Take a fresh look at your lifestyle.

మరో సంగ్రామానికి సిద్దమవుతున్న పార్టీలు

ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ముగిసిందో లేదో మరో ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ మళ్ళీ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు ఎంఎల్‌సి స్థానాలను గెలుచుకోవడం ద్వారా అధికార టిఆర్‌ఎస్‌కు ఉపశమనం లభించినట్లైంది. దుబ్బాక, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో పోయిన పరువును ఆ పార్టీ నిలబెట్టుకున్నట్లైంది. ఇప్పుడదే ఉత్సాహంతో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికను కూడా గెలుపే లక్ష్యంగా దూసుకుపోయేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నది. గతంలో జరిగిన పొరపాట్లకు ఇక్కడ ఏ మాత్రం తావివ్వవద్దని పార్టీ నాయకులను ఇప్పటికే పార్టీ హెచ్చరిస్త్తుంది. ఎంఎల్‌సి ఎన్నికలకు మంత్రులు, ఎంఎల్‌ఏలతోపాటు పార్టీకి చెందిన చోటా బడా నాయకులంతా తమ ఎన్నికలుగా భావించి ఎలా ప్రచారం చేశారో ఇక్కడ కూడా అదే విధంగా ప్రచారం చేయాలని అధినేత పార్టీ వర్గాలకు సూచిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మండలాలను యూనిట్లుగా విభజించి ప్రతీ యూనిట్‌కు ఒక ఎంఎల్‌ఏను ఇంఛార్జి బాధ్యతలను అప్పగించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల పూర్తి బాధ్యతను మంత్రి కెటిఆర్‌కే ముఖ్యమంత్రి అప్పగించారు. దుబ్బాక, మునిసిపల్‌ ఎన్నికల్లో సిఎం కెసిఆర్‌ ‌స్వయంగా ప్రచారంలో దిగపోవడమే కారణంగా పార్టీ వర్గాలు భావిస్తున్న తరుణంలో ఈసారి ముందస్తుగానే అంటే నెల పదిహేను రోజుల ముందుగానే జిల్లాలోని హాలియాలో పెద్ద బహిరంగ సభను ఏర్పాటుచేసి, ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన పనులు, చేయబోయే పనుల గురించి ప్రజలకు కెసిఆర్‌ ‌సోదాహరణగా చెప్పారు. ఈ ఎన్నికల్లోగా ఆయన మరెన్నిసార్లు జిల్లాలో పర్యటిస్తారో తెలియదుగాని ఏమరుపాటుగా వ్యవహరించవొద్దన్న అభిప్రాయంతో మాత్రం ఉన్నారు.

అలాగే ఇక్కడి నుండి ఎవరిని పోటీలో నిలుపాలన్న విషయంలో కూడా కెసిఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను నిలబెట్టడం ద్వారా ఎలాంటి పరిస్థితులేర్పడ్డాయన్న అనుభవంగా ఈసారి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తున్నది. వాస్తవంగా నాగార్జున సాగర్‌ ‌శాసనసభ స్థానం మొదటినుండి కాంగ్రెస్‌దే కావడంవల్ల ఇక్కడ కాంగ్రెస్‌కే ఎక్కువ పట్టు ఉంది. దానికితోడు ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డినే మరోసారి ఇక్కడి నుండి ఆపార్టీ అధిష్టానవర్గం పోటీకి నిలిపింది. తాజా ఎంఎల్‌సి ఎన్నికలతోపాటు అంతకుముందు జరిగిన అనేక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌తన ప్రతిష్టను కోల్పోతూ వొస్తుండడంతో ఈ స్థానంపై ఆ పార్టీ ఎంతో ఆశపెట్టుకుంది.

కనీసం ఈ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారానైనా పోయిన ప్రతిష్టలో కొంతనైనా నిలుపుకునే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అందుకే ముందుగా ఉప ఎన్నికలో పోటీచేయడం తనకు ఇష్టంలేదని, తన కుమారుడికి టికట్టు ఇస్తే అభ్యంతరంలేదంటూ చెప్పుకొచ్చిన జానారెడ్డినే నిలబడాల్సిందిగా అధిష్టానం ఒప్పించింది. పార్టీలోనే సీనియర్‌ ‌నాయకుడేగాక దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా ఆయనకు గట్టి పట్టు ఉండటంతో ఆయన అయితేనే పోటీ తట్టుకుంటాడని కాంగ్రెస్‌ ‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలాఉంటే దబ్బాక, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో అనూహ్యంగా సీట్లను సంపాదించుకున్న భారతీయ జనతాపార్టీకి కూడా ఇప్పుడీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

నిన్నటి వరకు తల ఎగురేసుకుని తిరిగిన ఈ పార్టీ నాయకులను ఎంఎల్‌సి వోటర్లు తలదించుకునేలా చేశారు. రెండింటిలో కనీసం తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని కూడా ఆ పార్టీ నిలుపుకోలేకపోయింది. దీంతో ఎంత ఉబ్బిపోయిందో అంత నీరసింప చేసినట్లైంది ఆపార్టీ పరిస్థితి. అయితే ఇప్పుడు నాగార్జున సాగర్‌ ఎన్నికల ఆ పార్టీకి లిట్మస్‌ ‌టెస్ట్‌గా మారనుంది. వరుస విజయాలను సాధిస్తూ వొస్తున్నామనుకుంటున్న ఆ పార్టీకి పడిన బ్రేక్‌ను ఈ ఎన్నికల్లో తొలగించుకుంటుందా లేదా అన్నది ఈ ఎన్నికల ఫలితాలపైన ఆదారపడి ఉంది. వాస్తవానికి నాగార్జున సాగర్‌ ‌శాసనసభ నియోజకవర్గంలో ఆ పార్టీకి మొదటి నుండీ పట్టులేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థికి కేవలం రెండు వేల వోట్లు మాత్రమే లభించాయి.

అలాంటిది ఈసారి దుబ్బాకలాగా జాక్‌పాట్‌ ‌కొడుతుందా లేక ఎంఎల్‌సిలలో లాగా బోల్తా పడుతుందా అన్నదిప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే అభ్యర్థి ఎంపికలో కూడా ఆచీతూచి అడుగులేయాలని ఆ పార్టీ చూస్తుంది. ఇప్పటికైతే కాంగ్రెస్‌ అభ్యర్థి పేరు వెలువడింది. ఇక తెరాస అభ్యర్థి ఎవరన్నది తేలాకే తమ అభ్యర్థి పేరును ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కాగా, ఎంఎల్‌సి ఎన్నికలకు వాడిన అస్త్రశస్త్రాలన్నిటిని నాగార్జున సాగర్‌ ‌కోసం జాగ్రత్త పరుస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ బిజెపి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ పోటీ మాత్రం ప్రధానంగా టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌మధ్యనే ఉంటుందనుకుంటున్నారు.

Leave a Reply