Take a fresh look at your lifestyle.

జలజగడాలుండవనుకున్నాం…

ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనబర్చిన స్నేహపూర్వక వాతావరణంతో ఇకముందెన్నడూ ఇరు రాష్ట్రాల మధ్య జలజగడాలుండవనుకున్నాం. ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరినొకరు అర్థంచేసుకుంటూ, స్నేహహస్తాన్ని చాపుకుంటూ పోతుంటే ఇక ఈ రెండు రాష్ట్రాల మధ్య స్నేహమేగాని జగడాలుండవనుకున్నారు. కాని ఏపి తీరు మాత్రం ‘వెనుకటి గుణమేల మాను…’ అన్న తీరుగానే ఉంది. తెలంగాణ ఏర్పడిందే నీరు, నిధులు, నియామకన్న ట్యాగ్‌లైన్‌తో. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో నీటి వాటా విషయంలో మొదటినుండీ తెలంగాణకు అన్యాయం జరుగుతూనే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా మొదటి అయిదేళ్ళు జలజగడాలు కొనసాగుతూనేవచ్చాయి. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ వివాదాలకు స్థానం లేకుండా పోయిందన్న భావన కలుగుతూ వచ్చింది. ఎవరికీ వినియోగపడకుండా సముద్రం పాలవుతున్న నీటిని ఒడిసిపట్టుకుని తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాలన్న దృక్పథంతో  ఏపికి సంబంధ లేకుండా కొత్త ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్‌ ‌దృష్టిపెట్టింది. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఏపి సర్కార్‌ అకస్మాత్తుగా తనవైఖరిని మార్చుకున్నట్లుగా ఉంది. గతంలో లాగానే జలవివాదానికి చోటుకల్పిస్తున్నది. కృష్ణానదిలో తమవాటా ఎంత అని అడిగి అడిగి అలసిపోయిన తెలంగాణకు ఇప్పుడు మరోసారి కృష్ణా నీటి వివాదం మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద లిఫ్టుచేస్తూ కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలని ఏపి తీసుకున్న నిర్ణయం మరోసారి ఇరురాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కృష్ణా జలాలపై కొత్తగా నీటి ప్రాజెక్టులను నిర్మించదలచుకుకుంటే ముందుగా అపెక్స్ ‌కమిటీకి చెప్పాలన్న నిబంధనను ఏపి ప్రభుత్వం తుంగలో తొక్కడమే ఈ వివాదానికి కారణమైంది. జగన్‌ ‌ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్దన్నగా తగినసూచనలు, సలహాలు ఇస్తున్న సిఎం కెసిఆర్‌కు ఇది నిజంగానే ఎదురు దెబ్బ. జగన్‌ ‌ప్రభుత్వం డిజైన్‌ ‌చేసిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని పలు జిల్లాలకు నీటి కొరతఏర్పడే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వానికి గాని, అఎక్స్ ‌కమిటీకి గాని ఏమాత్రం సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దశాబ్దాలుగా కరువు ప్రాంతంగా పేరున్న నల్లగొండ జిల్లాకు ముఖ్యంగా తాగునీటి సమస్య పునరావృతమయ్యే అవకాశముంది. దానితో పాటు రంగారెడ్డి జిల్లా కూడా ఇదే సమస్యను ఎదుర్కోక తప్పదు.
శ్రీశైలంలో 881 అడుగుల నీరున్నప్పుడే పోతిరెడ్డి పాడునుంచి 44వేల క్యూసెక్కులు తీసుకునే అవకాశముంది. అయితే ఆ స్థాయి నీటిమట్టం సంవత్సరానికి సగటున కేవలం పదిరోజులు మాత్రమే ఉంటుంది. ఈ పది రోజుల్లోనే కరువు ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్ళు తరలించుకోవాల్సి ఉందని, అందుకోసమే ఈ ప్రాజెక్టును చేపట్టామని, దీన్ని మానవతా ధృక్పథంతో చూడాలని చెబుతున్న ఏపి  ప్రభుత్వం పోతిరెడ్డి సామర్థ్యాన్ని పెంచి  కృష్ణా జలాలను తరలించుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయంలో పరిపాలన అనుమతులనిస్తూ 203 జివోను తీసుకొచ్చింది. ఇదిప్పుడు ఇరు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం లేపుతున్నది. ఇది నిజంగానే నిర్మాణమైతే తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు సామర్థ్యం విద్యుత్‌ ఉత్పాదనతో కలిపి 64 వేల క్యూసెక్కుల వరకుంది. ఇంకో 20వేల క్యూసెక్కులు పెంచితే ఏపీ భారీగా శ్రీశైలం నీటిని తరలించుకుపోయే అవకాశమేర్పడుతుంది. దీంతో శ్రీశైలంపైన ఆధారపడ్డ తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర విఘాతమేర్పడుతుందన్నది సుస్పష్టం. తెలంగాణ ప్రభుత్వం సుమారు 120 టిఎంసీల సామర్థ్యంతో చేపట్టిన కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు నీరుగారిపోనున్నాయి. ఈ వివాదం ఇప్పుడు కృష్ణా ట్రిబునల్‌ ‌వద్దకు చేరింది. ట్రిబ్యునల్‌ ‌నిర్ణయాన్ని తెలుపకముందే పనులు చేపట్టడానికి ఏపి ప్రభుత్వం సిద్ధపడుతున్నది. తమకు కేటాయించిన నీటివాటానే వాడుకుంటామని నమ్మబలుకుతోంది. ఏదేమైనా ఇరు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుంటామన్న ఇద్దరు ముఖ్యమంత్రులిప్పుడు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడానికి సిద్దపడుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై అవసరమైతే కోర్డుకు వెళ్ళడానికైనా సిద్ధమంటోన్న తెలంగాణ ప్రభుత్వాన్ని స్థానిక ప్రతిపక్ష పార్టీలు ఘాటుగానే విమర్శిస్తున్నాయి. పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌ ‌దీనిపై తీవ్రంగా స్పందిస్తూ నీళ్ళపై మాట్లాడి అథికారంలోకి వచ్చిన కెసిఆర్‌, ఈనీటిని ఏపికి దారదత్తం చేయడం క్షమించరానిదని విమర్శిస్తుండగా, మాజీ మంత్రి, బిజెపి నేత డికె అరుణ  జగన్‌తో కెసిఆర్‌కు రహస్య ఒప్పందమేదో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏచర్యనైనా ఎదిరిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొంటున్నారు. ఇది ఇద్దరు సిఎంలు కలిసి ఆడుతున్న నాటకమని, పోతిరెడ్డుపాడు పనులు మొదలైతే సిఎంగా కెసిఆర్‌ ‌వెంటనే రాజీనామా చేయాల్సిందేనంటూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ ‌చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య  ఇప్పుడు యుద్ధ వాతావరణానికి కారణంగా మారింది

Leave a Reply