Take a fresh look at your lifestyle.

పటేల్‌కు బిజెపి .. పి.వీకి టిఆర్‌ఎస్‌ ‌బ్రహ్మరథం

మొదటితరం నాయకులొక్కొక్కరిని కాంగ్రెస్‌పార్టీ జారవిడుచుకుంటున్నది .. తమ పార్టీలో లెజెండ్‌లయిన దివంగత నాయకుల పట్ల ఆ పార్టీ సముచిత గౌరవాన్ని చూపించక పోవడంతో ఎదుటి పార్టీలు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. వారి ప్రతిభను తాము గుర్తిస్తున్నట్లుగా ఆ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నా, తమ మేటి నాయకులను కాంగ్రెస్‌పార్టీ గుర్తించ లేకపోతున్నదన్న అపనిందను ఆ పార్టీకి అంటగట్టే రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నాయి. వాస్తవంగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో, స్వాతంత్య్రానంతరం నిజాం కబంద హస్తాలనుండి తెలంగాణ ప్రాంతాన్ని బంధ విముక్తి చేయడంలో విశేషంగా కృషిచేసిన నాయకత్వం గురించి ముందు తరాలకు తెలియాల్సిన అవసరముంది. కాని, కాంగ్రెస్‌పార్టీ కేవలం నెహ్రూ, గాంధీల వంశజులకే ప్రాధాన్యమిస్తూ, ఇతరులెవరినీ వారితో సమానంగా చూడలేకపోతోందన్న అపవాద చాలాకాలంగా ఉంది. స్వాతంత్య్రానంతరం దేశంలో నెలకొన్న అనేక చిక్కుముడులను విప్పదీయటంలో అసమాన ధైర్య సహాసాలను ప్రదర్శించి, జాతిని సమైక్యంచేసిన ఉక్కు మనిషి సర్ధార్‌ ‌వల్లభాయి పటేల్‌కు ఆ తర్వాతకాలంలో అంత ప్రాధాన్యత లభించలేదంటూ భారతీయ జనతాపార్టీ మొదటినుండీ విమర్శిస్తూనే ఉంది. స్వాతంత్య్రానంతరం తొలి ఉప ప్రధానిగా, తొలి హోం మంత్రిగా ఆయన అసమాన సేవలనందించారు ఆయన సేవలను ముందు తరాలు కూడా గుర్తించే విధంగా ‘జాతీయ సమైక్యతా దివస్‌’ ‌పేరున ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పటేల్‌ ‌కాంస్య విగ్రహాన్ని నర్మదానది ఒడ్డున స్థాపించడం ద్వారా పటేల్‌ను తమవాడిగా ముద్రవేయించుకోవడంలో శక్తిమేర కృషి చేశాడనే చెప్పవచ్చు.

ఇప్పుడు పి.వి. నరసింహారావు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇంచుమించు అదే మార్గంలో అడుగులేస్తున్నది . పి.వీ. తన అంతిమ శ్వాసవరకు కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉన్నవ్యక్తి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుగాని, ఆ తర్వాత ప్రధానిగా కొనసాగినప్పుడు గాని స్వీయ పార్టీవారే ఆయన్ను వేధనకు గురిచేశారు. ఒక విధంగా ఆయన్ను అవమానించారనే చెప్పాలి. దేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్న సమయంలో ఆయన ముందుకువొచ్చి, పార్టీ ప్రతిష్టతోపాటు, దేశ ప్రతిష్టను కూడా పెంచిన వ్యక్తి. అయినా ఆయన జీవిత అంత్యదశలో ఆపార్టీ కన్నీటిపర్యంతరం చేసింది. అంతకు ముందు మరణించిన ప్రధానులకు ఇచ్చిన గౌరవాన్నికూడా ఆయనకు దక్కనీయలేదు. దివంగత ప్రధానులందరిలా దేశ రాజధానిలో అంత్యక్రియలను జరుపకుండా కాంగ్రెస్‌ అడ్డుపడింది. ఎందరికో స్ఫూర్తి దాయకుడైన ఆయన పార్థివ శరీరాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ళేందుకుకూడా అనుమతించలేదు. చివరకు పి. వీ. స్మృతి చిహ్నాన్ని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి పార్టీ అగ్రనేతలు అంగీకరించకపోవడం నిరంతరం పార్టీ అభివృద్ధికి, దేశ సేవకు అంకితమైన వారిపట్ల కాంగ్రెస్‌ ఏవిధంగా వ్యవహరిస్తోందనడానికి ప్రత్యక్ష నిదర్శనం.

ఆనాడు పటేల్‌ను ప్రధాని కాకుండా కొన్ని శక్తులు అడ్డుతగిలాయని చరిత్ర చెబుతున్నది. అలాగే రాజకీయ సన్యాసం తీసుకుంటున్న క్రమంలో ఏరికోరి తెచ్చుకున్న పి. వీ విషయంలోకూడా అలాంటి శక్తులే పనిచేశాయనడానికి ఆనాటి సంఘటనలే ప్రత్యక్షసాక్ష్యం. విచిత్రమేమంటే కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఈ ఇద్దరు దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకులు. రానున్న తరాలు వీరి సేవలను గుర్తించేందుకు కాంగ్రేసేతర పార్టీలే చొరవ తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌కు బద్ద శత్రువైన భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఉక్కు మనిషి సర్దార్‌ ‌పటేల్‌ ‌విగ్రహాన్ని నెలకొల్పాడు. అదేవిధంగా ఢిల్లీలో పి.వీ. నరసింహారావు స్మారక చిహ్మాన్నికూడా మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే నిర్మించింది. పి.వీ. మరణించిన దశాబ్ధకాలానికి ఈ స్మృతి చిహ్నం నిర్మాణం జరిగిందంటే ఆయన నమ్ముకున్న కాంగ్రెస్‌ ఆయన్ను ఎలా దూరం పెట్టిందన్నది అర్థమవుతున్నది.

ఇప్పుడు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంకూడా పి.వీ. శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది . కాంగ్రెస్‌ ‌పార్టీనుండి టిఆర్‌ఎస్‌లోకి వలసవచ్చిన సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు కె. కేశవరావుకు ఈ ఉత్సవాలను నిర్వహించే బాధ్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అప్పగించారు. కేవలం ఆయన జయంతి ఒక్కరోజుకే పరిమితం కాకుంగా సంవత్సరం పొడవునా అనేక కార్యక్రమాలను నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదికూడా తెలంగాణ రాష్ట్రానికో, భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా, తెలుగువారి ఘనకీర్తిని ఖండాంతరాలకు చాటిన మహా మనీషీ శతజయంతి ఉత్సవాల్లో ప్రవాస భారతీయులంతా పాల్గొనేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తున్నది . బహుభాషా కోవిదుడు, అపర చాణక్యుడు, సాహితీవేత్త, అయిన పి.వీ. భారత రత్నకు అర్హుడంటూ, ఆయనకా గౌరవం దక్కేందుకు ప్రధానితో స్వయంగా ముఖ్యమంత్రే విజ్ఞప్తిచేయాలనుకోవడంకన్నా కావల్సిందేముంటుంది.

Leave a Reply