Take a fresh look at your lifestyle.

పీవీగారంటేనే ఒక కౌస్తుభం ! ఎన్ని రత్నాలైతే దానికి సమం?

“ఇక స్కూల్లో పీవీ చదువులో  ప్రథముడు, ఉపాధ్యాయులకు ప్రియతమ స్టూడెంట్‌, ‌తోటి విద్యార్థులకు ఆదర్శ ప్రాయుడు. పరీక్షలో అతడు రాసిన ఆన్సర్‌ ‌పేపర్లను టీచర్లు ఇతర విద్యార్థులకు చదివి వినిపించి మెచ్చుకునేవారు. పాఠ్యగ్రంథాలలో ఆయా పాఠాలు రాసిన రచయితల శైలిని త్వరగా పట్టేసేవాడు పీవీ. ఆ శైలికి తన స్వంత శైలిని అద్బుతంగా మిళితం జేసి సమాధానాలు రాసేవాడట! అప్పుడప్పుడూ కవిత్వాలు,  కథలు,  నాటకాలు రాయడం, తోటి విద్యార్థులకు అవి వినిపించడం, నాటక ప్రదర్శనల్లో స్త్రీ పాత్రలు మరియు మగ వేషాలు వేయడం, రాగయుక్తంగా సినీ పాటలు పాడి వినిపించడం మొదలగు ఉత్సుకత కలిగించే పనులవల్ల తోటి విద్యార్థులకు పీవీ ఒక ‘సవ్య సాచి ‘ లాగా కనిపించేవాడు. మొత్తానికి పీవీ అటు ఉపాధ్యాయులకు, ఇటు తోటి విద్యార్థులకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు..”

కాకతీయ కలగూరగంప
(ముసలి ముచ్చట్ల చద్దిమూట)

పాఠశాల విద్యార్థి దశ నుండే ప్రకాశించిన సకలరంగ జ్ఞాన విన్యాసం

శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,
పాములపర్తి నిరంజన్‌ ‌రావు
1921లో నిజాం ప్రభుత్వ హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో వరంగల్‌ ‌జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో మాతామహుల ఇంట్లో పుట్టి, ప్రక్కనే వున్న కరీంనగర్‌ ‌జిల్లాలోని మరో చిన్న గ్రామంలో పదేండ్ల వరకు పెరిగి తన ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న ఆ బాలుడు 1931లో మాధ్యమిక విద్యకై మళ్ళీ వరంగల్‌ ‌పట్టణానికి వచ్చాడు. ఆ బాలుడు ఈ పదేండ్ల వ్యవధిలో గ్రామ వాతావరణానికి, అక్కడి అమాయకత్వానికి అలవాటు పడ్డాడు. ఇక పోతే వారుండేది అలనాటి రాచరికపు నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన క్రింది హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో!  పరిపాలనా, విద్యా బోధనా అంతా ఉర్దూ మీడియమే. ఆ బాలుడు చదవవలసిన ఆ పాఠశాల పేరు ‘కాలేజియేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌’. అం‌దులో ఇంటర్మీడియేట్‌ ‌వరకు చదవవచ్చు. తర్వాత డిగ్రీ కోర్సు చేయాలంటే హైదరాబాద్‌ ‌నగరానికి పోవల్సిందే! ఆ బాలుడు ప్రాథమిక విద్యలో మెరుగైన విద్యార్థి అనిపించుకున్నాడు, కాబట్టి బహుషా ఆ బాలుడి తలిదండ్రులు ఇతను బాగా చదువుకొని ఒక లాయర్‌ ‌గానో లేక తహసిల్దార్‌ ‌గానో కావాలని కోరుకొని వుండవచ్చు. ఎందుకంటే ఆనాటి పల్లె ప్రజలు భయమూ, గౌరవమూ సమపాళ్ళల్లో కలిపి చూసే ఉద్యోగాలివి! అంతే కాకుండా ఆనాటి సమాజంలో, ముఖ్యంగా వారున్న గ్రామ సామాజిక వాతావరణంలో గౌరవ ప్రదమైన వృత్తులివి. మరి ఆ బాలుడి మనస్సులో ఏముందో? ఊర్లో వీధి నాటకాలలో చూసిన పౌరాణిక నాయకుడా లేక తనతో అక్షరాలు దిద్దించి పద్యాలు నేర్పిన బడి పంతులా? ఐతే, కాల మహిమ విచిత్రమైంది. ఆ బాలుడి భవిష్యత్‌ ‌జీవన వ్యాసంగంపై ఆ తల్లిదండ్రుల ఆలోచనలు నిజం కాలేదు. పది పదకొండేండ్ల ఆ బాలుడి మనస్సులో ఏముందో మనకు తెలియకున్నా ఆ ఊహలేమీ నిజం కాని క్రొంగొత్త భవిష్యత్తు రూపు దిద్దుకుంది. బహుషా ఎవరూ – అప్పటి జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా –  అంచనా వేయని రీతిలో ఆ బాలుడు ఎంతో ఎదుగెక్కి ఊహించని ఉన్నత శిఖరాలు చేరుకున్నాడు.


ఒక్కసారి 1930 నాటి దేశ పరిస్థితులు గమనిద్దాం
అప్పటి బ్రిటిష్‌ ‌పాలనలో వున్న భారత దేశం, నిజాం పాలిత హైదరాబాదు రాష్ట్రం రెండూ వేర్వేరు ప్రత్యేక పాలిత వ్యవస్థలు. అప్పటికే విదేశీ బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమం దేశమంతా సాగుతున్నా, నిజాం పాలిత హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో ఆ ఉద్యమ ఛాయలు మృగ్యం. ఒక వేళ వున్నా అవి ఆర్య సమాజ్‌ ‌నినాదంతో మొగ్గ తొడుగుతూ ఇంకా బలహీనంగా వున్నట్టే లెక్క.  


అప్పుడు ఎవరు అనుకున్నారు రాబోయే పది ఇరవై సంవత్సరాలలో బ్రిటిష్‌ ‌పాలన నుండి విముక్తమై స్వతంత్ర భారత దేశావతరణ జరుగుతుందని…! అనుకున్నారు పో, ఆ స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్‌ ‌రాష్ట్రం విలీనమై అంతర్భాగమవుతుందని…! అనుకున్నారు పో,  విలీనమైన  తదుపరి కొద్ది కాలానికే  ఏక భాష రాష్ట్రంగా  కొత్త రూపు దిద్దుకుంటుందని…! అనుకున్నారు పో, ఈ పదేండ్ల బాలుడు ఆ రాష్ట్ర ఏలికగా ఎదుగుతాడని…! అనుకున్నారు పో, అంతటితో ఆగక ఈ బాలుడు మరింత ఎదిగి భారత దేశాధినేతగా ఉన్నత శిఖరాలందుకుంటాడని! మొత్తానికి జరిగింది ఈ క్రమానుసరణ సంఘటనలు ఆ బాలుని విషయంలో.. ఇన్నిసార్లు ఖచ్చితంగా అనుకోవడం మామూలు మానవులకే కాదు, మహిమాన్విత  మహనీయులకు గూడా సాధ్యం కాని పని. అందుకే దీనిని ‘కాల మహిమ’ అన్నాను.
ఇప్పటికే మీకు తెలిసిపోయుంటుంది ఆరవ తరగతిలో చేరడానికై వరంగల్‌ ‌పట్టణంలోని హనుమకొండ ప్రాంతంలో గల ‘కాలేజియేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌’‌కు చేరుకున్న ఆ పది పదకొండేండ్ల నాటి బాలుడే, ఆరోగ్యం సహకరించని 70 ఏండ్ల వయస్సులో అనుకోని ఆకస్మిక పరిణామాలతో ప్రధాని పదవి అధిష్టించి దేశ భవిష్యత్తుకై క్రొంగొత్త రూప కల్పనలను గావించి అవిశ్రాంతంగా శ్రమపడ్డ మొన్నటి మన తెలుగు బిడ్డ – మన తెలంగాణా స్ఫూర్తి – శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారని.

ఇంకా ఆప్యాయంగా చెప్పుకోవాలంటే మన పీవీ గారని!
ఇంకా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆ అమాయకపు బాల్య దశలో ఆ పాఠశాల భవన ప్రాంగణంలో అడుగిడిన ఆ విద్యార్థిని ఉత్తేజపరచి ఒక ఉత్తమ ఆలోచనా పరుడిగా చేసి అతని భవిషత్తు తీరు తెన్నులకు దిశా నిర్దేశం జరిగింది అప్పటినుండే..ఆ క్షణం నుండే. ఈ విధంగా ఆ గ్రామీణ అమాయకపు బాలుడు బెదురుతూ ఆ పాఠశాల ప్రాంగణం లోనికి అడుగుబెట్టిన నాటి నుండి ఏ విధంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా రూపొందడం జరిగింది, అతని చైతన్య ప్రవృత్తి ఎట్లా మారుతూ వచ్చింది తెలుసుకోవడం మనల్ని ఎన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందేమో?

వరంగల్‌లో చదువుల నాటి బాల్యం

పాఠశాలలో 6వ తరగతిలో చేరిన రెండు రోజుల తర్వాత పీవీ మధ్యాహ్న భోజనం ముగించి స్కూల్‌ ఆవరణలో వున్న వాటర్‌ ‌టాంక్‌ ‌నల్లా వద్ద నీళ్ళు తాగుతున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన అదే వయస్సు గల మరొక పిల్లవాడు తనూ నీళ్ళు తాగుతూ యథాలాపంగా ‘నీ పేరేంటోయ్‌?’ అని అడిగాడు. ఆ రోజుల్లో ఇంటి పేరుతో సహా పూర్తి పేరు చెప్పే పద్ధతి వుంది కాబట్టి ఆ మొదటి బాలుడు ‘‘నా పేరు పాములపర్తి వెంకట నరసింహారావు’’ అని చెప్పాడు.  ‘‘అరే, నా పేరు పాములపర్తి సదాశివరావు’’ అని తెలిపాడు రెండో బాలుడు ఎంతో సంతోషంతో. ఆ సాయంత్రమే తన మిత్రున్ని వరంగల్‌ ‌లోని మట్టెవాడలో గల తన ఇంటికి తీసుకుపోయి ఇంట్లోని పెద్దలకు పరిచయం చేయడం, వారి ద్వారా ఇద్దరి మధ్య గల ‘దూరపు బంధుత్వం’ తెలిసికోవడం జరిగింది. ఆ విధంగా ఆ మంచినీటి నల్లా వారి మధ్య ఒక గొప్ప మైత్రికి నాంది పలికింది. క్రమేణా ఇద్దరి మధ్య స్నేహితం బలపడటం, ఆదివారాల్లో ఇద్దరూ భద్రకాళి గుట్టలూ, పద్మాక్షమ్మ గుట్ట, సిద్ధేశ్వరాలయం, వరంగల్‌ ‌కోట, వేయిస్తంభాల గుడీ మొదలగు స్థలాలకు తిరగడం చేసేవారు. పాకాల చెరువు, మెట్టుగుట్ట, గోవిందరాజుల గుట్టా, ఇంకా ఎన్నో వారి తిరుగుళ్ళకు అనువైన ప్రదేశాలే!  ఇక స్కూల్లో పీవీ చదువులో  ప్రథముడు, ఉపాధ్యాయులకు ప్రియతమ స్టూడెంట్‌, ‌తోటి విద్యార్థులకు ఆదర్శ ప్రాయుడు. పరీక్షలో అతడు రాసిన ఆన్సర్‌ ‌పేపర్లను టీచర్లు ఇతర విద్యార్థులకు చదివి వినిపించి మెచ్చుకునేవారు.

పాఠ్యగ్రంథాలలో ఆయా పాఠాలు రాసిన రచయితల శైలిని త్వరగా పట్టేసేవాడు పీవీ. ఆ శైలికి తన స్వంత శైలిని అద్బుతంగా మిళితం జేసి సమాధానాలు రాసేవాడట!
అప్పుడప్పుడూ కవిత్వాలు, కథలు, నాటకాలు రాయడం, తోటి విద్యార్థులకు అవి వినిపించడం, నాటక ప్రదర్శనల్లో స్త్రీ పాత్రలు మరియు మగ వేషాలు వేయడం, రాగయుక్తంగా సినీ పాటలు పాడి వినిపించడం మొదలగు ఉత్సుకత కలిగించే పనులవల్ల తోటి విద్యార్థులకు పీవీ ఒక ‘సవ్య సాచి ‘ లాగా కనిపించేవాడు. మొత్తానికి పీవీ అటు ఉపాధ్యాయులకు, ఇటు తోటి విద్యార్థులకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు..
ఒకసారి స్కూల్‌లో ‘కృష్ణకుమారి’ అనే నాటకం వేశారు. పీవీ ది అందులో కృష్ణకుమారి పాత్ర. పీవీ తన పాత్ర డైలాగులతో బాటు ఆ నాటకంలోని అన్ని పాత్రల డైలాగులను కంఠతా పట్టేశాడు. రిహార్సులకు ఏ పాత్రధారి రాకున్నా ఆ పాత్ర డైలాగులు చెప్పేవాడు. కృష్ణకుమారి నాటకంలో పీవీ అభినయం చూసి ప్రశంసించని వాళ్ళు లేరు.
ఇక స్కూల్‌ ‌బయట పీవీకి ఆసక్తి లేని విషయం లేదు. మొదటగా అప్పటి సైలెంట్‌ ‌సినిమాలలో మాస్టర్‌ ‌విఠల్‌ అం‌టే అభిమానించాడు. తర్వాత టాకీలు వచ్చాక పృథ్వీరాజ్‌ ‌కపూర్‌, అశోక్‌ ‌కుమార్‌, ‌సొహరాబ్‌ ‌మోడీలతో పాటు అలనాటి మేటి నటీమణులు దేవికారాణి, దుర్గా ఖోటే, కనన్‌ ‌బాల మొదలగు వారి సినిమాలు తప్పక చూసేవాడు. తెలుగులో కాంచన మాల, కన్నాంబల నటనా ప్రతిభను మెచ్చుకునే వాడు.


రాగయుక్తంగా పద్యాలు గొంతెత్తి బిగ్గరగా పాడటమంటే పీవీకి బాగా ఇష్టం. వరంగల్‌లో పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతుందంటే తప్పక హాజరు. స్ఠానం నరసింహారావు ‘సారంగ ధర’, డీ వీ సుబ్బారావు ‘హరిశ్చంద్ర’,  తెనాలి డ్రామా కంపెనీ వారి ‘కృష్ణ లీలలు’ మొదలగునవి చూడటమే కాకుండా  ఆ ప్రదర్శనలోని పద్యాలు రాగయుక్తంగా పాడి మిత్రులకు వినిపించే వాడు. ఇక సర్కస్‌ ‌వచ్చిందంటే ఎంతో ఆనందం. స్కూల్‌ ‌వదిలిన తర్వాత సాయంత్రం నేరుగా సర్కస్‌ ‌డేరా బయటకు చేరేవాడు. చీకటి పడేదాకా అక్కడే గడిపే వాడు. డేరా వెలుపల గొలుసులతో కట్టేసిన ఏనుగును చూస్తూ అమిత ఆనందం పొందేవాడు.


వీటితో పాటు చిలిపి చేష్టలు కూడా! సినీ తారల బొమ్మలను కత్తిరించుకొని ఫైల్‌ ‌చేయడం..రాత్రిళ్ళు గానా పార్టీలల్లో గడపడం..మిత్రులతో హనుమకొండ చౌరాస్తా, లష్కర్‌ ‌బజారులలో రోడ్లపై తిరగడం.. ‘అప్పూ హోటల్‌’ ‌వద్ద అర్థణాకు ఆలూ బజ్జీ, మూడు పైసలకు టీ, ప్రక్కనే వున్న పాన్‌ ‌షాప్‌లో పైసాకు ‘పాన్‌ ‌బీడా’ సేవానంతరం ఇరుగు పొరుగు ఇండ్ల ముంగిళ్ళ గాలింపు యిత్యాది కార్యక్రమాలు కూడా వుండేవి. ఆ రోజుల్లో వరంగల్‌ ‌పట్టణంలో భామా కలాపం, గొల్ల కలాపం, ఉషాపరిణయం మొదలగు కూచిపూడి భాగవత ప్రదర్శనలు జరిగేవి. దీపావళి పండగ రోజుల్లో హారతులు, బోగం మేళాలు, గాన సభలు జరిగేవి. ఇంకా పెండిండ్లు పేరంటాల సందర్భాలలో పాట కచేరీలు జరిగేవి. ఇలాంటి కార్యక్రమాలంటే పీవీకి బహు సరదా.
ఆనాటి నిజాం ప్రభుత్వ పాలనలో పౌర హక్కులకు గుర్తింపు లేని స్థితి. కాబట్టి వరంగల్‌ ‌యువకులు, విద్యార్థులు  గణేశ్‌ ఉత్సవాల పేరుమీద జన సమీకరణ గావించి హిందూ సంఘటనా శక్తిగా కార్యక్రమాలు నిర్వహించే వారు. అదే విధంగా హనుమకొండ విద్యార్థులు, యువకులు ‘భజన మండలి’ పేరుతో ఒక సంస్థ నేర్పరుచుకున్నారు. ఈ రెండింట్లో కూడా పీవీ చురుకుగా పాల్గొనే వాడు.


పీవీ 7వ తరగతిలో వున్నప్పుడు స్కూల్‌ ‌తరఫున విద్యార్థులను ఉత్తర దేశ యాత్రకు తీసుకుపోయారు. పీవీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నాడు. ఆ యాత్రలో పీవీ కేవలం వివిధ ప్రాంతాలు, ప్రజలు, అక్కడి విశేష భవనాలు, కట్టడాలు చూడటంతో సరిపెట్టుకోకుండా ఆ ప్రాంత ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లూ, ఆహార అలవాట్లూ విపులంగా పరిశీలించేవాడు. యాత్ర నుండి రాగానే తన యాత్రానుభవాలను తన సహచరులకు చెప్పేవాడు. ఈ యాత్రానుభవ వర్ణనాత్మక వివరణ కొన్ని నెలలల పాటు జరిగిందట. అంటే పీవీలో ఈ యాత్ర ఎంతో ఉత్సుకత కలిగించిందనీ, ఆ యాత్రలో పీవీ ఎంతో తాదాత్మ్యత చెందాడని తెలుస్తుంది.


వయస్సు పెరిగి నూనూగు మీసాలు వచ్చేసరికి పీవీ, సదాశివుడు ఎప్పుడైనా సినిమాలను చూడటానికి చెరో 5 రూపాయలు తీసుకొని హైదరాబాద్‌ ‌పోవడానికి పాసెంజర్‌ ‌బండి ఎక్కి నాంపల్లి స్టేషనుకు చేరి, స్టేషనుకు ఎదురుగానే వున్న రాయల్‌ ‌హోటల్‌లో, లేదా నాంపల్లి షరాయిలో రెండు రోజులు మకాం వేసేవారు. పాన్‌ ‌బీడా వేసుకొని ‘టివోలీ’, ‘లైట్‌ ‌హౌస్‌’ ‌థియేటర్లలో సినిమాలను చూడడం.. పబ్లిక్‌ ‌గార్డెన్‌, ‌టాంక్‌ ‌బండ్‌, ‌కోఠీలలో తిరగడం చేసే వారు. మళ్ళీ పాసెంజర్‌ ‌ట్రైన్‌ ఎక్కి వరంగల్‌ ‌చేరే సరికి 5 రూపాయల్లో ఇంకా ‘చారాణా’ మిగిలేదట! 1939లో విడుదలైన శాంతారాం గారి మూవీ ‘ఆద్మీ’ చూసి వచ్చిన తర్వాత మిత్రులిద్దరూ ఆ సినిమాను గురించి వారం పాటు చర్చించుకున్నారట!!
ఈ చిన్ననాటి తిరుగుళ్ళే పీవీకి టూరిజం మీద ఆసక్తి కలిగించి, అప్పటి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర మంత్రిగా పనిచేసిన 9 ఏండ్లలో పీవీ గారివే అధికంగా టూర్‌ ‌కార్యక్రమాలుండేవట! అందరూ ఆయన్ను టూర్‌ ‌మినిస్టర్‌ అనేవారట!! పీవీ చిన్ననాటి ఈ తిరుగుళ్ళు, ఇంకా తర్వాత మనం తెలుసుకోబోయే పీవీ చేసిన యితర వ్యాపకాలు ఉబుసులాటకు చేసినా, తప్పనిసరై చేసినా మనం గ్రహించవలసింది యేమిటంటే ప్రతిదీ ఆయన పరిశీలనాత్మక, పరిశోధనాత్మక, విమర్శనాత్మక దృష్టికి గురి అయ్యేది. ఆ సమాచారం ఆయన చిన్ననాటి మినీ కంప్యూటర్‌ ‌మెదడులో రికార్డ్ అయ్యేది.  


సినిమాలు, పౌరాణిక నాటకాలు చూస్తున్న క్రమంలో మిత్రులిద్దరిలో సంగీతం పట్ల మక్కువ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా పీవీ గారు ‘‘ఏక సంథాగ్రహి’’ లాగా తాము చూసిన సినిమాల్లోని పాటలను సినిమా చూసి రాగానే వెంటనే ఎంతో రాగయుక్తంగా పాడేవారని సదాశివరావుగారు చెప్పేవారు.  ఒక హర్మనీ పెట్టె, తబలా కొనుక్కొని ఇద్దరూ సంగీత సాధన చేసేవారు. బాల్యంలో సంగీతంపై పెరిగిన ఈ ఆసక్తి వీరిని క్లాసికల్‌ ‌సంగీతం (ముఖ్యంగా హిందుస్తానీ సంగీతం)పై గొప్ప పట్టు సంపాదించి వివిధ సంగీత రాగ, తాళాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక కళాకారుడిచ్చిన సంగీత ప్రదర్శన బాగోగులపై చర్చించుకునే స్థాయికి పెరిగింది.
పీవీ త్యాగరాజ కృతులు, జావళీలు విపరీతంగా అభిమానించే వాడు, వాటి లోని రాగ తాళ విన్యాసాలను అనుకరించడానికి ప్రయత్నించే వాడు. బిడారం కిట్టప్ప, నారాయణ్‌ ‌రావు వ్యాస్‌, ‌పండిట్‌ ఓం‌కార్‌ ‌నాథ్‌. ఉస్తాద్‌ అబ్దుల్‌ ‌కరీంఖాన్‌ ‌మొదలగు శాస్త్రీయ సంగీత గాయకుల గ్రామఫోన్‌ ‌రికార్డుల పాటలను మరీ మరీ విని ఆనందించే వాడు. అంతే కాదు, వారిని అనుకరిస్తూ చాటు మాటుగా కసరత్‌ ‌చేశేవాడు. ఐతే శాస్త్రీయ సంగీతం కేవలం వినడం వల్ల రాదనీ దానికి ఎంతో సాధన చేయాల్సి వుంటుందనీ  తెలుసుకున్నాడు. ఐనా అనేక రాగాలను, తాళ విన్యాసాలను, గతి భేదాలను గుర్తించడం  అలవరచుకున్నాడు. వయసు పెరుగుతూంటే శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెరుగుతూ వచ్చింది. ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలీన్‌, ‌పన్నాలాల్‌ ‌ఘోష్‌ ‌వేణువు, హీరా బాయి, రోష్‌ ‌నారా బేగం, కేసర్‌ ‌బాయి, రవూఫ్‌ల గాత్రం, ఉస్తాద్‌ అహ్మద్‌ ‌జాన్‌ ‌తిరక్వా ‘తబ్‌ ‌లా’ అంటే పీవీకి మోజు.


ఇక ఇన్ని రకాల వ్యాసంగాలు పీవీకి ఉంటే ఆయన కలం ఊరుకుంటుందా? నేను కూడా వున్నానని తన విన్యాసాల్ని చూపెట్టింది. స్కూల్‌ ‌రోజుల్లో భావోద్వేగం ఉప్పొంగి  పీవీ  రాసిన కవితలు రక రకాలు. ఆయన ద్విపదలు, గీతాలు, వృత్తాలు రాసాడు. అంటే ఆయనది ఒకే మూసలో వెలిబుచ్చే కవిత్వం కాదు. ఆ చిన్నతనపు రచనలు చక్కటి భావనా శక్తి, కల్పనా వైవిధ్యం, కళాత్మక దృష్టి కలిగి వుండేవట. కవిత్వాలల్లడం, కథలు, నాటకాలు వ్రాయడంతో మొదలైంది ఆయన రచనా పక్రియ. జయచంద్రునిపై ‘‘జయ చంద్రా- హైందవ ధ్వంసకా’’ ఆనే మకుటంతో ఆయన రాసిన పద్యాలు ఆ రోజుల్లో భజన మండలి సభలల్లో విరివిగా ప్రచారం పొందాయట.
పీవీ తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్‌ ‌భాషలో కూడా పద్య – గద్య రచనలు చేశాడట. ఈ రచనా వ్యాసంగం పీవీకి ఒక అలవాటుగా తయారై రాబోయే కాలేజీ రోజుల్లో, ఆ తర్వాత వివిధ రకాల జీవన విధానాల్లో(లాయరుగా, పత్రికా నిర్వాహకుడిగా, ఎంఎల్‌ఏగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా) ‘నిత్య పఠనం – అనునిత్య రచనం’ అనే విధంగా చదవడం, రాయడం ఆయనలో అంతర్లీనమయ్యాయి.
ఒకానొక బాల వాంగ్మయ పోటీకి పీవీ రెండు షేక్స్ ‌పియర్‌ ‌సుఖాంతక, రెండు విషాదాంతక కథా సంగ్రహాలను పంపించినట్టు, అయితే ఆ పోటీ ఫలితం వెలువడనే లేదనీ..అదే విధంగా ఒకటో, రెండో హిందీ సినిమా కథలు వ్రాసి పంపించాడనీ వాటి అతీ గతీ కనిపించలేదని తెలిసింది. ఈ ఆశాభంగాలను పీవీ సీరియస్‌గా తీసుకోలేదనీ, అతని ఉద్దేశం రాయడమనీ, ఆ పై ఏమి జరిగిందో అన్న తాపత్రయం వుండేది కాదనీ కూడా తెలిసింది.
మొత్తానికి ఆ బాల్యదశలోనే పీవీ కళారంగపు అన్ని పార్శ్వాలని తట్టాడు. అలనాటి నరసింహుడి భక్తుడు ప్రహ్లాదుడు చిన్నప్పుడే ‘చదువుల లోని మర్మమెల్ల చదివితి తండ్రీ!’’ అన్నాడట. కాని ఇక్కడ యీ నరసింహుడు స్కూల్‌ ‌చదువులప్పుడే ‘‘బాల్య జీవన కళా మధురిమలన్నీ చవి జూచితి చదువరీ!‘‘ అని మనకు తెలుపుతున్నాడు.


మొదటి సారిగా ఉద్యమ అనుభవం (పీవీ కే కాదు, ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా ఆర్టస్ ‌కాలేజీకి కూడా)
1939వ సంవత్సరంలో అప్పటి నిజాం రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీలో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. ఒకటి యూనివర్సిటీ ఆర్టస్ ‌కాలేజీ నూతన భవనం(ప్రస్తుత భవనం) ఆవిష్కరింపబడింది. ఈ భవనమే విద్యార్థుల ఉద్యమాలకు పురిటి గడ్డగా పేర్గాంచింది. ఐతే ఈ నూతన ఆర్టస్ ‌కాలేజీ భవనం ఆరంభం కాకముందే ఆ ఆర్టస్ ‌కాలేజీ విద్యార్థులు గన్‌ ‌ఫౌండ్రీ లోని  తాత్కాలిక భవనంలో తమ తరగతులు నిర్వహిస్తున్నప్పుడే 1938-39లో ఒక ఉద్యమాన్ని నిర్వహించారు.
అంటే ఆ నూతన భవన పుట్టుకే(అంటే ఆరంభమే) ఉద్యమాల పుట్టుక అయిందేమో? ఇది రెండవ విశేషం. ఈ ఉద్యమమే ‘‘వందే మాతరం ఉద్యమం’’ గా పేర్గాంచింది. తరగతులు జరుగుతున్న అప్పటి తాత్కాలిక ఉస్మానియా యూనివర్సిటీ కేంపస్‌లో కొంత మంది విద్యార్థులు కాలేజీ ప్రార్థన సమయంలో ‘‘వందే మాతరం’’ దేశ భక్తి గీతాన్ని పాడేవారట. ఆ విషయం అధికారుల దృష్టికి రాగానే కేంపస్‌లో ‘వందే మాతరం’ గీతాన్ని పాడటాన్ని నిషేధిస్తూ 28 నవంబర్‌, 1938 ‌నాడు ఉత్తరువులు జారీ చేశాడు నిజాం నవాబ్‌. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉస్మానియా విద్యార్థులు ఉద్యమించారు. వీరికి సంఘీభావం ప్రకటిస్తూ అలనాటి నిజాం రాష్ట్ర ఇతర ప్రాంత (వరంగల్‌, ‌గుల్బర్గా, ఔరంగాబాద్‌) ‌విద్యా సంస్థల విద్యార్థులు కూడా ఉద్యమించారు. ఉద్యమించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ఠులతో(350 మంది) బాటు ఇతర ప్రాంత విద్యార్థులను కూడా పాఠశాలల నుండి సస్పెండ్‌ ‌చేయడం జరిగింది. ఆ విధంగా వరంగల్‌లో చదువుతున్న 39 మంది విద్యార్థులను కూడా తొలగిస్తే, వారిలో పీవీ, పాములపర్తి సదాశివరావు ప్రభృతులున్నారు.


– మిగతా మంగళవారం సంచికలో..

Leave a Reply