Take a fresh look at your lifestyle.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరుగుతున్న కొరోనా కేసులు భయాందోళనలో ప్రజలు

స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ‌ప్రజల జీవన విధానంలో మార్పులు

స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌వైపు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కొరోనా కేసులు భారీగా నమోదు అయితున్న దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌విధించడంతో వైరస్‌ను నియంత్రించవొచ్చునని భావించారు. నెలల తరబడి లాక్‌డౌన్‌ ‌పొడిగించినా కేసులు తగ్గకపోవడంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు క్షీణించడంతో లాక్‌డౌన్‌ ‌దశల వారిగా సడలించి సామాజిక భౌతిక దూరం, మాస్క్, ‌శానిటైజర్‌లను ఉపయోగించి వ్యాపారం నిర్వహించుకోవాలని ప్రభుత్వాలు సూచించినా రోజు రోజుకు కేసులు పదుల సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజల్లో, వ్యాపారస్తుల్లో భయాందోళన మొదలైంది. సరిపడా ఐసోలేషన్లు, వెంటిలేటర్లు లేక ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల వైపు వైరస్‌ ‌బాధితులు పరుగులు తీస్తున్నారు. ఇది ఆసరాగా చేసుకొని లక్షల్లో కార్పొరేట్‌ ‌వ్యవస్థలు డబ్బులు దండుకుంటున్నాయి. కొరోనాను నియంత్రించాలంటే స్వీయ నిర్భంధం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ‌విధించుకుంటున్నారు. పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్తుండటంతో వైరస్‌ ‌పల్లెలకు సైతం వ్యాప్తి చెందడంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, మే•ర్‌ ‌పంచాయతీలలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులను తెరుస్తున్నాయి.

మేజర్‌ ‌పట్టణాలయిన మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, నకిరేకల్‌, ‌హుజూర్‌నగర్‌, ‌తిరుమలగిరి, భువనగిరి, యాదాద్రి జిల్లా, రామన్నపేట, నేరెడుచర్ల జిల్లాల్లో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు లాక్‌డౌన్‌ ‌విధించుకుంటున్నారు. కొరోనా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజూ వెలువడే కొరోనా బులిటెన్‌లో కూడా అవకతవకలు వస్తున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. మరి ముఖ్యంగా వైరస్‌ ‌బాధితుల వివరాలు తెలపకపోవడంతో వారితోటే తాము సన్నిహితంగా ఉండటం జరుగుతుందని, వారి వల్ల తమకు కూడా వైరస్‌ ‌వ్యాప్తి చెందె అవకాశం ఉందని, దీని వల్ల కుటుంబం మొత్తం ప్రమాదం ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొరోనా వచ్చిన వ్కక్తులు హ•ం క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం, డాక్టర్లు సూచిస్తున్నా వాటిని పట్టించుకోకుండా ప్రజల మధ్యనే తిరగడంతో తమకు కూడా సోకే ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజల్లో భయాందోళన ఉంది. కొరోనా సోకిన పరిసరాలలో సరైన విధంగా సానిటైజేషన్‌ ‌చేయకపోవడంతో మరింత విస్తరించే ప్రమాదం ఉందని పలువురు మేధావులు అంటున్నారు. ఒకప్రక్క జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు వ్యాపారస్తులతో టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహిస్తూ కొరోనా నియంత్రించాలంటే సామాజిక భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరిగా ఉండాలని, ప్రభుత్వం నియంత్రణకు చర్యలు తీసుకుంటుందని ఎవరూ భయాందోళనకు చెందవొద్దని చెప్తూ వ్యాపార సంఘాలతో వ్యాపార సమయాన్ని కుదించాలని సూచించారు. ప్రజలు ఒక పక్క భయపడుతూనే నాకు ఏమయితదిలే అనే విధంగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కొంతమంది వ్యాపారస్తులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యాపారం నిర్వహిస్తుండడంతోనే వైరస్‌ ‌వేగంగా విజృంభిస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. రెక్కాడితేనే కాని డొక్కాడని చిరువ్యాపారులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వ్యాపారాలు నిర్వహిస్తు వైరస్‌ ‌భారిన పడుతున్నారు. అధికారుల ఉదాసీన వైఖరితో వైరస్‌ ‌మరింత వ్యాప్తి చెందె ఆస్కారం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

వ్యాపారాలు నడవక మూతపడుతున్న దుకాణాలు
కొరోనా దెబ్బతో వ్యాపారాలు నడవక, కిరాయిలు కట్టలేక, చేసిన అప్పులు తీర్చలేక, దాచుకున్న డబ్బులు, భార్యపై ఉన్న బంగారు పుస్తెల తాడును సైతం తాకట్టుపెట్టి తెచ్చినా కూడా వ్యాపారాలు నడవక అప్పుల ఊబిలో ఇరుక్కొని చిన్నతరహా వ్యాపారులు పల్లెబాట పడుతున్నారు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయం, కులవృత్తుల వైపు మొగ్గుచూపుతున్నారు.

కొరోనా ప్రభావంతో ప్రజల జీవన విధానంలో మార్పు
లాక్‌డౌన్‌ ‌సడలించిన తరువాత రోజు రోజుకు పెరుగుతున్న కొరోనా కేసులతో ప్రజల జీవన విధానంలో మార్పులు కన్పిస్తున్నాయి. బంధువులను కూడా తమ నివాసాలకు పిలవడానికి ఇష్టపడటం లేదు. సన్నిహితులు కూడా ఒకరికొకరు కలవకపోవడం, కలిసినా మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి నేడు కనపడటం లేదు. దగ్గరకు వెళ్లి మాట్లాడాలన్నా ఇష్టపడటం లేదు. ఎక్కడేక్కడా తిరుగుతున్నారో, వారికి కొరోనా ఉన్నదో, వారి వల్ల తమకు ఏమైన వస్తుందేమో అనే భయంతో దూరంగా పెడుతున్నారు. శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు పెట్టింది పేరు. ఎక్కడో ఒక చోట జరిగే పెళ్లిళ్లకు పట్టుమని 20, 30మంది కూడా హాజరయ్యే పరిస్థితి నెలకొంది.

రాఖీ పండుగపై కూడా కొరోనా ప్రభావం
రాఖీ పండుగ వచ్చిందంటే అక్కా, చెల్లెల్ల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి రాఖీ పండుగ నాడు ప్రేమతో వెళ్లి సోదరులకు రాఖీ కట్టాలన్నా అక్కాచెల్లెళ్లు భయపడుతున్నారు. తమ వల్ల వారికి, వారి వల్ల తమకు ప్రాణాంతకమైన వైరస్‌ ‌వ్యాప్తి చెందుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఎంతో ప్రేమతో సోదరులకు రాఖీ కట్టాలని మనసులో ఉన్నా చేయలేక బాధపడుతున్నారు.

Leave a Reply