Take a fresh look at your lifestyle.

పటాన్ చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని అరెస్టు చేయాలి

జర్నలిస్టు సంతోష్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, చంపుతానని బెదిరించిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలని కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. విలేఖరి పై ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడిన ఘటనను నిరసిస్తూ దళిత బహుజన జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం హైదర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి నాలుగో పిల్ల లాంటి వారు, రాజ్యాంగ రక్షణ భాగాల్లో అతి ముఖ్యమైన స్థానం వారికి ఉందన్నారు. ఈ తరుణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, సొంత కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకోకుండా జర్నలిజం వృత్తికి అంకితమై సమాజ సేవ చేస్తున్నారని తెలిపారు.

వృత్తి ధర్మం లో భాగంగా అక్రమాలను వెలికి తీస్తున్న తరుణంలో జర్నలిస్టులపై దాడులు షరా మామూలుగా మారాయని పేర్కొన్నారు. మైపాల్ రెడ్డి అనుచరుల బాగోతం బయటపెట్టినందుకుగాను సంతోష్ నాయక్ అనే విలేకరిని బూతులు తిడుతూ, చంపుతానని బెదిరించటం భావ ప్రకటన స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అన్నారు. వార్తలు వాస్తవం లేకపోతే ఫిర్యాదు చేసేందుకు ఆయనకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ, అధికార అహంకారంతో ఈ రకమైన బెదిరింపులకు పాల్పడ్డాడు అని విమర్శించారు. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినప్పటికీ, ఎమ్మెల్యే ను అరెస్టు చేసేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కపెడుతున్నారని అన్నారు.

మామూలుగానే అగ్రవర్ణాల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినప్పుడు పోలీసులు కాలయాపన చేసి వారిని అరెస్టు చేయకుండా, ముందస్తు బెయిల్ కు అవకాశం ఇచ్చి కాపాడుతున్నారని విమర్శించారు. దీంతో వారి ఆగడాలు మరింత పెరగడానికి పరోక్షంగా పోలీసులే కారణమవుతున్నారు అన్నారు. కాబట్టి ఈ కేసులో అలా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దళితులపై, జర్నలిస్టులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎమ్మెల్యే ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

టీయూడబ్ల్యూజే కూకట్ పల్లి ప్రధాన కార్యదర్శి ఎర్ర యాకయ్య మాట్లాడుతూ కేసు నమోదు చేసిన తరువాత అరెస్టు చేసేందుకు పోలీసులు ఎందుకు వెనుకాడుతున్నారు అని ప్రశ్నించారు. మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన జర్నలిస్టు ఫోరం కూకట్ పల్లి అధ్యక్షుడు రవీందర్, సంయుక్త కార్యదర్శి మహేందర్, కోశాధికారి బుల్లెట్ రవి, జర్నలిస్ట్ నాయకులు నర్సింగరావు, కొండల్ రెడ్డి, బెల్లం శంకర్, రెహమాన్, షబ్బీర్, బలరాం, రాజ్ కుమార్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply