Take a fresh look at your lifestyle.

పతారా పెరిగింది ..!

అప్పుల్లో 25 వ స్థానం
సంక్షేమంలో నం .1
ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడే అప్పులు
తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉం‌డదు
మాస్కులు, భౌతిక నియంత్రణ పాటిస్తే కొరోనాను జయించొచ్చు
విద్యా సంస్థలకు సెలవులు తాత్కాలికమే
ప్రొబెషనరీ పంచాయతీ కార్యదర్శులుకు పూర్తి వేతనం
కొరోనా పరిస్థితులు కొలిక్కి వచ్చాక నిరుద్యోగ భృతి ఇస్తాం
ఆర్టీసీ కార్మికుల వేతనాల పెంపు
దేశంలో వరిధాన్యం ఉత్పత్తిలో 55 శాతం తెలంగాణ నుంచే
అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

‌తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ ‌విధించబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కొరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తాత్కాలికంగానే విద్యా సంస్థలు మూసివేశామనీ, సినిమా హాళ్లను మూసివేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని చెప్పారు. రాష్ట్రంలో కొరోనా పరిస్థితులు కుదుటపడగానే నిరుద్యోగ భృతి ఇస్తామనీ, త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు సైతం పెంచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అప్పులు పెరిగాయనే మాటలో వాస్తవం లేదనీ, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామనీ, దీనిపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పరిశ్రమలను సైతం మూసివేసే ఆలోచన లేదనీ, వాటిని నడపడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్‌ ‌సమాధానమిచ్చారు. ఇటీవల కొందరు సినీ పెద్దలు తనను కలసి రాస్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధించే ఆలోచన ఉందా అని అడిగారనీ, లాక్‌డౌన్‌ ‌వల్ల గతేడాది ఆర్థికంగా చాలా నష్టపోయామనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి లాక్‌డౌన్‌ ‌విధించబోమని స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో కొరోనా విస్పోటనమైన రూపం తీసుకోకుండా ముందే నియంత్రణ చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో కొరోనా మళ్లీ విజృంభించకుండా నివారించాలనే ఉద్దేశంతో బాధతోనే విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేశామని వివరించారు., కొరోనా మహమ్మారి ఎవరినీ అంతుపట్టకుండా తెలంగాణ సహా ప్రపంచాన్ని వేధిస్తోందన్నారు. వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కేంద్రం చేతుల్లో ఉందనీ, టీకా డోసులు అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగాయని ప్రతిపక్షాలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయనీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అప్పులు చాలా తక్కువనీ, అప్పుల విషయంలో తెలంగాణ 22వ స్థానంలో ఉందని తెలిపారు. కొరోనాను తట్టుకుని అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, అయితే, ప్రజలు విధిగా మాస్కు ధరించడం, బౌతిక దూరం పాటించడం వంటి చర్యలు పాటిస్తే కొరోనాను జయించడం సాధ్యమేనని స్పష్టం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా టెస్టుల సంఖ్యను పెంచామనీ, గురువారం ఒక్క రోజే 70 వేల టెస్టులు చేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమనీ, అది ఇవాళ 1.25 కోట్లకు చేరుకుందని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. వందశాతం తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేననీ, రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 17.73 శాతం వృద్ధి రేటు నమోదైందని చెప్పారు. ఒక ఏడాదిలో రూ.లక్ష కోట్ల విలువైన పంట పండించామనీ, దేశంలో ఎఫ్‌సిఐ సేకరించిన ధాన్యంలో 55 శాతం తెలంగాణ నుంచి సేకరించిందేననీ, ఈ విషయాన్ని స్వయంగా ఎఫ్‌సిఐ చెప్పిందని గుర్తు చేశారు. తీసుకొచ్చిన అప్పులతో ప్రాజెక్టులు కట్టామనీ, వాటి ఫలితాలు కూడా వస్తున్నాయన్నారు. వంద శాతం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి తీరతామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ఇందులో భగంగా ఇప్పటికే బడ్జెట్‌లో రూ. 3000 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే వేతనాలు పెంచుతామనీ, అలాగే, ప్రొబెషనరీ పీరియడ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కూడా కార్యదర్శులకు సమానమైన వేతనాలను పెంచనున్నట్లు చెప్పారు. అలాగే, ప్రభుత్వానికి నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందనీ, కొరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక అర్హులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలనీ, అందుకు విరుద్ధంగా ప్రతిపక్షంలో ఉన్నాం కదాని విమర్శలు గుప్పిస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.

Leave a Reply