Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌కు దుర్బుద్ధి పుడితేనే ప్రభుత్వం రద్దు

  • అప్పుడే తెలంగాణకు బానిస పాలన నుంచి విముక్తి
  • ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన యువత
  • నేను సోనియా మనిషినే మిడియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

కేసీఆర్‌కు దుర్బుద్ధి పుట్టి ప్రభుత్వాన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌వ్యాఖ్యానించారు. గతంలో అనేకసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ ఇప్పు‌డు ప్రజల కోసం మరోసారి ఎందుకు వెళ్లకూడదన్నారు. నగరంలో ఆయన మిడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌ ‌పోవాలంటే ఎన్నికలు రావాలన్నారు. భస్మాసుర హస్తం కేసీఆర్‌ ‌చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే ..దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ప్రభుత్వాన్నీ రద్దు చేసుకోమని చెప్పాలన్నారు. ప్రజల కష్టాలనుచూసి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారన్నారు. కానీ లబ్ది మాత్రం కేసీఆర్‌ ‌కుటుంబంతో పాటు ఇతర రావులకు జరుగుతుందన్నారు. తాను సోనియాగాంధీ మనిషినని..కాంగ్రెస్‌ ‌పార్టీ బిడ్డనని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో తనకు తక్కువ సమయంలో అత్యంత గౌరవమైన బాధ్యత ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో అందరూ భాగస్వామ్యం కావాలని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల ఒకతరం యువత నష్టపోయిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కొరోనా వల్ల పేదల జీవితాలు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొరోనా ఒకవైపు, కేసీఆర్‌ ‌మరోవైపు కలిసి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అధికారం పోతేనే అన్ని సమస్యలు పోతాయని అన్నారు. ఏ ఉప ఎన్నిక వొచ్చినా కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌ ‌రెడ్డి.. క్రమంగా పార్టీ సీనియర్‌ ‌నేతలను ఒక్కటి చేస్తున్నారు.

తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అండగా నిలిచేలా మలచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వలస వొచ్చిన ఆయనకు రాష్ట్ర స్థాయిలో పార్టీపరంగా అత్యున్నత స్థానాన్ని కట్టబెట్టడం వల్ల సీనియర్‌ ‌నేతల్లో నెలకొన్న అసమ్మతిని, అసంతృప్తిని చల్లార్చడంలో సక్సెస్‌ అవుతున్నట్టే కనిపిస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్‌‌బ్రారడ్‌గా ముద్రపడిన మాజీ మంత్రి కొండా సురేఖ.. రేవంత్‌ ‌రెడ్డిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత- బీసీ మహిళకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలనే కోణంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్ఠానం ఒకదశలో కొండా సురేఖ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు మొదట్లో వార్తలు వొచ్చాయి. రేవంత్‌ ‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని కొండా సురేఖ స్వాగతించారు. ఈ కారణంతోనే ఆమె ఆయన నివాసానికి వెళ్లి మరీ.. శుభాకాంక్షలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి అసమ్మతులను రేవంత్‌ ‌రెడ్డి ఎలా బుజ్జగిస్తారనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply