కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను తప్పు పడుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఇటీవల గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం గోరటి వెంకన్న, దయానంద్, బస్వరాజు సారయ్యలను నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వీటిని రద్దు చేయాలని గోపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
తన పేరును రెండు సార్లు గవర్నర్ ప్రతిపాదించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్ చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రివర్గం గోరటి వెంకన్న, దయానంద్, సారయ్యలను ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ చేసిన సిఫార్సులను ఆమోదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పిటిషనర్ వాదనపై స్పందించిన తెలంగాణ హైకోర్టు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.