Take a fresh look at your lifestyle.

నేల రాలిన ఎర్ర మందారం.. పయిలం సంతోష్‌

‘‌ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నా బిడ్డా ఎక్కడున్నావో బిడ్డా సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు రాజాలో’’ అని వలస బ్రతుకు కష్టాలను పయిలంగా పలికిన గొంతు నేడు మూగబోయింది. పాటమ్మ చిన్న బోయింది. పల్లె కష్టాలను కళ్ళకు కట్టిన పయిలం సంతోష్‌ ‌పాట ఆగిపోయింది. పాటే ప్రాణంగా బ్రతికి పాటను బందూకు చేసుకుని ఉద్యమ పయనం చేసిన పాటల నడక శాశ్వత విశ్రాంతి కోరుకున్నది. తన అభ్యుదయ గేయోధ్యమానికి సరికొత్త బాద్యుల్ని తేవాలని పాట చెప్పి పదిలంగా మహా ప్రస్థానం చేసింది. ప్రజా తెలంగాణకై రండన మీరు రండనా.. ప్రాణమైన ఇద్దామూ లెండక్క మీరు లెండక్క.. అంటూ ప్రజా తెలంగాణాకై పల్లవి అందుకున్నది పయిలం గొంతు.

విప్లవాల ఖిల్లా నల్గొండ జిల్లా గరెడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో బంగారమ్మ, వెంకయ్యల ఐదుగురు సంతానంలో ఒకడైన పయిలం పాట పయనం ఏడవ తరగతిలోనే మొదలైంది. విప్లవ కవి, గోదావరి లోయ రైతాంగ ఉద్యమకారుడు మిత్ర చండ్ర పుల్లారెడ్డిపై రాసిన ‘ఎగరేసిన ఎర్రని జెండా.. మోదుగ వనమంత చిన్నబోయే’ పాటతో పయిలం సంతోష్‌ ‌పాట ప్రస్థానం ఆరంభమైంది. పాట పీడిత జనాల గుండెల్ని తట్టి చైతన్య దీపికలు వెలిగించి అంతరాలు లేని అభ్యుదయ సమాజాన్ని నిర్మిస్తుందని ఆయన ప్రగాఢ విస్వాసం. కళ కళ కోసం కాదు ప్రజల కోసమని సుబ్బారావు ప్రాణిగ్రాహి చెప్పిన మాటల్ని చివరంటూ నమ్మిన అభ్యుదయ వాది ఆయన. పాటతో సమాజాన్ని పదిలం చేయాలని ప్రజా శ్రేయస్సు కోసమే పాట పని చేయాలని నమ్మి ‘మాయాదారి మందుసీస నన్నెట్ల చేసితీవే’ అంటూ మద్యపాన నిషేధంపై గొంతెత్తి పాడింది ఆయన గళం. 1990 నుంచి పాటలు రాయడం ప్రారంభించిన సంతోష్‌ ‌ప్రజల భాషలో రాసి ప్రజల కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం, కరీంనగర్‌, ‌గోదావరి లోయ రైతు ఉద్యమాలపై పాటలు రాసి మలిదశ తెలంగాణ అమరులపై పాడుతూ ‘‘సిరిసిల్ల పోయి వద్దమా.. సిరిమల్లె పూలు తెద్దమా..

శ్రీకాంతు మెడలో వేద్దామా’’ అంటూ తెలంగాణా ఏర్పాటుపై,ప్రజా ఆకాంక్షలపై తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. రగులుతున్న పోరులోన రక్తాన్ని చిందించినావా లలితక్కా.. అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం అభ్యసించి ఉద్యమాల బాట పట్టిన రంగవల్లి గురించి అద్భుతమైన పాట రాసి పాడారు. 1996 ప్రాంతంలో తెలంగాణలోని పాలమూరు వలసలపై,పెదరికంపై మిత్ర రాసిన తెలంగాణం ఆల్బమ్‌లో ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే.. తెలంగాణలోనా, నా పాలమూరు లోనా.. అంటూ వలస బ్రతుకుల కన్నీళ్లను కళ్ళకి కట్టి వినిపించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ముద్ర వేసుకున్నారు. వామపక్ష సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న సంతోష్‌ ‌మొదలు న్యూడెమోక్రసీ, అరుణోదయ సాంస్కృతిక ఉద్యమాల్లో ఉన్నారు. అరుణోదయ రాష్ట్ర కార్యదర్శిగానూ ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణా సాంస్కృతిక సారధిలోనూ సంతోష్‌ ‌పనిచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో భాగస్వామ్యులు అయ్యారు.

ఊహ ఎరిగిన నాటి నుంచి పాటే బాటగా పయనించి చివరకు పాట కారణంగానే మరణించారు. ప్రజల కష్టాలనే తన పాటల పల్లవిగా అందుకున్న అరుదైన కళాకారుడు పయిలం సంతోష్‌. ‌రాళ్లు, రోకళ్ళు, కారం పొట్లాలతో నిజాం నవాబుని ఉరికించిన గడ్డమీద జన్మించిన పయిలం గుండెల్లో బూర్జువా వ్యతిరేక, ప్రజా కంఠక విధానాలపై వ్యతిరేక భావనలు సహజంగా జనించాయి. అందుకే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో ప్రపంచంలోనే మహత్తరమైన తెలంగాణా సాయుధ రైతాంగ పోరు గురించి రాస్తూ ‘‘నల్గొండ పేరు వింటే నైజాం వాని పైజాం ఊడిపోయే’’ అని ధిక్కార స్వరం వినిపించిన గొంతుక ఆయనది. కళ కళ కోసమే కాదు ప్రజల కోసమేనని నిరూపించిన పయిలం సంతోష్‌ ‌గారికి అభ్యుదయ నివాళి.

pillutla naga pahani
పిల్లుట్ల నాగఫణి, జర్నలిజం కాకతీయ, విశ్వవిద్యాలయం.
8074022846.

Leave a Reply