Take a fresh look at your lifestyle.

ప్రజలు బిజెపిని నమ్మడం లేదు..: కేజ్రీవాల్‌

  • ఢిల్లీ ఎంసిడి ఉప ఎన్నికల్లో బిజెపికి శరాఘాతం
  • ఐదు స్థానాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్న ఆప్‌
  • ఒక స్థానంలో కాంగ్రెస్‌ ‌విజయబావుటా

‌ఢిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (ఎం‌సీడీ) ఉప ఎన్నికల్లో ఆప్‌ ‌ఘనవిజయం సాధించింది. మొత్తం ఐదు స్థానాల్లో నాలుగింటిని ఆప్‌, ఒక స్థానాన్ని కాంగ్రెస్‌ ‌గెల్చుకుంది. అధికార బిజెపి ఒక్క సీటు కూడా గెల్చుకోలేక పోయింది. ఫిబ్రవరి 28న 5 ఎంసిడీ వార్డుల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బుధవారంనాడు వెలువడ్డాయి. ఆప్‌ 4 ‌సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ ఒక వార్డు గెలుచుకుంది.ఈ విజయంపై ఆప్‌ ‌చీఫ్‌, ‌ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌స్పందించారు. ఆప్‌పైన, ఢిల్లీ ప్రభుత్వంపైన ప్రజలు మరోసారి తమ నమ్మకాన్నిచాటుకున్నారని అన్నారు.

ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ కార్యకర్తలతో కేజీవ్రాల్‌ ‌మాట్లాడుతూ, ఆప్‌ ‌పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి వారు ఇచ్చిన తీర్పే నిదర్శనమని అన్నారు. 2015లో 70 సీట్లకు 67 సీట్లు మనం (ఆప్‌) ‌గెలుచుకున్నామని, 2020లో 70 సీట్లకు 62 గెలుచుకోగా, ఇప్పుడు ఎంసీడీ ఉపఎన్నికల్లో 5 సీట్లకు 4 సీట్లు గెలిపించి ’ఆప్‌’‌కు ప్రజలు వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో బీజేపీ వ్యవహరించిన తీరు ప్రజలకు నచ్చలేదని కేజీవ్రాల్‌ అన్నారు. ’నా నుంచి వాళ్లు (బీజేపీ) రూ.13,000 కోట్లు డిమాండ్‌ ‌చేశారు.

ఢిల్లీ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బేదో ఇచ్చేసింది. అయినప్పటికీ వాళ్లు మరింత ఇవ్వాలని అడుగుతూనే వచ్చారు. ప్రజలకు ఇది నచ్చలేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి ఏమాత్రం అధికారంలో ఉండే అర్హత ఉండదు’ అని కేజీవ్రాల్‌ అన్నారు. పదిహేను ఏళ్ల పాటు ఎంసిడీని ఏలిన బీజేపీకి ప్రజలు ’సున్నా’కే పరిమితం చేశారని అన్నారు. ఎంసీడీని అత్యంత అవినీతి శాఖగా బీజేపీ మార్చేసిందని, ఆ అవినీతిని ’ఆప్‌’ ‌ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నట్టు ప్రజలు ఇచ్చిన తీర్పు విస్పష్టంగా చెబుతోందని అన్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు నిజాయితీగా, ఎంతో హుందాగా బాధ్యతలు నిర్వహించాలని సూచించారు.

Leave a Reply