకు అయిన బిల్లు ఇవ్వాలని అడిగితే, హాస్పిటల్‌ ‌పేరు మీద బిల్లుఇచ్చేది లేదనీ, అంతగా కావాలంటే వైట్‌ ‌పేపర్‌ ‌మీద రాసి ఇస్తామని చెబుతున్నారు. ఈ విధంగా తాము వసూలు చేసే బిల్తుతో ఎక్కడా న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. దీంతో బిల్లు ఎలా చెల్లించాలని పాత్రికేయుడు శ్రీనివాస్‌ ‌కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ఆగడాలకు ముకుతాడు వేయడం సీఎం కేసీఆర్‌కు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు కూడా సాధ్యం కాదా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలోని ఎలాంటి సమస్యలకైనా ఒక్క ట్వీట్‌తో న్యాయం చెప్పే యూత్‌ ఐకాన్‌ ‌కేటీఆర్‌ ఓ ‌పాత్రికేయుడికి ఇంత బిల్లు వస్తే స్పందించరా అని తోటి పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులమని నినదించిన జర్నలిస్టులకు ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నదన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చివరకు ఆ పాత్రికేయునికి హాస్పిటల్‌ ‌బిల్లు చెల్లించేందుకు ఆర్థిక సాయం చేయడానికి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా జర్నలిస్టులు జోలె పట్టి చందాలు వసూలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. శ్రీనివాస్‌ ‌వంటి పాత్రికేయుల భిక్షాటన ఇతర కుటుంబాలకు కూడా పాకాలా ? రూ. లక్షతో నయమయ్యే విధంగా కొరోనాను నియంత్రిస్తామని బీరాలు పలికిన ప్రభుత్వానికి ఇప్పుడు రంకెలేస్తున్న కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌కు ముకుతాడు వేసే సత్తా ఉండా ? ఈ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌విచ్చలవిడితనాన్ని ప్రశ్నించే సత్తా ఎప్పుడొస్తుందనీ, పాత్రికేయం కూడా ప్రశ్నించే వైపుకు వెళ్లడానికి కొరోనా ఊతంగా మారగూడదా ? భిక్షాటన చేస్తూనే కార్పొరేట్‌కు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వాన్ని నిలదీద్దామా ? అని పాత్రికేయ సమాజం ప్రశ్నిస్తున్నది. కలం కార్మికులు మన వైద్యం కోసం మనమే ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply