కొరోనా చికిత్సల పేరుతో ప్రైవేటు దవాఖానలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దవాఖానాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అపోలో, బసవతారకం దవాఖానాలలో కొరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనీ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విశ్రాంత ఉద్యోగి ఎం దేబరా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అదించాలన్న షరతుతో ప్రభుత్వం హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు హాస్పిటల్స్‌కు ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ఆ హాస్పిటల్స్ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా చికిత్స కోసం వచ్చిన బాధితుల నుంచి ఫీజుల రూపంలో రూ.లక్షలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. రోగులకు ఉచిత వైద్యం అందించకపోగా తాము అడిగినన్ని డబ్బులు చెల్లిస్తేనే వైద్య చికిత్సలు అందిస్తామని షరతులు పెడుతున్నాయని పేర్కొన్నారు.
పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం షరతులు ఉల్లంఘించిన ప్రైవేటు హాస్పిటల్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీని ప్రశ్నించింది. అధిక ఫీజులు చెల్లించకపోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందనీ, దీనికి ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించింది. దీనికి ఏజీ స్పందిస్తూ వైద్యం పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ అనుమతులు రద్దు చేస్తున్నామనీ, ఇప్పటికే రెండు దవాఖానాలు కొరోనా చికిత్సలు అందించకుండా నిషేధం విధించామని చెప్పారు. ఫిర్యాదులు వస్తున్న అన్ని హాస్పిటల్స్‌పై విచారణ చేపడుతున్నామనీ, నిబంధనలు పాటించని హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏజీ హైకోర్టుకు సమాధానమిచ్చారు. అయితే, ఏజీ సమాధానంతో ఏకీభవించని హైకోర్టు ధర్మాసనం ప్రైవేటు హాస్పిటల్స్ లైసెన్సులు రద్దుచేస్తే సరిపోదనీ, రాయితీపై ఇచ్చిన భూములను సైతం వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అపోలో, బసవతారకం దవాఖానాల విషయంలో తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.