Take a fresh look at your lifestyle.

‌ప్రజా సేవకుడు ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ఐఏఎస్‌

జీవితమంతా అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కృషిచేసిన ‘‘ప్రజల ఐఏఎస్‌ అధికారి ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌’’. ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే నిజాయితీ, నిరాడంబరత, మానవీయత ,పేదల పక్షపాతి, నైతికత గురించి మాట్లాడు కోవడమే అవుతుంది. ప్రజల వద్దకు పాలన అంటే ఎలా ఉంటుందో ఆచరణలో చూపించిన మహోన్నత వ్యక్తి. తమిళనాడులోని తంజావూర్‌ ‌లో 1934 అక్టోబర్‌ 22‌న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు .

1956లో ఐఏఎస్‌ ‌గా చేరిన ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ‌గారు 1971-73 మధ్యకాలంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కుమార మంగళం వద్ద స్పెషల్‌ అసిస్టెంట్‌ ‌గా పనిచేసిన కాలంలో బొగ్గు గనులను జాతీయం చేసిన కార్యక్రమంలో ఆయన పాత్ర అత్యంత కీలకం.ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో దళిత, ఆదివాసుల సంక్షేమానికి,అభ్యున్నతికి,అభివృద్ధికి అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరిచారు. ఒక్క ఏడాదిలోనే 120 కి పైగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన ఘనత ఆయనకే దక్కింది .అందులో వందకి పైగా ఉత్తర్వులు శంకరన్‌ ‌గారి సంతకంతో ఉండటం అనేది ఆయన నిజాయితీ తార్కాణం.ఎస్‌.ఆర్‌.‌శంకరన్‌ అం‌టే ఆదివాసీలకు ఎనలేని అభిమానం.వారి అభివృద్ధే లక్ష్యంగా పని చేసిన గొప్ప మానవావాది. కోట్లాది మంది దళిత ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపిన అసలు సిసలైన ప్రజా సేవకుడు. వారి అభివృద్ధి కొరకు సమీకృత ఆదివాసి అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకం .1984లో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కొరకు సాంఘిక సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కింది. వాటిని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు మరియు సాంస్కృతిక అంశాల యందు ప్రావీణ్యం పొందేలా కృషి చేశారు.1976 లో వచ్చిన వెట్టిచాకిరి నిషేధ చట్టం ఆయన కృషి ఫలితమే.1987 లో పాలమూరు జిల్లా ఆకలి కేకలతో అలమటిస్తున్న సందర్భంలో రెండున్నర సంవత్సరాలకు పైగా కూలి జనాలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఆయన చొరవ మరపురానిది.

ఆయన వ్యక్తిత్వానికి గుర్తుగా పాలమూరు జిల్లా ప్రజలు 2011 అక్టోబర్‌ 7‌వ తేదీన వనపర్తి పట్టణంలో పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌సహకారంతో జనశ్రి సంస్థ ఆధ్వర్యంలో ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ‌గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. చరిత్రలో ఒక ఐఏఎస్‌ అధికారికి విగ్రహం నెలకొల్పడం అనేది శంకరన్‌ ‌గారిదే మొదటిది అని చెప్పవచ్చు.భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 2005లో పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించగా శంకరన్‌ ‌గారు సున్నితంగా తిరస్కరించడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కలెక్టరుగా పని చేస్తున్నప్పుడు అక్కడి మహిళా కళాశాలలో సరైన వసతులు లేవని తెలిసి కలెక్టర్‌ ‌బంగ్లా కళాశాల కొరకు వాడుకోమని చెప్పిన గొప్ప వ్యక్తి . వారు ఏ రోజు కూడా తన సొంత పనులకు ప్రభుత్వ వాహనం వాడిన సందర్భాలు లేవు.

1987లో నక్సల్స్ ‌ఖైదీలను విడుదల చేయమని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం లోని గ్రామంలో శంకరన్‌ ‌తో సహా 11 మంది అధికారులను మావోయిస్టులు నిర్బంధించారు. ఆ తర్వాత 12 రోజులకు వారందర్నీ విడుదల చేశారు. అక్కడ కూడా అతను వారిపై తన ఆశయాలను శాశ్వత ముద్ర వేశారు. 2004లో ప్రభుత్వంతో మాట్లాడి నక్సలైట్లను శాంతి చర్చలకు ఆహ్వానించడంలో తాను స్థాపించిన పౌర స్పందన వేదిక ద్వారా ముఖ్యమైన అనుసంధాన కర్తగా పనిచేశాడు. దేశ చరిత్రలోనే ఇది ఒక అసాధారణమైన ఘటన గా చెప్పవచ్చు. మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్‌ ‌తో కలిసి ‘‘కర్మచారి ఆందోళన్‌’’అనే సంస్థను స్థాపించి పాకి పని వారి విముక్తికై దేశవ్యాప్త ఉద్యమం చేసి ప్రభుత్వం వారి సంక్షేమంపై దృష్టి సారించేలా చేయడంలో కృతకృత్యు లయ్యా రు.1985లో జరిగిన కారంచేడు ఘటన బాధితులకు పునరావాసం కల్పించుటలో కీలక పాత్ర పోషించారు. త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలంలో అక్కడ కేంద్ర పారా మిలటరీ దళాల అరాచకాలకు అడ్డు కట్టవేసేందుకు తన శక్తి మేర ప్రయత్నించారు.

తనకంటూ సొంత ఇల్లు కూడా లేని నిరాడంబరి. ఉన్నత భావాలతో వెనుకబడిన వర్గాల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం సమాజంలో మార్పు ఆశించిన ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ‌గారు బ్రహ్మచారిగా తన జీవితాన్ని గడిపారు .కుటుంబ సభ్యులు లేనంత మాత్రాన ఆయన ఏనాడు ఒంటరి వాడినని అనుకోలేదు. పేద ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు తన కుటుంబం అని నమ్మినవారు .పేద ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని అనుక్షణం ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి.ఐఏఎస్‌ అధికారులు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు ఏ స్థాయిలో సేవచేసి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చో ఆచరణలో చేసి చూపించిన ప్రజా సేవకుడు.రాజ్యాంగం, న్యాయవ్యవస్థ ,ప్రభుత్వ పాలన ఏ విభాగాలైన సరే వారి ప్రథమ కర్తవ్యం అట్టడుగు వర్గాల సమస్యలు పరిష్కరించడమే అని బలంగా నమ్మిన వ్యక్తి. ‘‘ నిరుపేదల పాలనే ప్రజల పాలన’’అని నమ్మి వారి సంక్షేమం కొరకు పాలనా వ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ఐఏఎస్‌ ‌గారిది.పదవి విరమణ అనంతరం తనకు వచ్చిన పెన్షన్‌ ‌డబ్బులను కూడా పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థుల చదువుకోసం ఖర్చు చేసిన మహనీయుడు. వీధిబాలల, వికలాంగుల ఆశ్రమాలు నడిపే వారికి తనకు వీలైనంత మేర ఆర్థిక సహాయం అందజేశారు.

ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ‌గారు 2010 అక్టోబరు 7న హైదరాబాద్‌ ‌లో అస్తమించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి ‘‘ప్రజల ఐఏఎస్‌ అధికారి’’గా పేద ప్రజల గుండెల్లో గొప్ప మానవ తావాదిగా నిలిచిపోయిన నిరాడంబరమైన జీవితం గడిపిన ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ఐఏఎస్‌ ‌గారి జీవితం నేటి అధికారులకు స్ఫూర్తిదాయకం.ఆయన స్ఫూర్తితో ఆయన సూచించిన మార్గంలో నేటి తరం నడుస్తుందని ఆయన ఆశయాలను కొనసాగిస్తారని ఆశిద్దాం.

( అక్టోబర్‌ 07 ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ఐఏఎస్‌ ‌గారి వర్ధంతి సందర్భంగా)
– పుల్లూరు వేణుగోపాల్‌ 9701047002

Leave a Reply