- ఎక్కడా ఆక్సిజన్‌కు, మందులకు కొరత లేదు
- కొరోనా చికిత్సకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది
- మాతా శిశుసంరక్షణ కోసం కేంద్రాల ఏర్పాటు
- సూర్యాపేట మాతాశిశు కేంద్ర ప్రారంభోత్సవంలో మంత్రులు ఈటల, జగదీశ్వర్ రెడ్డి
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని.. మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సూర్యాపేటలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. రూ. 17 కోట్లతో 250 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఈటల వి•డియాతో మాట్లాడుతూ..కొరోనా సెకండ్ వేవ్‌లో సరిహద్దు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. నూటికి 95 శాతం పేషేంట్స్‌కు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం లేకుండా చికిత్స పొందుతున్నారన్నారు. కేవలం 5 శాతం మాత్రమే హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారన్నారు. ఏడాది కాలంగా 99.5 శాతం నయమై ఇంటికి వొచ్చారన్నారు.
రాష్ట్రంలో వందల సెంటర్లలో కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కావొద్దని, ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఈటల తెలిపారు. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కొరోనా రోగులకు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని తేల్చిచెప్పారు. హాస్పిటళ్లలో పడకలు దొరకడం లేదన్న పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ రోగుల్లో 5 శాతం మందిలోనే అనారోగ్య సమస్యలు వొస్తున్నాయని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్టు పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ రోగులకు ప్రభుత్వం మెరుగైన సేవలందిస్తున్నదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇకపోతే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఇక నుంచి పూర్తిగా కోవిడ్ వైద్య సేవలు అందించనున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకలతో మరో పక్కా భవనంలోకి మార్చామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొరోనా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.