ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కొరోనా వైరస్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రజలకు సూచించారు. శుక్రవారం కమలాపూర్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు మాస్కులు, శానిటైజర్లు ఎప్పటికీ ఉపయోగించేవిధంగా చూడాలని సూచించారు. ఇతర రాష్ట్రానికి చెందిన వారి వివరాలను తెలియజేయాలన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో గత నెల రోజులుగా కరోనా కేసులు నమోదు కాలేదని, ఆశ వర్కర్లు ప్రతి రోజు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రికి జ్వరం, జలుబుతో వచ్చినప్పుడు అన్ని విధమైన పరీక్షలు నిర్వహించాలన్నారు. కొరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా వైద్యాధికారి లలితా దేవి, డిప్యూటీ వైద్యాధికారి యాకుబ్ పాషా, డిఎస్ఓ డాక్టర్ కృష్ణా రావు, కమలాపూర్ వైద్యాధికారిని డాక్టర్ సంయుక్త, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.