Take a fresh look at your lifestyle.

“ప్రజల మనిషి, వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి”

(నేడు  వర్ధంతి సందర్భంగా)

ఆయన ఒక ఉద్యమకర్త, సేవాశీలి, కమ్యునిష్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయులు, నవలలకు ప్రాణం పోసిన మేదావి, ధిక్కార స్వరం, వైతాళికుడు, అభ్యుదయ రచయిత. వట్టికోట ఆళ్వారుస్వామి. ‘ప్రజలమనిషి’ నవల ద్వారా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. గ్రంధాలయోద్యమకారుడిగా, ప్రచురణకర్తగా విశిష్ట పాత్ర పోషించారు.”ఒక సందర్భంలో అసలు ఆళ్వార్లు పన్నెండు మందే, పదమూడో ఆళ్వారు మా వట్టికోట ఆళ్వారు స్వామి” అని మహాకవి దాశరథి కీర్తించిన నిస్వార్థ సేవా పరాయణుడు వట్టికోట ఆళ్వారుస్వామి.

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం (నకిరేకల్‌ సమీపం) మాధవరంలో 1915 నవంబర్‌ ఒకటిన, ఒక బ్రాహ్మణ కుటుంబంలో వట్టికోట ఆళ్వారుస్వామి జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, కష్టించి పనులు చేసి జీవనం ఆగించారు. ప్రాథమిక విద్య భ్యాసానికి ఆయన నోచుకోలేదు. పదమూడు, పద్నాలుగేండ్ల వయసులో సూర్యాపేటలో గ్రంధాలయం ఆయన పరిచయం మొదలైంది. ఈ గ్రంధాలయంలో అనేక పుస్తకాలు చదువుకున్నారు. సొంతంగా తెలుగు మాత్రమే గాక ఇంగ్లీషు కూడా నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇళ్ళలో వంటపనులు, విజయవాడలో హోటల్‌ సర్వర్‌, హైదరాబాద్‌లో రీడర్వంటి అనేక జీవన ప్రయాణాలు చేశారు. చివరకి 1936-37లో హైదరాబాద్‌ గోల్కొండ పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌ ఉద్యోగంలో చేరారు.

అప్పటి నుండి 1961 ఫిబ్రవరిలో మరణించేవరకూ ఆయన జీవితమంతా సాహిత్య, సామాజిక కార్యక్రమాలకే అంకితమయ్యారు. కమ్యూనిస్టు కావడం వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చినా ఆయన వెరవలేదు. జైలు నుంచి బయటికొచ్చాక అనేక ఉద్యమాల్లో పనిచేశారు. స్టేట్‌ కాంగ్రెస్‌, ఆర్యస మాజం, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి సామాజిక, రాజకీయ, సాహిత్య సంస్థలన్నింటిలో చురుకయిన కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశారు. ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి కార్మికోద్యమ సంస్థలకు ముందు వుండి నాయకత్వం వహిస్తూ , తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి దూరమైనారు. 1959 లో కేరళలో నంబూద్రిపాద్‌ మంత్రివర్గాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్‌ చేయగానే, అందుకు నిరసనగా మళ్లీ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆళ్వారుస్వామి, 1938లో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఏర్పడటానికి ముందటి తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటంతో ‘ప్రజల మనిషి’ నవల రూపొందించారు.

ఆళ్వారుస్వామి మొదట్లో రచించిన కథల కన్నా ‘జైలు లోపల’ కథలు భాష, శైలి, కథనం, కథన శిల్పంలో ముక్యమయినవి.. ఆయన కథా రచనలో చేసిన సాధన, కథన శిల్పంలోని ప్రస్థానం తెలుగు సాహి త్యంలో కొన్ని ఉత్తమమైన, అపురూపమైన కథలను సృష్టించాయి. తెలుగు సాహిత్యానికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ మాండలికంలో, సహజ సుందరమైన శైలిలో వాస్తవిక జీవితాలకు కథనరూపమిచ్చిన సజీవ శిల్పాలుగా వట్టికోట ఆళ్వారుస్వామి కథలు నిలిచిపోతాయి. కథకునిగా, నవలాకారునిగా, ప్రజా ఉద్యమ నాయకునిగా ఆళ్వారు స్వామి జీవితకాలమంతా చేసిన కృషి ఈనాటి రచయితలకీ, కవులకీ ఆదర్శప్రాయం. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ఆరు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించిన రచయిత ఆళ్వారుస్వామి. 1961 ఫిబ్రవరి 5 న మరణించారు. ప్రతి కవి,రచయిత ఆయనను స్పూర్తిగా తీసుకొని సమాజ వికాసానికి కృషి చేయాలి. నల్లగొండ జిల్లాకి వట్టికోట జిల్లాగా పేరు పెట్టాలి. కాంస్య విగ్రహం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయాలి. ఆయన వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలి. — కామిడి సతీష్ రెడ్డీ,జడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .9848445134.

Leave a Reply