Take a fresh look at your lifestyle.

పెగాసస్‌, ‌వ్యవసాయ చట్టాలపై సభలో చర్చించండి

  • ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటన
  • ప్రతిష్టంభన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని వెల్లడి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, ఆగస్ట్ 4 : ఉభయ సభలలో పెగాసస్‌ అం‌శంపై చర్చించాలని డిమాండ్‌ ‌చేస్తూ విపక్షాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనితో పాటుగా ప్రతిపక్షాలు రైతుల సమస్యలు మూడు వ్యవసాయ చట్టాలపై చర్చలు జరపాలని డిమాండ్‌ ‌చేశాయి. పార్లమెంటులో నిరంతర అంతరాయానికి కారణం గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం చేసే ప్రచారం దురదృష్టకరం. పార్లమెంట్‌ ‌ప్రతిష్టంభన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం అహంకారంగా నిబ్బరం ప్రదర్శిస్తున్నది. ఉభయ సభలలో ఈ విషయం మీద చర్చ కోసం ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేదు’’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే జారీ చేసిన ప్రకటన పై ఎన్‌సిపికి చెందిన శరద్‌ ‌పవార్‌, ‌కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్‌ ‌శర్మ, డిఎంకెకు చెందిన టిఆర్‌ ‌బాలు, టిఎంసికి చెందిన డెరెక్‌ ఓ ‘‌బ్రియాన్‌, ఎస్‌పికి చెందిన రామ్‌గోపాల్‌ ‌యాదవ్‌ ‌మరియు ఆర్‌జెడి మనోజ్‌ ‌తదితరులు సంతకాలు చేశారు.

ఈ పరిణామాలు కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ మంగళవారం ఉదయం ప్రతిపక్ష నాయకుల సమావేశానికి నాయకత్వం వహించిన మరుసటి రోజు చోటు చేసుకున్నాయి. కోవిడ్‌ -19 ‌మహమ్మారి సమస్యలు పెగాసెస్‌ ‌రైతు సమస్యలు వంటి అనేక సమస్యలపై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయాలని రాహుల్‌ ‌పిలుపునిచ్చారు. సమావేశం తరువాత, రాహుల్‌ ‌నేతృత్వంలోని పలువురు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లి ఇంధన ధరల పెరుగుదలపై తమ నిరసనను వ్యక్తం చేశాయి. వారం రోజుల క్రితం ఇదే సమస్య మీద నిరసనగా పార్లమెంటుకు రాహుల్‌ ‌సర్ప్రైజ్‌ ‌ట్రాక్టర్‌ ‌రైడ్‌ ‌చేసిన విష్యం తెలిసిందే. ‘‘మిమ్మల్ని ఆహ్వానించడానికి ఏకైక ఉద్దేశ్యం ఏమిటంటే మనం ఏకం కావాలి. ఈ గొంతు ఎంతగా కలిస్తే అంత శక్తిమంతంగా మారుతుంది, ఈ గొంతును అణచివేయడం బిజెపి..ఆర్‌ఎస్‌ఎస్‌లకు మరింత కష్టమవుతుంది. ఐక్యత యొక్క పునాదిని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఐక్యత ప్రాధమిక సూత్రాలతో ముందుకు రావడం చాలా ముఖ్యం’’ అని గాంధీ సమావేశంలో అన్నారు. బిజెపి పార్లమెంటరీ సమావేశంలో పార్లమెంటులో పదేపదే నిరసనలు వ్యక్తం చేయడంపై విపక్షాలపై దాడి చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ‘‘ప్రతిపక్షం పార్లమెంటు కార్యకలాపాలను అనుమతించక పోవటం ప్రజాస్వామ్యానికి మరియు ప్రజలకు అవమానకరం.’’ అని అన్నారు.

వంట గ్యాస్‌ ‌ధర 13 సార్లు సవరింపు
గడిచిన 16 నెలల వ్యవధిలో వంట గ్యాస్‌ ‌ధరను 13 సార్లు సవరించినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ ‌తెలి రాజ్యసభకు తెలిపారు. మార్చి 2020 నుంచి ప్రభుత్వ ఎన్నిసార్లు వంట గ్యాస్‌ ‌ధరను సవరించింది, ఎంత మొత్తం పెంచిందని వైఎస్సార్సీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం వెల్లడించారు. 2020 మార్చిలో సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్‌ ‌సిలెండర్‌ ‌ధర 805 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 834 రూపాయలకు చేరినట్లు చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పాదనల ధరలను అంతర్జాతీయ మార్కెట్‌ ‌ధరలను అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది. సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేసే వంట గ్యాస్‌ ‌ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సబ్సిడీ లేని వంట గ్యాస్‌ ‌ధరను మాత్రం అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఆయిల్‌ ‌కంపెనీలు నిర్ణయిస్తాయని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 2019-20లో 23 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్‌ ‌రీఫిల్స్ ‌విక్రయించగా 2020-21లో ఈ సంఖ్య 35 కోట్లకు చేరిందని మంత్రి వెల్లడించారు.

కోవిడ్‌ ‌మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశంపై సంప్రదింపులు ..
కోవిడ్‌ ‌మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ ‌రాయ్‌ ‌వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశించిన విధంగా కోవిడ్‌ ‌మృతుల కుటుంబాలకు జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి ఎక్స్గేషియో చెల్లించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా అని రాజ్యసభలో వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. గౌరవ్‌ ‌కుమార్‌ ‌బన్సాల్‌ ‌వర్సెస్‌ ‌కేంద్ర ప్రభుత్వం కేసులో ఈ ఏడాది జూన్‌ 30‌న సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ కోవిడ్‌ ‌మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపై మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా నేషనల్‌ ‌డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ)ను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

కోవిడ్‌ ‌వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన అనంతరం స్టేట్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ ‌ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ‌కింద దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి క్వారంటైన్‌, ‌కంటైన్‌మెంట్‌, ‌శాంపిల్‌ ‌కలెక్షన్‌, ‌స్క్రీనింగ్‌, అవసరమైన మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ‌కోనుగోలు కోసం ఎస్‌డీఆర్‌ఫ్‌ ‌నిధుల వినియోగానికి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనుమతించినట్లు మంత్రి తెలిపారు. అలాగే వలస కార్మికుల కోసం సహాయ శిబిరాల ఏర్పాటు, వారికి ఆహార ఏర్పాట్లు, నిరాశ్రయలు, లాక్‌డౌన్‌ ‌కారణంగా చిక్కుబడిపోయిన వలస కార్మికులను ఆదుకునేందుకు కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ‌నిధుల వినియోగానికి అనుమతించినట్లు చెప్పారు. కోవిడ్‌ ‌మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ‌వార్షిక బడ్జెట్‌లో 50 శాతం నిధులు వాడుకోవడానికి అనుమతించడం జరిగింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ‌నిధులలో కేంద్ర వాటా కింద 2019-20లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 10,532 కోట్లు విడుదల చేయగా 2020-21లో ఈ మొత్తాన్ని 22,262 కోట్లకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.

Leave a Reply