Take a fresh look at your lifestyle.

రైతులను చంపిన మంత్రి కొడుకును అరెస్టు చేయకుండా… పరామర్శకు వెళ్లిన ప్రియాంకను అరెస్టు చేస్తారా?

  • బిజెపి, టిఆర్‌ఎస్‌, ‌వైసిపి దాగుడు మూతలు ఆపాలి
  • పిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి ఆగ్రహం

ఉత్తర్‌‌ప్రదేశ్‌లో రైతులను చంపిన కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి అజయ్‌ ‌మిశ్రా కుమారుడు అశిష్‌ ‌మిశ్రాను అరెస్టు చేయకుండా పరామర్శకు వెళ్లిన కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం ఏంటని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి ప్రశ్నించారు. యూపి ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ ‌చేయకపోవడంపై మండిపడ్డారు. పార్లమెంట్‌లో రైతుల కోసం రాహుల్‌ ‌గాంధీ పోరాటం చేస్తుంటే..ఇక్కడ టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల నేతలు దాగుడు మూతలు ఆడుతున్నాయనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి, కేసీఆర్‌, ‌జగన్‌ ‌ముగ్గరూ ఒక్కటేననీ జగ్గారెడ్డి అన్నారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…ప్రియాంక గాంధీ అరెస్టును ఖండిస్తున్నామనీ, యూపిలో కేంద్ర మంత్రి కొడుకు చేతిలో చనిపోయిన రైతు కుటంబాలను రాహుల్‌, ‌ప్రియాంక గాంధీలు పరామర్శించే అవకాశం ఇవ్వకుంటే సంగారెడ్డి నుంచి పెద్దయెత్తున ఉద్యమం ప్రారంభిస్తామనీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిజెపి నేతలు వెనకాల గాంధీ ఫోటోలు పెట్టుకుంటారనీ, చేసే పనులు మాత్రం గాడ్సే పనులనీ ఆరోపించారు. దేశంలో కుల వృత్తులు కూడా కార్పొరేట్‌ ‌శక్తులు చేస్తున్న తీరును చూస్తుంటే కార్పొరేట్‌ ‌శక్తులను పెంచే పనిలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పడిందనీ స్పష్టంగా కనబడుతుందన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నా..తెలంగాణ, ఏపీలో ఆందోళనలు లేకపోవడం దురదృష్టకరమనీ, రైతులు బయటకు రాకపోవడానికి పోలీసులు కేసులు పెడతారనే భయమేననీ అన్నారు. ఏపిలో జగన్‌, ‌తెలంగాణలో కేసీఆర్‌ అన్యాయాలను ప్రశ్నించే గొంతుకలపై పోలీసులతో కేసులు పెట్టిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

ఎంతో ప్రమాదకరమైన వ్యవసాయ చట్టాలపై వాళ్లు కనీసం మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. రైతుల కోసం కొట్లడేది ఒక కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రమేననీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే రైతులు, ప్రజల సమస్యలపై కొట్లాడుతారన్నారు. కేంద్రంలోని పిఎం మోదీ, యూపిలోని సిఎం యోగి ప్రభుత్వాలు రైతులను చంపుతుందన్నారు. ప్రభుత్వాలే రైతులను చంపుతుంటే ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఏపీ, తెలంగాణలలో రైతులకు రుణ మాఫీ లేదు, నష్టపరిహారం లేదన్నారు. యూపిలోని బిజెపి ప్రభుత్వం రైతులను చంపింతే..తెలంగాణ బిజెజి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వెళ్లి ఏం మొక్కిండో చెప్పాలన్నారు. యూపిలో రైతులను అతి దారుణంగా చంపుతున్నాం. ఇక్కడ మమ్మల్ని(బిజెపి)క్షమించు అని భాగ్యలక్ష్మి దేవతను అడిగినవా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌ను కరీంనగర్‌లో పోలీసులు చెంప మీద కొట్టినా చర్యలు తీసుకోలేని ప్రభుత్వం మీది కాదా? అని నిలదీశారు.

కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా ముందర తెలంగాణ సిఎం కేసీఆర్‌ ‌కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే కూడా బిజెపి నేతలకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. బిజెపి నేతలకు ఏమాత్రం సిగ్గులేకుండా గాంధీభవన్‌పై దాడి చేస్తామంటున్నారనీ, బిజెపి నేతలకు గాంధీభవన్‌ ‌తాకే దమ్ముందా? అని జగ్గారెడ్డి సవాల్‌ ‌విసిరారు. దేశంలో ప్రధానమంత్రి మోదీ దృతరాష్ట్రుడిలా మారాడనీ, తన మంత్రివర్గంలోని ఓ మంత్రి కొడుకు రైతులను చంపినా కూడా చూస్తూ ఉన్నాడే కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బిజెపి, టిఆర్‌ఎస్‌, ‌వైసిపి పార్టీల నేతలు ఇకనైనా దాగుడు మూతలు ఆడటం ఆపాలనీ, కేసీఆర్‌ ‌సిఎంగా ఏడాది ఉంటాడా? పదేళ్లు ఉంటాడా? అనేది నిర్ణయించేది ప్రజలన్నారు. రాక్షసులను ఏం చేయాలన్నది టైం డిసైడ్‌ ‌చేస్తుందనీ జగ్గారెడ్డి అన్నారు.

Leave a Reply