Take a fresh look at your lifestyle.

నొప్పి ఒక చోట వైద్యం వేరొక చోట..??

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సబబా
బ్యాంకింగ్‌ ‌రంగంలో 1969 సంవత్సరానికి పూర్వం ఉన్న పరిస్ధితులే మరల నేడు రాబోతున్నాయి.1969 కి పూర్వం బాంకులన్నీ ప్రైవేట్‌ ‌రంగంలో ఉన్నప్పుడు వాటి రుణాలు అత్యధిక శాతం కార్పొరేట్‌ ‌రంగాలకే అందేవి.రైతులకు కానీ చిన్న కుటీర పరిశ్రమలకు కానీ పేదవర్గాల వారికి అందే రుణాలు అత్యల్ప శాతంగా ఉండేవి.ఈ పరిస్ధితి గమనించిన భారత ప్రభుత్వం 1969 సంలో 14 బ్యాంకులు 1980వ సంలో 6 బాంకులను జాతీయం చేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు చాలా వరకు సఫలీకృతం అయ్యాయి.జాతీయీకరణ ద్వారా ప్రాధాన్యతా రంగానికి 40 శాతం రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టడం జరిగింది. అంటే వ్యవసాయం, చిన్నతరహా కుటీర పరిశ్రమలుకు రుణాలు అందించడానికి ముందుకు వచ్చాయి.ఈ ఋణాలలో ఒక్క వ్యవసాయరంగానికే 80 శాతం రుణాలివ్వాలని నిర్దేశించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల పొదుపు అలవాట్లను ప్రోత్సహించడానికై 1969 తరువాత గ్రామీణ ప్రాంతాలలో బాంకుల స్ధాపన వేగంగా జరిగింది.ప్రభుత్వ పథకాలను ప్రజానీకానికి అందచేయడంలో ఇవి విశేష కృషి జరుపుతూ వచ్చాయి.ప్రభుత్వ బాంకుల పట్ల ప్రజల విశ్వసనీయత పెరిగి డిపాజిట్లు కూడా గణనీయంగా పెరిగాయి.ఇలా బ్యాంకుల వృద్ధి జరుగుతూ ఉండగా.1991 సం మన దేశంలో ప్రపంచీకరణలో భాగంగా ప్రయివేటీకరణ పరిస్ధితులు క్రమేపీ పెరుగుతూ వచ్చాయి.క్రమేపీ ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల బాటను పట్టాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులలో నిరర్ధక ఆస్తులు పెరిగి పోవడం.దీని కారణంగా బ్యాంకుల నష్టాల భర్తీకి ప్రభుత్వమే రీ ఇన్వెస్ట్ ‌మెంట్‌ ‌చేయవలసిన పరిస్ధితి ఏర్పడింది.ప్రభుత్వబ్యాంకులు చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు వ్యవసాయానికి దానితో పాటు కార్పొరేట్‌ ‌వర్గాల వారికి కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే వీటిలో పారు బాకీలు మాత్రం కార్పొరేట్‌ ‌వర్గాలనుండి మాత్రమే ఎదురవుతూ ఉన్నాయి.మొత్తం పారు బాకీలలో 14 శాతం చిన్న మధ్యతరహా మరియు రైతు వర్గాల నుండి ఉండగా 86 శాతం కార్పొరేట్‌ ‌వర్గాలనుండి ఉన్నాయి.

బ్యాంకులు రుణాలు మంజూరు చేసే క్రమంలో ఆస్తిని హామీని తీసుకుంటాయి.ఈ సమయంలో వారి ఆస్తులను వేలం వేసి ఋణాలు రాబట్ట వచ్చు. అటువంటప్పుడు రుణాల ఎగవేతకు అవకాశం ఉండదు. కానీ బడా పారిశ్రామిక వేత్తలు నుండి రుణాలను తిరిగి రాబట్టలేక పోతున్నారు. ఎందుకంటే వీరికి రుణాలు మంజూరు చేసే విధానంలో రాజకీయ ప్రాబల్యం..ఆశ్రిత వర్గాల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశ్యంతో అధికారంలో ఉన్న వాళ్ళు పలుకుబడి చూపించి రుణాలు మంజూరు చేయించు కోవడం జరుగుతూ ఉంది.దీనికి తోడు ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు హామీ పత్రాలు చూపించి రుణాలు పొందుతున్నారు.ముఖ్యంగా కార్పొరేట్‌వ్యక్తులకు, బ్యాంక్‌ ‌బోర్డ్ ‌మెంబర్స్ ‌నిర్ణయం మేరకు రాజకీయ వత్తిడితో రుణాలు మంజూరు చేస్తూ ఉంటే బాంకు అధికారులు కేవలం ఆ రుణాలను కార్పొరేట్లకు అందిస్తున్నారు తప్ప బ్యాంక్‌ అధికారులు ఇటువంటి పెద్ద మొత్తంలో రుణాలను మంజూరు చేయడం లేదు అనే విషయం బయటకు రాదు.ఇన్ని కారణాలు తెలిసినప్పుడు ప్రభుత్వం వాటిని కట్టడి చేయలేదా?ఇవేవీ పట్టించుకోకుండా ప్రయివేటీకరణ ఒక్కటే పరిష్కారం అంటున్నారు.అంటే సమస్య యొక్క నొప్పి ఒక చోట అయితే వైద్యం మరొక చోట చేస్తున్న తీరు ఇది.ఈ తీరుపై బాంక్‌ ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో పోరాడుతున్నాయి. పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు మాత్రం పై స్దాయిలో అనగా బ్యాంక్‌ ‌డైరెక్టర్‌ ‌బోర్డులో జరిగి పోతుంది. ఈ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధి రిజర్వ్ ‌బాంక్‌ ‌ప్రతినిధి ఇండిపెండెంట్‌ ‌డైరెక్టర్లు ఉంటారు తప్ప ఉద్యోగ సంఘ ప్రతినిధి ఉండరు.కానీ రుణాలను మాత్రం బ్రాంచుల ద్వారా బాంక్‌ ఉద్యోగులు అందిస్తారు.ఎవరు ఋణాలను ఎగవేస్తున్నారు అనేది తెలుస్తోంది కనుక వారిపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టు పడుతూ ఉన్నప్పటికి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.పైగా వాళ్ళ వివరాలను గుప్తంగా ఉంచుతున్నారు.

వీరిలో ప్రజా ప్రతినిధులు.. బడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.ఈ కారణంగా ప్రభుత్వ బాంకులలో నిరర్ధక ఆస్తులు పెరుతున్నాయి అనేది ప్రభుత్వానికి స్పష్టం. 2014 నాటికి బ్యాంకులలో ఉన్న మొండి బకాయిలు రెండున్నర లక్షల కోట్ల రూపాయిలు.రోజురోజుకు వీటి పరిమాణం పెరిగి 2018 మార్చి నాటికి భారతీయ బ్యాంకుల మొండి బాకీలు రూ. 10 లక్షల కోట్లు దాటిపోయాయి.బ్యాంకులు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 11.2 శాతం నిరర్ధక ఆస్తులుగా మారు తున్నాయి.. అంటే బ్యాంకులు అప్పు ఇచ్చే ప్రతి వంద రూపాయాల్లో పదకొండు రూపాయలు తిరిగి రావడం లేదు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజానీకం బ్యాంకులలో దాచుకున్న చిన్న చిన్న పొదుపు డిపాజిట్లే ఇవన్నీ సేకరించి బడా కార్పొరేట్‌ ‌వేత్తలకు రుణాలు ఇస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఉద్దేశ్య పూర్వకంగా ఎగవేత వ్యూహం చేపడుతూ ఉన్నారు.మరొక పక్క సామాన్య ప్రజానీకం మాత్రం రుణాలను నిజాయితీగా తిరిగి చెల్లిస్తున్నారు.ఎవరు ఉద్దేశ్య పూర్వకంగా రుణాలు ఎగవేస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలుసు. బ్యాంకు నుండి రుణాలు తీసుకున్న వారిలో విధిలేని పరిస్ధితిలో తిరిగి చెల్లించలేని మధ్యతరగతి ప్రజానీకం 14 శాతం ఉంటే 86 శాతం మాత్రం చెల్లించే స్ధోమత ఉండి ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసే బడా బాబులు ఉన్నారు. రుణం మంజూరుకు బ్యాంకులు సవాలక్ష హామీలు తీసుకుంటుంది అటువంటప్పుడు వాటి ద్వారా రుణాలు రాబట్టుకోవచ్చు.కానీ ఎందుకు తిరిగి రాబట్టలేక పోతున్నారు హామీగా ఇచ్చిన ఆస్తుల ధ్రువపత్రాలులో ఆస్తుల విలువ ఎక్కువగా చూపడం..లేదా లేని ఆస్తులను కూడా ఉన్న ఆస్తులుగా సృష్టించడం ఆ మోసపూరిత పత్రాలు హామీగా చూపడం జరుగుతూ ఉంది.అంతే కాదు ఎగవేసిన వారు హాయిగా విదేశాలలో విలాస వంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండటం ప్రజలంతా గమనిస్తూ ఉన్నా సాంకేతిక కారణాలు చూపించి వారిని కాపాడటం జగద్వితమే. నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటేబ్యాంకింగ్‌ ‌చట్టాలలో మార్పు తీసుకు వచ్చి వారిపై క్రిమినల్‌ ‌చర్యలు చేపట్టి వసూలు చేయలేరా? కానీ చేయరు ఎందుకంటే రాజకీయా పార్టీలన్నీ కార్పొరేట్‌ ‌కంపెనీలతో సన్నిహితంగా మెలుగు తూంటాయి. అవి రాజకీయ పక్షాలకు పెద్ద మొత్తంలో నిధులిస్తూంటాయి.ప్రధానంగాఎన్నికల సమయంలో కోట్లాది రూపాయిలను ఎన్నికల విరాళంగా అందిస్తూ ఉంటాయి.ఈ సమయంలో దేశ ప్రజలు నష్టపోయినా పరవాలేదు వారికి హాని కలగకూడదు అనుకునే వారు పాలకులుగా ఉంటే వారికి పూర్తి రక్షణ ఉండటం సహజంగా జరిగే ప్రక్రియ. దీనిలో ఏ రాజకీయ పక్షం కూడా మినహాయింపు కాదు.ఈ కారణం చేతనే ప్రైవేటు రంగానికి అప్పగించడం ఒక్కటే పరిష్కార మార్గంగా ఆలోచిస్తున్నారు.

ప్రైవేటు రంగంలో ఇటువంటి సమస్యకు తలెత్తవు అనుకోవడానికి లేదు.ఎందుకంటే చాలా ప్రైవేటు బాంకులు కూడా దివాళా తీసినవి లేకపోలేదు.నిరర్ధక ఆస్తులు అనేవి ప్రైవేటు బ్యాంకులలో కూడా ఏర్పడ్డాయి. గ్లోబల్‌ ‌ట్రస్ట్ ‌బ్యాంక్‌. ఎస్‌.‌బ్యాంక్‌ ఇలా ప్రైవేటు బ్యాంకులు కూడా నష్టాల ఊబిలో కూరుకుపోతే ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి.ఒక వేళ ప్రైవేట్‌ ‌రంగంలో నిరర్ధక ఆస్తులు జాడ తెలియగానే యాజమాన్యం పటిష్ట చర్యలు తీసుకుని కట్టడి చేస్తాయి.అయితే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయకుండా ప్రైవేటుకు అప్పగిస్తాం అంటుంది. అయితే తాజాగా ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే లాభం నష్టం అనేది దృష్టి లో పెట్టుకుని ఇది చేయడం లేదు..కేవలం ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అనే లక్ష్యంతోనే ప్రైవేటీకరణ వైపు వెడుతున్నాం అని ప్రభుత్వం చెబుతుంది. అదే చేయడం వలన మరలా కార్పొరేట్‌ ‌వర్గానికి మేలు చేయడమే అవుతుంది. ఎందుకంటే బ్యాంకులలో కార్పొరేట్‌ ‌వర్గాల డిపాజిట్లు ఉండవు.కేవలం ప్రజల డిపాజిట్లు మాత్రమే ఉంటాయి. వీటిలో అధిక భాగం యాజమాన్యాలు తమ పెట్టుబడులు కోసం వాడుకుంటాయి.అంతకన్నా ముఖ్యంగాప్రభుత్వ బ్యాంకులకు సామాజిక శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.ఆ లక్ష్య సాధనకే బ్యాంకులను జాతీయం చేశారు.

ఒక పక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ,మరొక పక్క ప్రజల డిపాజిట్లు పెట్టడానికి పూర్తి రక్షణ విశ్వసనీయత ప్రభుత్వ బ్యాంకులు కల్పిస్తాయి. అందుకే ఎక్కువ శాతం మంది ప్రజలు తమ నగదు డిపాజిట్లు చేయడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎంచుకుంటారు తప్ప ప్రైవేటు బాంకులో డిపాజిట్‌ ‌చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపరు.అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ప్రవేటు బ్యాంకులు సాధించిన ప్రగతి చూపించి మన దేశంలో ఆ విధానాన్ని వర్తింప చేయాలనే ఆలోచన సహేతుకం కాదు.ఎందుకంటే మన దేశ పరిస్ధితులు వేరు.ప్రధానంగా 2008-09 సంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం సంభవించినప్పుడు అనేక ఆర్ధిక వ్యవస్ధలు కుప్పకూలిపోయాయి అయితే ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్ధ మాత్రం నిలబడగలిగింది. కారణం భారత్‌ ‌లో ఉన్న బ్యాంకింగ్‌ ‌వ్యవస్ధ పటిష్టత ప్రధాన కారణం అని ఆర్ధిక విశ్లేషకులు ప్రపంచానికి తెలియ చెప్పారు.ఇవన్నీ పక్కన పెట్టి ప్రైవేటు రంగానికి అప్పగిద్దాం అనే ఏక పక్ష నిర్ణయం సమర్ధనీయం కాదు. ప్రైవేట్‌ ‌పరం చేస్తే ప్రజల డిపాజిట్లు అన్ని కార్పొరేట్ల ఆధీనంలో ఉన్న కార్పొరేట్ల చేతుల్లోనికి వెడతాయి.వాటిని పెట్టుబడులుగా మలుచుకుని లాభాలు సంపాదించేది మరలా బడా బాబులే.

అంటే కాకులును కొట్టి గద్దలకు వేసే చందాన ఇది జరుగుతూ ఉంది.ప్రయివేటీకరణ తరువాత వీరు మిగిలిన ప్రాధాన్య రంగాలైన వ్యవసాయం.చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు అందించడానికి ఏ విదంగాను సుముఖత చూపరు.ఈ రంగాలకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు అనే గ్యారంటీ ఉందా.కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్‌ ‌ఖాతా ఉండాలి అని ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన జీరో బ్యాలెన్స్ ‌జన్‌ ‌ధన్‌ ‌ఖాతాలు 95 శాతం ప్రభుత్వ బ్యాంకులే ప్రారంభించాయి. ప్రైవేటు బ్యాంకులు ఈ తరహా ఖాతాలు తెరుస్తాయా? ఇప్పటికి కూడా బ్యాంకులు లేని గ్రామీణ ప్రాంతాలు అనేకం.ఇక్కడ తమ శాఖలను ఆరంభించడానికి ప్రైవేట్‌ ‌బ్యాంకులు ఉత్సాహం చూపుతాయా? స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వ బ్యాంకులు అందించిన రీతిలో రుణాలు అందిస్తాయా?వీటికి ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవు. ఒకవేళ ప్రయివేట్‌ ‌బ్యాంకులు నష్టాల ఊబిలో కూరుకుపోతే మరలా వాటిని ప్రభుత్వమే భుజాన వేసుకోవాలి కదా అలాగే జరిగితే ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటుకు అప్పగించడం వలన ప్రయోజనం లేదు కదా? నీతి ఆయోగ్‌ ‌చేసిన సిఫార్సులను బట్టిరెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్‌ ‌పరం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆ బ్యాంకులేవి, వాటి ప్రైవేటీకరణ విధివిధానాలకు సంబంధించిన ప్రణాళికను తయారు చేసేందుకు ఒక కమిటీని వేసింది.ముఖ్యంగా బ్యాంకుల ప్రైవేటీకరణకు దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం బ్యాంకుల విలీనం చేపట్టింది అనేది సత్యం.రేపటి రోజున బ్యాంకుల అమ్మకానికి ఈ ప్రక్రియ ఎంతగానో సులభం అవుతుందని ఆర్ధిక విశ్లేషకులు అభిప్రా యపడుతు న్నారు.ఈ ఉద్దేశ్యంతోనే ఇండియన్‌ ఓవర్సీస్‌ ‌బ్యాంక్‌, ‌సెంట్రల్‌ ‌బ్యాంకుల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది. ఆర్‌బిఐ ఈ పనిలో ఇప్పటికే నిమగమై ఉంది.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులుపై కూడా ఖాతాదారులకు సేవలు అందించే విషయంలో అనేక విమర్శలు కూడా లేకపోలేదు. ఖాతాదారుల పట్ల కనీస గౌరవాన్ని కొన్ని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు చూపడం లేదనే విమర్శ బలంగా ఉంది.అయితే ఖాతాదారులను ఆకట్టుకోవడంలో ప్రైవేటురంగ బ్యాంకులు మాత్రం మంచి పేరు సంపాది ంచుకున్నాయి.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యో గులు ఖాతాదారులను ఆ రీతిలో ఆకట్టు కోలేక పోవడానికి కారణం తీవ్రమైన పని వత్తిడి కూడా ఒకటి.ఎందుకంటే లాభాలను ఆర్జించే ప్రభుత్వ రంగ బ్యాంకులలో కూడా 10 మంది చేయవలసిన పనిని ఒక్కరితో చేయిస్తున్నారు.ప్రవేటు రంగంలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్ధితి ఉంది. ఉద్యోగి ఉత్పాదకత మెరుగవ్వాలంటే పని చేసే విధానంలో వత్తిడి ఉండకూడదు.మంది తక్కువ లక్ష్యాలు ఎక్కువ అనే రీతిలో ప్రభుత్వ బ్యాంకులు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ బ్యాంకుల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీడిపాజిట్ల చేసే విషయంలో భద్రత అనేది ప్రభుత్వ బ్యాంకులలోనే ఉంటుంది అనేది ప్రజలలో బలమైన నమ్మకం ఉంది. అందుచేతనే ప్రజలు ప్రభుత్వ రంగ బ్యాంకులనే ఎక్కువుగా ఎంచుకోవడం విశేషం. ప్రైవేటు రంగంపై ఆసక్తి ఉంటే మరికొన్ని ప్రైవేట్‌ ‌బాంకులకు అనుమతి ఇచ్చి.ప్రభుత్వ బ్యాంకులను పటిష్ట పరచ వలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం పెద్ద బ్యాంకుల జోలికి పోకుండా రెండు మూడు చిన్న బ్యాంకులను ప్రయోగాత్మకంగా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒక వేళ రెండు మూడు బ్యాంకులను ప్రభుత్వ రంగంలో ఉంచినప్పటికి అవి కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు మాత్రమే ఉపయోగపడుతాయి తప్ప వాటి ద్వారా ప్రాధాన్యత రంగాలకు రుణాలు అందించడం అనేది సాధ్యపడే విషయం కాదు.ఈ పరిణామాలు అన్నీ గమనించి వాస్తవంగా ఒక దశాబ్దం లోపు మొత్తం ప్రభుత్వ బ్యాంకులు అన్నీ ప్రైవేటీకరణ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తూ ఉందని ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.నొప్పి ఒక చోట ఉంటే వైద్యం వేరొక చోట చేసే ఈ ప్రభుత్వ వైద్యం మాత్రం దేశంలో ఆదాయ అసమానతలను మరింత అధికం చేస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
– రుద్రరాజు శ్రీనివాసరాజు..9441239578
లెక్చరర్‌ ఇన్‌ ఎకనామిక్స్..ఐ.‌పోలవరం.

Leave a Reply