పెట్రోల్ ,డీజీల్ ధరలపై .. నిరసనతో కదం తొక్కిన కాంగ్రెస్
- సైకిల్ తొక్కి నిరసన తెలిపిన జగ్గారెడ్డి …గుర్రలు ఎక్కి నిరసన తెలిపిన పొన్నం ప్రభాకర్, శ్రవణ్, అంజాన్ కుమార్ యాదవ్
- ధరలు తగ్గించకపోతే జులై 4 తర్వాత పోరు ఉదృతం చేస్తాం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేశారు. సోమవారం గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలు గుర్రాల పై ఎక్కి, జూబ్లీహిల్స్ లో జగ్గారెడ్డి సైకిల్ తొక్కి వినూత్న తరహాలో నిరసనలు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీ లు పెట్రోల్, డీజిల్ ధరలను కంటిన్యూ గా పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం పై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు నిరసనగా ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ జెండాలతో ధర్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్ లో సైకిల్ తొక్కి నిరసన తెలిపారు.
ఓ వైపు ప్రజలు కరోనా తో ఇబ్బందులు పడుతుంటే సామాన్యుల పై భారం మోపడం సరికాదన్నారు. చమురు ధరలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని సూచించారు. ఇక నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రావణ్ లు గుర్రాలు ఎక్కి నిరసన తెలిపారు. గాంధీభవన్ నుంచి హైద్రాబాద్ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. గేటు బయటకు రాగానే వారిని పోలీస్ లు అడ్డుకున్నారు. దాంతో కాసేపు పోలీస్ లకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఐదుగురికి కలెక్టర్ కార్యాలయం వెళ్ళడానికి పోలీస్ లు అనుమతి ఇవ్వడం తో వెళ్లి హైద్రాబాద్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఇక రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మల్లు రవి రిక్షా తొక్కి నిరసన తెలిపారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ధరలు తగ్గించకపోతే పోరు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ తహసీల్దార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వరంగల్ లో ఎడ్లబండితో నిరసన తెలపడానికి ప్రయత్నించగా ఎడ్లు బెదిరి బండితో సహా పరుగులు పెట్టడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్ని జిల్లాలలోనూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ధరలు తగ్గించకపోతే జులై 4 తర్వాత పోరు ఉదృతం చేస్తామన్నారు.