Take a fresh look at your lifestyle.

గూడు లేని జనం గుండె..(బీహార్‌)ఎమ్మెల్యే మహబూబ్‌ ఆలం

“కతిహార్‌ ‌జిల్లా బలరాంపూర్‌ ‌నుంచి గెలుపొందిన మహబూబ్‌ ఆలం శివానంద్‌ ‌పూర్‌లో ఓ చిన్న ఇంటిలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో 30 వేల బ్యాంకు బ్యాలెన్స్, 9 ‌లక్షల విలువగల వ్యవసాయ భూమిని పేర్కొన్నాడు. వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నాడు. శాసనసభ్యుడిగా వొచ్చే వేతనం 80 వేల రూపాయలు పార్టీకి ఇస్తున్నాడు. జుహి మొహబూబా ఆయన సతీమణి, ఐప్వా మహిళ ఉద్యమ కార్యకర్త. 4, 9 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నారు. ఆ ప్రాంత ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాలతో పోరాడుతూ ఎమ్మెల్యేగా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాడు.”

మహబూబ్‌ ఆలం జనం మనిషి. జనం నమ్ముకున్న పోరాటయోధుడు. సొంత ఇల్లు లేని ఎమ్మెల్యే నాలుగోసారి బీహార్‌ అసెంబ్లీలో అడుగు పెట్టాడు. 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులు అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో కాలినడకన వెళ్లే మహబూబ్‌ ఆలం చర్చలోకి వచ్చాడు. సిపిఐ(ఎంఎల్‌) ‌లిబరేషన్‌  ‌కేంద్ర కమిటీ సభ్యులు, శాసన సభ పక్షా నాయకుడు ఆయన. మాటలు చెప్పడంలోనే కాదు సిద్ధాంతాన్ని, ఆదర్శాలను ఆచరణలో పెట్టిన వాడు. ప్రత్యర్థుల నుంచి కుట్ర కేసులు ఎదుర్కొని జనం గుండెకాయగా నిలుస్తున్న మహబూబ్‌ ఆలం నవతరానికి దిక్సూచి లాంటివాడు.

కతిహార్‌ ‌జిల్లా బలరాంపూర్‌ ‌నుంచి గెలుపొందిన మహబూబ్‌ ఆలం శివానంద్‌ ‌పూర్‌లో ఓ చిన్న ఇంటిలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో 30 వేల బ్యాంకు బ్యాలెన్స్, 9 ‌లక్షల విలువగల వ్యవసాయ భూమిని పేర్కొన్నాడు. వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నాడు. శాసనసభ్యుడిగా వొచ్చే వేతనం 80 వేల రూపాయలు పార్టీకి ఇస్తున్నాడు. జుహి మొహబూబా ఆయన సతీమణి, ఐప్వా మహిళ ఉద్యమ కార్యకర్త. 4, 9 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నారు. ఆ ప్రాంత ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాలతో పోరాడుతూ ఎమ్మెల్యేగా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాడు. తనకు సొంతిల్లు లేకపోవడంపై ‘‘దేశంలో వేల మిలియన్ల కొద్ది మందికి ఇండ్లు లేవు. మన పోరాటం వారి కోసం. మనకోసం కాదు’’ అంటాడు 64 ఏండ్ల మహబూబ్‌ ఆలం.

1985, 1990 సంవత్సరాలలో బార్సోయి నియోజకవర్గం నుంచి సిపిఎం, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మొదటిసారి 14 వేల ఓట్లు, రెండోసారి 15 వేల ఓట్లు లభించాయి. గౌరవప్రదమైన ఓట్లు లభించి నాయకుడిగా గుర్తింపు సాధించాడు. రెండుసార్లు ఓడిపోయిన మహాబూబ్‌ ‌మూడోసారి మాత్రం సిపిఐ(ఎంఎల్‌)‌లిబరేషన్‌ అభ్యర్థిగా 2000 సంవత్సరంలో మళ్లీ పోటీ చేసి 62, 644 ఓట్లు సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టాడు.  ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పని చేస్తూ ప్రజానేతయ్యాడు. 2005 ఎన్నికలు వచ్చేసరికి మహబూబ్‌ ఆలం మీద అనేక కుట్రలు జరిగాయి. రెండో సారి కూడా  మహబూబ్‌ ‌గెలిచే అవకాశాలు ఉండడంతో ఓటర్‌ ‌లిస్టులో పేరు తొలగించారు. దీంతో ఆయన పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మహబూబ్‌ ఆలం సోదరుడైన మున్సాప్‌ ఆలం ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు.

2010 ఎన్నికల ముందు బార్సోయి నియోజకవర్గం రద్దయింది. దాని స్థానంలో బలరాంపురం నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన మహబూబ్‌ ఆలం 45,432 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. నియోజకవర్గ పునర్విభజన ప్రభావం ఆయనపై పడింది. దీంతో ఓటమి తప్పలేదు. 2009, 2014 కతిహార్‌ ‌లోక్‌ ‌సభ ఎన్నికలకు మహబూబ్‌ ‌పోటీ చేశాడు. 2014లో నామినేషన్‌ ‌దాఖలు చేయగానే మహబూబ్‌ను ఓ హత్య కేసులో ఇరికించి అరెస్టు చేశారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనకు కేసులు, జైలు జీవితం కొత్త కాదు. 13 కేసులు ఉన్నాయి. అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, బంద్‌లు కూడా జరిగాయి.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌ను ఓడించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకమై ప్రచారాన్ని సాగించాయి. అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఓడించాలని సర్వశక్తులూ ఓడ్డినప్పటికీ ఉత్కంఠగా జరిగిన ఆ ఎన్నికల్లో 2296 ఓట్లతో మూడో సారి గెలుపొందాడు. ఇటీవల జరిగిన 2020 ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమిలోని వికాష్‌ ‌షీల్‌ ఇన్సాన్‌ ‌పార్టీ (విఐపి) అభ్యర్థి బారున్‌ ‌కుమార్‌పై 53,597 ఓట్లతో విజయం సాధించాడు. మహబూబ్‌ ఆలంకు 1,04,489 ఓట్లు లభించగా, విఐపి అభ్యర్థికి 50, 892 ఓట్లు వచ్చాయి. ఖరీదైన కార్లలో, వందలాది మందితో ‘‘షో’’ చేసే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్న ఈ కాలంలో.. సామాన్యుడిగా జీవిస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహబూబ్‌ ఆలం అభినందనీయుడు. ఆయన నుండి ఈతరం ప్రజాప్రతినిధులు,  ముఖ్యంగా విద్యార్థి, యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

mamindla ramesh raja
మామిండ్ల రమేష్‌ ‌రాజా
7893230218

Leave a Reply