Take a fresh look at your lifestyle.

ఇం‌త నిర్బంధం ఏంటి?

అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి
పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి ఆగ్రహం
రేవంత్‌ ‌గృహ నిర్బంధం..ఇంటి దగ్గర ఉద్రిక్తత
ఎల్బీనగర్‌లో యువతపై విరిగిన లాఠీ
జంగ్‌ ‌సైరన్‌ ‌ర్యాలీని అడ్డుకోవడం కోసం పోలీసుల మోహరింపు
శ్రీకాంతాచారి విగ్రహానికి నిరుద్యోగ యువత నివాళి

పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జంగ్‌ ‌సైరన్‌కు వెళ్లకుండా ఇంటి దగ్గరే రేవంత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఎల్బీ నగర్‌లోనూ భారీగా పోలీసులు మోహరించి జంగ్‌ ‌సైరన్‌ ‌ర్యాలీని అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న యువతపై లాఠీలు ఝళిపించారు. దీంతో పలువురు గాయపడ్డారు. పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రేవంత్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వొచ్చిందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అట్లాంటి తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇది తాలిబన్‌ ‌రాజ్యం కాదు కదా? అని ప్రశ్నించారు. అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి? అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి కసబ్‌ ‌కాదు కదా? తాను వెళ్లడానికి ఎస్కార్ట్ ఇవ్వండన్నారు. ఇంటి దగ్గర రోడ్డుపై రేవంత్‌ ‌బైఠాయించి నిరసన తెలుపుతున్న క్రమంలో ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపునిచ్చిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్‌’ ‌ర్యాలీకి ఆయన వెళ్లకుండా అడ్డుకొనేందుకు జూబ్లీహిల్స్ ‌లోని రేవంత్‌ ‌నివాసం వద్ద పోలీస్‌ ‌బలగాలు మోహరించాయి. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దిల్‌సుఖ్‌నగర్‌- ఎల్బీనగర్‌ ‌రూట్‌లో ఈ ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌ ‌జాం అవుతుందని పోలీసులు తెలిపారు. ర్యాలీ నిర్వహించ కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే, ఈ ర్యాలీ ఎలాగైనా చేపట్టితీరుమతాని రేవంత్‌ ‌ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌శ్రేణులు సాయంత్రం 4గంటల కల్లా దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకోవాలని, లాఠీఛార్జికి భయపడాల్సిన అవసరం లేదని రేవంత్‌ ‌పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ ‌శ్రేణులు దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకొ నేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో రేవంత్‌ అక్కడికివెళ్లకుండా అడ్డుకొనేందుకు దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు. అంతా ఒకేసారి రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండటంతో దిల్‌సుఖ్‌నగర్‌ ‌నుంచి ఎల్బీనగర్‌ ‌వరకు పోలీసులు మోహరించారు. అలాగే, కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రగతిభవన్‌ ‌వైపు వెళ్లే అవకాశం కూడా ఉండటంతో ఆ పరిసరాల్లోనూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి నట్టు సమాచారం. మరోవైపు, దిల్‌సుఖ్‌నగర్‌ ‌వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ దుకాణాలను మూసివేయిస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ ‌మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. అఇతే నిర్బంధం మధ్యనే ఎల్‌బి నగర్‌ ‌చౌరస్తాలో శ్రీకాంతాచారి విగ్రహానికి కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా పోలీసులు లాఠీఛార్జ్ ‌చేయడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Leave a Reply