Take a fresh look at your lifestyle.

కేంద్రం అనాలోచిత నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

  • కేంద్రంపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌
  • ‌సిద్ధిపేటలో హైరిస్క్ ‌వ్యక్తులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన హరీష్‌రావు

సిద్ధిపేట, జూన్‌ 5 (‌ప్రజాతంత్ర బ్యూరో): జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని బాలాజీ ఫంక్షన్‌ ‌హాలులో శనివారం జిల్లాలో హై రిస్క్ ‌వ్యక్తులకు కోవిడ్‌-19 ‌వ్యాక్సినేషన్‌ (‌టీకా) కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వాక్సినేషన్‌ ‌విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యాక్సినేషన్‌ ‌విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్నారు. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్‌లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదనీ, కంపెనీలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోన్విడం లేదన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌ను కూడా కంపెనీల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ…రాష్ట్రాలను బదునాం చేసేలా కేంద్ర వ్యవహారం ఉందన్నారు. వ్యాక్సినేషన్‌ ‌సకాలంలో పంపిణీలో కేంద్రం విఫలమైందన్నారు. వ్యాక్సిన్‌ ‌పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను పున:సమీక్షించుకోవాలన్నారు.

వ్యాక్సినేషన్‌ ‌దిగుమతిని సరళతరం చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను కంపెనీలు, ఇతర దేశాల నుండి దిగుమతి చేసే చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. కోవాగ్జిన్‌, ‌కోవిషీల్డ్ ‌టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చిందన్నారు. రాష్ట్రాలకు కేటాయించే వ్యాక్సిన్లు ఎన్ని ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేక పోతున్నాయన్నారు. తెలంగాణలో హైరిస్క్ ‌స్కూల్‌ ‌గ్రూపులకు, ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే వ్యక్తులకు ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారన్నారు. రాష్ట్రంలోని 13నగర పాలక సంస్థలు, 129 మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయలు, పండ్లు విక్రేతలు, మద్యం విక్రేతలు, హోటల్స్‌లో పనిచేసే వ్యక్తులు, శ్మశాన వాటికలో పనిచేసే వ్యక్తులు, కిరాణా షాపులో పనిచేసే వ్యక్తులు మొదలైన 8 లక్షల 50 వేల మందికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శనివారం నుంచి 10రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, ప్రజలతో అనునిత్యం సంబంధాలు నెరిపే వ్యక్తులకు వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణలో కొరోనా కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటుందనీ, ఇప్పటికే కొరోనా కట్టడికి నిర్వహించిన ఇంటింట సర్వే మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ఒకవేళ కొరోనా థర్డ్‌వేవ్‌ ‌వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసే దిశగా సిఎం కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకున్నారనీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ఖాన్‌, ‌మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌కడవేరుగు మంజుల రాజనర్సు, కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌కెవి.రమణాచారి, ఏఎంసి ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, సుడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply