Take a fresh look at your lifestyle.

ఏపిలో పార్టీ.. షర్మిలకు హెచ్చరికా ?

ఏపిలో తమ పార్టీని ఏర్పాటు చేయాలని ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం నుంచి వేలాది సంఖ్యలో తనకు విజ్ఞాపనలు వొస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా కెసిఆర్‌ ‌కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారన్న విషయం గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలియంది కాదు. అయితే గత ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి తిరుగులేని మెజార్టీ రావడంతో కెసిఆర్‌ ‌తాత్కాలికంగా తన ప్రయత్నాన్ని విరమించుకునే పరిస్థితి ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు మినహా ఇతర కలిసివచ్చే పార్టీలను సంఘటిత పరిచే కార్యక్రమం కూడా అంతటితో ఆగినట్లైంది. ఇదిలా ఉంటే కేసిఆర్‌ ‌కేంద్ర రాజకీయాల్లో ప్రవేశిస్తే ఆయన ఉత్తరాదికారిగా ఆయన కుమారుడు, మంత్రి కూడా అయిన కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారన్న విషయం రాజకీయవర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేకుండా పోయింది. రెండు సార్లు అధికారం చేపట్టిన తెరాస నేటికీ సంఖ్యాపరంగా అత్యధిక మెజార్టీతో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఏర్పడుతున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీని కాస్త ఇరకాటకంలో పడవేస్తున్నాయి. ఒక వైపు భారతీయ జనతాపార్టీ, మరో వైపు కాంగ్రెస్‌ అవకాశం దొరికినప్పుడల్లా ఆ పార్టీని ఇబ్బంది పట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీపైన అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజల్లో టిఆర్‌ఎస్‌ ‌పట్ల, సిఎం చంద్రశేఖర్‌రావు పట్ల అపనమ్మకాన్ని కలిగించే విషయంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. కాగా వైఎస్‌ ‌షర్మిల కూడా కొత్తగా ఏర్పాటు చేసిన తన పార్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రల్లో అధికార పార్టీ తప్పిదాలను ఎత్తి చూపుతుంది. ఇప్పటివరకు ఆ పార్టీలోకి వెళ్ళిన పెద్ద నాయకులెవరూ లేకపోయినా టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే పార్టీల జాబితాలో చేరడంతో ఒక విధంగా ఇబ్బందికరమైన విషయమే.

ఈ పార్టీపైన టిఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు ఘాటైన విమర్శలేవీ చేయకపోయినా మంత్రులు, ఇతర నాయకులు నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరో రెండు సంవత్సరాకు తెరాసకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాని, బిజెపి, కాంగ్రెస్‌తో పాటు వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ వొచ్చే ఎన్నికల వరకు కొంత్తైనా గట్టిపడే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితిలో అటు రాజకీయ వర్గాల, ఇటు ప్రజల దృష్టిని మళ్ళించేందుకు కెసిఆర్‌ ‌పై విధంగా ప్రకటన చేసి ఉంటాడని అనుకుంటున్నారు. ఒక విధంగా ఏపి సిఎం జగన్‌తో కెసిఆర్‌ ‌మొదటి నుండి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభసమయంలో ఆహ్వానించడం, తాను ఒకటి రెండు సార్లు ఏపిలో పర్యటించడం అంతా సుహృత్భావంతోనే జరిగింది. అయితే ఇటీవల కాలంలో నీళ్ళ పంచాయితీ వీరిద్దరి మధ్య కాస్త దూరాన్ని పెంచినట్లుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో ఇద్దరూ బయటపడక పోయినా ఇరు రాష్ట్రాల అధికారులు, నాయకుల మధ్య జరుగుతున్న విమర్శ, ప్రతివిమర్శలు మాత్రం వీరి మధ్య దూరాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దానికి తోడు షర్మిల ఇక్కడ పార్టీపెట్టి విస్తృతంగా ప్రచారం చేస్తున్న క్రమంలో జగన్‌ ‌మౌనం వహించడం తెరాస వర్గాలకు, తెలంగాణ ప్రజకు ఇబ్బంది కరంగా మారింది. దానికి తగినట్లు షర్మిల రోజురోజుకు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండడం కెసిఆర్‌ ‌సహనాన్ని పరీక్షించినట్లు అయింది. అందుకే ఇరవై ఏండ్ల పార్టీ ప్లీనరీలో ఆయన సంచలనాత్మక ప్రకటన చేసి ఉంటాడని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం షర్మిలనే టార్గెట్‌ ‌చేయకుండా ఏపి గురించి మాట్లాడడం వెనుక అర్థమేంటన్నది ఇపుడు ప్రధాన చర్చనీయాంశమైంది. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు తెలంగాణ వారికి పరిపాలనే చేతకాదని వెక్కిరించిన విషయాన్ని ఆయన లేవనెత్తి, ఏపి కన్నా ఇప్పుడు తెలంగాణ అన్ని విధాలుగా మెరుగ్గా ఉందని చెప్పడం ఎలాంటి సంకేతమన్నది అందరిని ఆలోచింపజేస్తున్నది.

ప్రధానంగా దళిత బంధు ఉద్యమంలా తెలంగాణలో మొదలు కావడంతో ఏపి ప్రజలు తమకు కూడా అలాంటి పథకాలు కావాలని కోరుకుంటున్నారని, అసలు తెరాస పార్టీని ఏపిలో ఏర్పాటు చేస్తే తామే గెలిపించుకుంటామని వందలు, వేల సంఖ్యలో తనకు విజ్ఞప్తి చేస్తున్నట్లు కెసిఆర్‌ ‌చెప్పుకొచ్చారు. ఏపి తలసరి ఆదాయం లక్షా 70 వేల రూపాయలు అయితే, తెలంగాణ తలసరి ఆదాయం రెండు లక్షల 35 వేల రూపాయలుగా ఉందని, విద్యుత్‌ ‌కోత అన్నదే తెలంగాణలో లేదని, కాని ఏపిలో విద్యుత్‌ ‌కోత ఉందని ఇలా చెప్పడం వెనుక ఎలాంటి సంకేతాలిస్తున్నారన్న దాని పైనే చర్చ జరుగుతున్నది. అంతేకాదు తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ఎంఎల్‌ఏ ‌సాక్షాత్తు మంత్రి సమక్షంలోనే తమకు తెలంగాణ లాంటి పథకాలు కావాలని, కాని పక్షంలో తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్‌ ‌చేసిన విషయాన్ని, అలాగే మహారాష్ట్రలోని నాందేడ్‌ ‌ప్రజలుకూడా అదే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారని ఆయన ప్లీనరీలో వివరించారు. అయితే ఏపి విషయంలో అక్కడి మంత్రివ అనిల్‌ ‌కుమార్‌ ‌కరెంట్‌ ‌కటింగ్‌ అన్నది తమ దగ్గరలేదని, అవరసమైతే పార్టీ పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ, ఇటు షర్మిలకు, అటు జగన్‌కు ఒకేసారి చెక్‌ ‌పెట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడనుకుంటున్నారు.

Leave a Reply