స్వామిని దర్శించుకున్న ఎంపి ఉత్తమ్
లక్షలాది భక్తులు వచ్చే పెద్దగట్టు జాతరని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని టీపీసీసీ చీఫ్,నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా స్వామి వారిని ఉత్తమ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
పెద్దగట్టు జాతర అభివృద్ధికి ఎంపీగా తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని ఆయన విమర్శించారు. లక్షలాది భక్తులు వచ్చే పెద్దగట్టు జాతరని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర పేరుగాంచింది.
పెద్దగట్టు జాతర ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర మార్చి 4 వరకు కొనసాగనుంది. తెలుగు రాష్టాల్రతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో జాతరకు తరలివస్తారు.