ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని వ్యాఖ్య
అమరావతి : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన డియాతో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరిపోసే తీర్పుగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పంతాలకు, పట్టింపులకు పోకుండా.. తాజా నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని పవన్‌కళ్యాణ్ సూచించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఈసీ నోటిఫికేషన్ లేదని హైకోర్టు పేర్కొంది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం వారం వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిందని న్యాయస్థానం పేర్కొంటూ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పటికే ఎన్నికలు నిర్వహించామని.. కౌంటింగ్‌కు అనుమతించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది.