విప్లవాగ్నిని మల్లెపూల పరిమాళాన్ని విరజిమ్మిన కవి, తెలంగాణ నేలలో వీరుల రక్తం గాలిలో శౌర్యం ఇమిడి పోయిందని పోరాటాల ద్వారా కవిత్వం ద్వారా ప్రపంచానికి తుఫాను మోతలతోవినిపించిన ప్రజాకవి. ప్రజాజీవన రంగాలలో బహుముఖ పాత్ర నిర్వహించి, రాజకీయ, సాహిత్య కార్మికోద్యమ రంగాలలో ప్రజల హృదయాలలో తనదైన ముద్రన వేసుకున్న మహోన్నతుడు మఖ్దూం మొహిద్దీన్. మఖ్దూం మొహిద్దీన్ 1908 ఫిబ్రవరి 4న మెదక్ జిల్లా ఆందోల్ లో జన్మించారు.పూర్తి పేరు అబు సయీద్ మహమ్మద్ మఖ్దూం మొహియుద్దీన్ ఖాద్రి. మఖ్దూం పూర్వీకులది ఉత్తరప్రదేశ్‌లోని అజాంఘడ్. ఔరంగజేబు కాలంలో దక్కన్ పీఠభూమికి వచ్చి స్థిరపడ్డారు.
మఖ్దూం తండ్రి గౌస్ మొహియుద్దీన్ మఖ్దూం నాలుగేళ్ళ వయస్సులో మరణించారు. మఖ్దూం ప్రాథమిక విద్య ఇంటనే అభ్యసిస్తూ ఫార్సీ, అరబిక్, ఉర్దూ భాషల్లో పట్టు సాధిస్తూ, తెలుగు భాష పాఠశాలలో చదివారు. బషీరుద్దీన్ చరఖాపై నేసిన ఖద్దరు వస్త్రాలు ధరిస్తూ మఖ్దూంతోను అవే ధరింపచేసేవారు. సమకాలీన ప్రపంచ విశేషాలు, జాతీయోద్యమ సంఘటనలు మఖ్దూంతో చర్చించేవారు. రష్యాలో ప్రజా ఉద్యమ విజయాల పర్యవసానం ఆర్థిక – సాంఘిక అసమానతలు లేని సమాజం ఆయనను ఆకట్టుకుంది.
1929లో మెదక్ జిల్లా సంగారెడ్డిలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన మఖ్దూం ఉన్నత చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 1937లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. పూర్తి చేసి, ఉర్దూలో నాటకాలపై పరిశోధన పత్రం సమర్పించి డాక్టరేట్ పొందారు. 1939లో సిటీ కాలేజీలో అధ్యాపకులుగా చేరి అందరి గౌరవాభిమానాలు పొందారు. హైదరాబాద్‌లో చదివే రోజుల్లో పేదరికం అనుభవించారు. నవ్వుతూ, నవ్విస్తూ అందర్నీ ఆకట్టుకోవడం ఆయన లక్షణం అందుకే ఆయనకు మిత్రులు అధికంగా వుండేవారు. అప్పట్లో హిందూ – ముస్లింల మధ్య తగాదాలు, వాటి మధ్య ఆజ్యం పోసే సంస్థల పట్ల ఆందోళన చెందారు. దేశ పరిస్థితి, ప్రజాతంత్ర లౌకిక వాదం పై జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాలు మఖ్దూంను ఆకర్షించాయి. జాతీయోద్యమం, సామ్యవాద అనుకూల, సామ్రాజ్యవాద వ్యతిరేక దృక్పథాల పట్ల మొగ్గు చూపేవారు. నియాజ్ ఫతేపూర్ అనే పాత్రికేయుడు ‘నిగార్’ లో రాసే వ్యాసాలు, కవితల ప్రభావంతో 1934లో మఖ్దూం ‘టూర్’ అనుభవ గీతం ద్వారా తన కవితా తృష్టకు అక్షర రూపం కల్పించారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఫాసిజానికీ వ్యతిరేకంగా కలం పట్టి ఆయన రాసిన ”తిలింగన్”, ”సాగర్ కె-కినారె” కవితలు సుర్భ్ సవేరా, చారహగర్, అంథేర కవితా గేయాలు లిఖించారు. .
”హయాత్ లేకే చలో, కాయనాత్ లేకే చలో
చల్తే సారె జమానెకు సాధ్ లేకే చలో”
‘ఏక్ హోకర్ దుశ్మన్ పర్ వార్కార్ సక్తెహై హమ్
ఖూన్ కా భర్పూర్ దరియా పార్కర్ సక్తెహై హమ్”
అంటూ యువతలో ఐక్యత నింపిన కవితలు ఎన్నో నేడు పాఠ్యాంశాలుగా వున్నాయి. ఆయన రాసి నటించిన ‘విదురుల గృహాలు’ నాటకం చూసిన రవీంద్రనాథ్ ఠాగూర్ ముగ్ధుడై శాంతినికేతన్ చు ఆహ్వానించారు.
1936 లో ఆయనకు కమ్యూనిస్టులతో మైత్రి ప్రభావంతో మఖ్దూం ‘ది అంజుమనె తరభ్భీ ఉర్దు’ ప్రగతిశీల రచయితల సంఘం ప్రారంభించారు. నర్సింగరావు, అఖ్తర్ హుసేన్, రాయపూరిలాంటి వారితో కలిసి సరోజినీ నాయుడు గృహంలో సమకాలీన రాజకీయాల మీద, సాహిత్యం మీద జరిగే చర్చలలో పాల్గొనేవారు. 1939లో ద్వితీయ ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సిపాయి, అంథేరి (చీకటి) గేయాలు రాసారు. ‘అంథేరా’ కవిత ఉత్తమ కవితగా ప్రశంసంలు పొందింది. హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో మిత్రులతో కలిసి కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు.
1941లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం అధ్యాపక వృత్తికి రాజీనామా చేసి, కమ్యూనిస్టు ఉద్యమానికి పూర్తిగా అంకితం అయ్యారు. అప్పటి నుండి తుది శ్వాస వరకు మఖ్దూం మొహిద్దీన్ కమ్యూనిస్టుగా పూర్తి పార్టీ సేవలకు పరిమిత మయ్యారు. 1942 క్విట్ ఇండియా సందర్భంగా ఆయన ఉద్రేకపూరిత ప్రసంగాలకు , బ్రిటీష్ ప్రభుత్వం మఖ్దూంను అరెస్టు చేసి మూడు నెలల జైలుశిక్ష విధించింది. జైలులో జాతీయోద్యమకారులు, నిజాం స్టేట్ కాంగ్రెస్ నేతలు స్వామీ రామానందతీర్ధ, అచ్యుత్‌రావు దేశపాండే వంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. 1946లో మఖ్దూం కార్మికోద్యమ నిర్మాణం కోసం నడుం బిగించారు. హైదరాబాద్ కార్మిక సంఘాన్ని స్థాపించి అధ్యక్షునిగా పూర్తి శక్తియుక్తులు ధారపోశారు. రాష్ట్ర కార్మికోద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన మఖ్దూంను 1953లో వియన్నాలో ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పంపింది. తిరిగి వచ్చి ఆ సంస్థ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నాటి నిజాం వ్యతిరేక ఉద్యమంలో మఖ్దూం ప్రముఖంగా పాల్గొన్నారు. 1951 మార్చిలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించిన పుడు మఖ్దూం అరెస్టయ్యారు. 1952 పార్లమెంట్ ఎన్నికలపుడు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున హైదరాబాద్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు., తరువాత అసెంబ్లీ ఉప ఎన్నికలలో హుజూర్నగర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.
మొహిద్దీన్ సేవలను గుర్తించి కమ్యూనిస్టు పార్టీ ఆయనను శాసన మండలికి పంపింది. 1958లో ఆయన కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా, 1967 నుండి కన్ను మూసేవరకు ఎం.ఎల్.సి.గా కొనసాగారు. ఆయన ఉర్దూలో రాసిన గజళ్ళు, కవితలు కొన్నింటిని గజ్జల మల్లారెడ్డి, దాశరథి, సి. నారాయణరెడ్డి, కౌముది వంటి ప్రముఖులు తెలుగులో అనువ దించారు. అగ్నిగుండం, నిరీక్షణ, తెలంగాణ, ఫగ్పూర్ ఆత్మ, ప్రజల హృదయాలను తట్టిలేపాయి.
‘ఆజాదీ-ఎ-వతన్’, హవేలీ, జంగ్ ఇలా ఎన్నో కవితలతో ప్రజలను ఉద్యమాల వైపు పిలిచారు. నలభై రెండేళ్ళ క్రితం 1969 ఆగస్టు 25న ఢిల్లీలో కన్నుమూసారు మఖ్దూం మొహిద్దీన్. మఖ్దూం మరణానికి ప్రముఖ కవి ఖాజా అహమ్మద్ అబ్బాస్ నివాళులర్పిస్తూ ఆయనను జ్వాలత్రభా దీప్తి జ్వాల, హిమశీతల మహీనమాల, విప్లవ కాహళి, మంజీర ఝణం ఝణా రవళి, విద్య, ఆచరణ, విజ్ఞానం అని అభివర్ణించారు.. ప్రగతిశీల భావాలు కల యువతీ యువకులకు, తెలంగాణ ప్రజాలకు ఆయన జీవితం స్ఫూర్తి దాయకం….
నరేష్ జాటోత్.
ఎం ఏ. బీఈడీ .
కాకతీయ విశ్వవిద్యాలయం(8247887267)