విజయవాడ, ఫిబ్రవరి 22 : టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలు కు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. సివిల్ కోర్టు జడ్జి ఎదుట పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభికి సంబంధించిన మెడికల్ రిపోర్టును జడ్జికి సమర్పించారు.
ఈ క్రమంలో పట్టాభితో మరో 13మందికి జడ్జి రిమాండ్ విధించారు. అయితే మంగళవారం పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా… తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. కాళ్లు, చేతులపై కోట్టారని న్యాయమూర్తికి పట్టాభి విన్నవించారు. దీంతో పట్టాభిని ప్రభుత్వాస్పత్రికి తరలించి మెడికల్ రిపోర్టును అందించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గతరాత్రి మొత్తం పట్టాభిని గన్నవరం పోలీస్‌స్టేషన్ లోనే ఉంచిన పోలీసులు.. మిగిలిన 13మందిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. బుధవారం ఉదయం పట్టాభిని పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పట్టాభికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఆయనను గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. జడ్జి ఆదేశాలతో జైలుకు తరలించారు.