Take a fresh look at your lifestyle.

గత అనుభవాలు ప్రగతికి సోపానాలు కావాలి

‘‘‌డెబ్భయి అయిదు సంవత్సరాలలో పడగలు విప్పి బుసలు కొట్టుతున్న ఆవినీతి, అధికార వ్యామోహం, ధనదాహం ప్రజాస్వామ్య వ్యవస్థ అస్తిత్వానికి, చట్టబద్ధ పాలనకు చేటుగా పరిణమిస్తున్నాయి.  మతోన్మాద తీవ్రవాదం ఆంతరంగిక భద్రతకు భంగం కలిస్తున్నది. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక సామాజిక వ్యవస్థల ద్వారాలు తెలుస్తున్న ప్రపంచీకరణ ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి, పేదలు నిరుపేదలుగా మారడానికి మాత్రమే దోహదపడుతున్నాయి. వ్యవసాయానికి, గ్రామీణ అభివృద్ధికి ఇంతవరకు తగిన ప్రాధాన్యం లభించలేదని  పాలకులు గ్రహించక పోవడం దురదృష్టకరం..!’’

భారత స్వాతంత్య్రానికి డెబ్భయి అయిదు  సంవత్సరాలు నిండిన తరుణం – రజతోత్సవం  – సంతోషం తో జరుపుకోవలసిన  ముఖ్య సంఘటనే. ఈ (2022) ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర భారతానికి డెబ్భయి అయిదు  సంవత్సరాలు నిండుతాయి. కవితాత్మకంగా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశం డెబ్భయి అయిదు వసంతాలను పూర్తి చేసుకున్నది. వాస్తవిక దృష్టిలో పరిశీలిస్తే గత డెబ్భయి అయిదు సంవత్సరాలు హాయిగా, ఆమనిగా, వసంతాలుగానె గడచినాయని చెప్పలేం. శిశిరం, గ్రీష్మం, వర్షం, హేమంతం  తదితర ఆనుభవాలన్నిటికి స్వతంత్ర భారతదేశం లోనయింది. ఉగాది పచ్చడి వలె తీపి, చేదు, పులుపు రుచులతో ఈ డెబ్భయి అయిదు సంవత్సరాల కాలం గడిచింది. కష్టాలు, నష్టాలు, సుఖాలు, దు:ఖాలు. చీకట్లు, వెలుగులు, పగ-ద్వేషం, పాపం పుణ్యం, శతృత్వం, మితృత్వం, శాంతి – అశాంతి కలగాపులగమయి డెబ్భయి అయిదు సంవత్సరాల స్వతంత్ర భారత జీవితం గడచిపోయింది. భవిష్యత్‌ ‌భారతానికి పునాది.. భావి భారతానికి సూచి ఈ డెబ్భయి అయిదు సంవత్సరాల జీవితానుభవం. వ్యక్తి జీవితంలో డెబ్భయి అయిదు సంవత్సరాలు తక్కువ కాలం కాదు, ఒక దేశం చరిత్రలో డెబ్భయి అయిదు సంవత్సరాలు ఎక్కువకాలం కాదు.

డెబ్భయి అయిదు సంవత్సరాల కిందటి వరకు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పాలించారు. ఆంగ్లేయు పాలనను అంతమొందించడానికి స్వాతంత్య్ర ప్రియులు, దేశ భక్తులు నాడు ప్రారంభించిన మహత్తర పోరాటానికి ఈ సంవత్సరం నూటా డెబ్భయి అయిదు సంవత్సరాలు నిండాయి.  గాంధీ మహాత్ముడు దాదాపు ముప్పయి సంవత్సరాలు సాటిలేని నాయకత్వం వహించిన స్వాతంత్య్ర ఉద్యమం అహింసాయుతమయినది. శాంతియుతమయినది. అయితే, రక్తం ప్రవహించకుండా భారత స్వాతంత్య్రం సిద్ధించలేదు. భగత్‌ ‌సింగ్‌ ‌వంటి దేశభక్తులు ఉరికంబాలెక్కి బలి అయినారు. నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌తదితర నేతలు భిన్నమయిన మార్గాలలో నడిచి, స్వాతంత్య్రం కోసం తపించి అమరులయినారు. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది స్వాతంత్య్ర సమరయోధులు అనేక సంవత్సరాలు కారాగారాలలో బంధితులయి కఠిన శిక్షలు అనుభవించారు – ప్రాణాలను సైతం త్యాగం చేసారు. స్వాతంత్య్రం కోసం డెబ్భయి అయిదు సంవత్సరాల కిందట దేశ విభజన జరిగినప్పుడు లక్షలాది మంది ఇల్లూ వాకిలీ కోల్పోయి నిర్వాసితులయినారు, ఆత్మీయులకు దూరమయినారు. ప్రాణాలను సైతం కోల్పోయారు. ఆనాటి రక్తపాతప్పు అగ్నికుండాలు ఈ వాటికీ ఇంకా మండుతున్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం స్వార్థరహితంగా ఉద్యమించి సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయులను ఈ సందర్భాన  మరచిపోలేం – వారిని, వారి అశేష త్యాగాలను సంస్మరించడం పవిత్ర కర్తవ్యం.

స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత గత డెబ్భయి అయిదు సంవత్సరాలలో భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాల స్ఫూర్తి ఎంతవరకు మిగిలి ఉందన్నది ముఖ్య ప్రశ్న. సంబరాల కంటే ముఖ్యమయినది ఈరోజు ఆత్మావలోకనం, ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయం ఇది. గత డెబ్భయి అయిదు సంవత్సరాలను రాజకీయ దృష్టితో పరికించినప్పుడు గణనీయంగా కన్పిస్తున్నది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, అనేక దేశాలలో, విశేషించి మన పొరుగుదేశాలలో ప్రజాస్వామ్యం పలు దాడులకు గురి అయి నామరూపాలు కోల్పోయిన ఈ డెబ్భయి అయిదు సంవత్సరాలలో భారత ప్రజాస్వామ్యం తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం ఆసాధారణ విజయమే. ఇందుకు, తమ ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పవలె కాపాడుకుంటున్నందుకు, భారత ప్రజలను ఈ సందర్భాన అభినందించవలసి ఉంటుంది. అయితే, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్న వాస్తవాన్ని గ్రహించక తప్పదు. క్రమంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనబలం, భుజబలం ప్రాబల్యం విపరీతస్థాయికి వొస్తున్నది. ప్రజాస్వామ్యం అభాసుపాలయి, అవహేళనకు గురి అవుతున్న శోచనీయ ఘటనలకు కొదువలేదు. ప్రజాస్వామ్యం ముసుగులో పచ్చి నిరంకుశత్వం విజృంభించి సామాన్యులు ప్రాథమిక పౌరహక్కులను సైతం కోల్పోతున్న దారుణ దృశ్యాలు ప్రజాతంత్ర వాదులకు ఆమిత వేదన కల్గిస్తున్నాయి. ఎమర్జన్సీ (1975) తదితర విషమ పరిణామాలు సంభవించినప్పటికి గత ఏడున్నర  దశాబ్దాలలో న్యాయ వ్యవస్థ, పత్రికావ్యవస్థ గట్టిగా నిలువగలిగినందుకు సంతోషించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయ వ్యవస్థ, ప్రతికారంగం ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయి.

డెబ్భయి అయిదు సంవత్సరాలలో పడగలు విప్పి బుసలు కొట్టుతున్న ఆవినీతి, అధికార వ్యామోహం, ధనదాహం ప్రజాస్వామ్య వ్యవస్థ అస్తిత్వానికి, చట్టబద్ధ పాలనకు చేటుగా పరిణమిస్తున్నాయి.  మతోన్మాద తీవ్రవాదం ఆంతరంగిక భద్రతకు భంగం కలిస్తున్నది. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక సామాజిక వ్యవస్థల ద్వారాలు తెలుస్తున్న ప్రపంచీకరణ ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి, పేదలు నిరుపేదలుగా మారడానికి మాత్రమే దోహదపడుతున్నాయి. వ్యవసాయానికి, గ్రామీణ అభివృద్ధికి ఇంతవరకు తగిన ప్రాధాన్యం లభించలేదని  పాలకులు గ్రహించక పోవడం దురదృష్టకరం..! గత డెబ్భయి అయిదు సంవత్సరాలలో ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో అభివృద్ధి – కొంత జరిగిన మాట యదార్థమే. కాని, ఈ అభివృద్ధిని మించి పేదరికం, దారిద్య్రం, అజ్ఞానం, అనారోగ్యం చెలరేగాయి. ఈ డెబ్బై అయిదు సంవత్సరాలలో 60 సంవత్సరాల వలస పాలకుల నుండి విముక్తి పొంది తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం ఆహ్వానించదగ్గ ,సొంతోషించాల్సిన మహత్తర ఘట్టం ..!

Leave a Reply