Take a fresh look at your lifestyle.

గడువు ముగిసినా… ఆగని ప్రచారం

  • రంగంలోకి అధికార పార్టీ ఎమ్మెల్యేల సమీప బంధువులు
  • అధికారులు పట్టించుకోవడం లేదంటున్న విపక్ష పార్టీల నేతలు

Closed The Municipal Campaign Event
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌మున్సిపల్‌ ఎన్నికల ప్రచార గడువు ముగిసినప్పటికీ ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను తమ అభ్యర్థుల వైపు తిప్పుకునే యత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనుచరులు బహిరంగంగా మద్యం, డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు.

పెద్దపల్లి, గద్వాల, పెద్దపల్లి, తుక్కుగూడ, మీర్‌పేట తదితర చోట్ల నేతలు బహిరంగంగానే డబ్బు పంచుతూ ప్రతిపక్ష పార్టీల నేతలకు చిక్కడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగగా మరికొన్ని చోట్ల వారి సమీప బంధువులు వ్యవహారాలను చక్కబెడుతున్నారు. మంగళవారం అధికార పార్టీకి చెందిన పెద్దపల్లి ఎమ్మెల్యే వియ్యంకుడు పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పక్షాన డబ్బులు పంచుతున్నాడన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బీజేపీ నేతలకు సర్ది చెప్పారు. ఎమ్మెల్యే వియ్యంకుడిని అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, ఇదే పరిస్థితి మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌శివార్లలోనూ నెలకొంది. శివారు మున్సిపాలిటీ తుక్కుగూడలో అధికార పార్టీ ఎమ్మెల్యే కారులో ఒక ప్రాంతంలో ఉండగా ఆయన అనుచరులు మెడలో టీఆర్‌ఎస్‌ ‌కండువాలతో డబ్బులు పంచుతూ కాంగ్రెస్‌ ‌నేతల కంటపడ్డారు. దీంతో ఆయన అనుచరులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆయనను తనిఖీ చేయగా రూ. 2 వేల నోట్ల కట్టలు దొరకడంతో తీవ్రంగా మందలించి వదిలేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాల్సి ఉండగా, అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ‌డౌన్‌ ‌డౌడ్‌ అం‌టూ నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. అలాగే, మీర్‌పేట కార్పొరేషన్‌లోనూ ఇవే దృశ్యాలు కొనసాగాయి. టీఆర్‌ఎస్‌ ‌నేతలు తమ అభ్యర్థుల పక్షాన బహిరంగంగా ప్రచారం చేయడంతో బీజేపీ,కాంగ్రెస్‌ ‌నేతలు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు, ప్రచార గడువు ముగిసి అధికార పార్టీ నేతలు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ ఎన్నికల సంఘం అధికారులు స్పందించడం లేదని కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు ఎక్కడా కనిపించడం లేదని పేర్కొంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతల ఆగడాలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.

Tags: Periyapalli, Gadwala, Periyapalli, Tukkuguda, Mirpeta

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply