- రాజద్రోహం సెక్షన్ ఎత్తివేసేనా ..?
- రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ప్రజాతంత్ర డెస్క్ ,డిసెంబర్ 5:
పార్లమెంట్ శీతాకా సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. అనేకానేక సమస్యలు దేశంలో ఉన్నాయి. వీటిని ఎలా ప్రస్తావిస్తారన్నది ముఖ్యం. విపక్షాలకు సమస్యలపై ర్చించే అవకాశం ఉంటుందా… ఉండదా అన్నది చూడాలి. గతంలో మాదిరిగానే వాకౌట్లు, సస్పెనషన్లతోనే సరిపుచ్చుతారా అన్నది కూడా చూడాలి. ఇకపోతే మత మార్పిడుల నిరోధక చట్టాన్ని తీసుకుని వస్తామని సుప్రీం కోర్టకు కేంద్రం తెలిపింది. దీనిపై సమగ్రంగా చర్చించాల్సి ఉంది. ఇకపోతే 124 ఎ సెక్షన్ తొలగింపుపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికితోడు అనేకానేక సమస్యలు దేశం ముందున్నాయి. వీటిని ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యం. ఇకపోతే దేశంలో ఇడి, ఐటి దాడుల పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. వీటన్నింటిని కేంద్రం ఎలా స్వీకరి స్తుందన్నది చూడాలి.
రాజద్రోహం సెక్షన్ ఎత్తేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. గతంలో చీఫ్ జస్టిస్ట్‌గా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ బ్రిటిష్ కాలం నాటి ఈ చ ట్టాన్ని కొనసాగించడంపై అభ్యంతరం చెప్పారు. అయితే దీనిని కొనసాగించే విషయంపై పునరాలోచి స్తున్నామని, అందుకు తమకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈలోపు రాజద్రోహం సెక్షన్ 124(ఏ) కింద కొత్త కేసులేవీ పెట్టకూడదనే సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. అలాగే… ఇప్పటికే ఈ సెక్షన్ కింద అరెస్టయిన వారి హక్కులను కాపాడేందుకు మార్గదర్శక సూత్రాలను రూపొందించే విషయాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది. రాజద్రోహానికి సంబంధించి పెండింగ్ కేసులు, భవిష్యత్ లో పెట్టబోయే కేసుల విషయంలో ఏం చేస్తారో చెప్పాలని అప్పుడే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు.
2014-19 మధ్య రాజద్రోహం సెక్షన్ కింద దేశవ్యాప్తంగా 326 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 6 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. ఇప్పుడు ఈ సెక్షన్‌ను ఉపసంహరించు కునే క్రమంలో దీనికింద శిక్షకు గురైనవారిని ఏ విధంగా రక్షిస్తారన్నది కూడా ముఖ్యం. దీనిపై పార్లమెంట్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలావుంటే ఇటీవల ప్రజాందోళనలో పాల్గొన్న వారిపై రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమను విమర్శించే వారిపై కేసులు పెట్టడం ఫ్యాషన్‌గా మారింది. ప్రజాస్వామ్యంలో నియంతలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా సెక్షన్ 124ఏ మరింతగా దుర్వినియోగం అవుతూనే ఉంది. నిరంకుశ పోకడలకు ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ వేయాల్సిందే. 124 ఎ ప్రకారం ప్రభుత్వాల అరాచకాలకు, వాటికి వత్తాసు పలుకుతున్న అధికారులకు కత్తెర వేయాల్సి ఉంది.
ప్రజలు అధికారం ఇచ్చేది ఇష్టారాజ్యంగా వ్యవహరిం చడానికి కాదని ప్రభుత్వాలను నడుపుతున్న పార్టీల నేతలు గుర్తించడం లేదు. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కుతున్నారు. తెలుగు రాష్టాల్ర ముఖ్య మంత్రులు కేసీఆర్, జగన్ రెడ్డి,మమతా బెనర్జీలు ఇప్పటికే ప్రజల్లో పలుచనైపోయారు. జాతీయస్థాయిలో బీజేపీని ఎదిరించడం కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి వివిధ రాష్టాల్రు తిరిగి వచ్చిన కేసీఆర్ ఇలాగే నియంతృత్వ ధోరణలు, కుటుంబ పాలనకు ప్రాధాన్యం ఇస్తే ప్రజలు అంగీకరిం చరని గుర్తించడం లేదు. కుయుక్తులతో, రాజకీయ వ్యూహాలతో రాజ్యాలు ఏలడం మానాలి. ప్రజలకు ఏది అవసరమో అది చేయాలి. ప్రజలు ఆందోళన చేయడం అన్నది వారి హక్కు. సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయడం కూడా హక్కుగా గుర్తించాలి. పాలనా పగ్గాలు చేపట్టింది ప్రజలను అణచివేయడానికి కాదని పాలకులు గుర్తించాలి. అణచివేత హద్దులు రినప్పుడు ప్రతిఘటన తప్పదు.
అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని సొంత ఆస్తిలాగా కరిగించి వేస్తున్న నేతలు ఉన్నంత కాలం దేశం బాగుపడదు. ఎంతటి బలమైన నాయకుడికైనా పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. చట్టాలు, నిబంధనలతో నిమిత్తం లేకుండా పైనుంచి వచ్చే ఆదేశాలను శిరసావ హిస్తూ కేసులు పెడుతున్న పోలీసు అధికారులు సైతం ఆలోచన చేయాలి. వలసవాద ప్రభుత్వం పోయినా నయా వలసవాదులు ఇక మితిరి వ్యవహరించకుండా ప్రజలే చైతన్యం కావాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తి ఆరాధన చొరబడినప్పుడు అది నియంతృత్వ పాలనకు దారితీస్తుందని అంబేద్కర్ ఎప్పుడో హెచ్చరిం చారు. ఇందిరాగాంధీ హయాంలో వ్యక్తిపూజ పరాకాష్ఠకు చేరింది. ఫలితంగా దేశ ప్రజలు ఎమర్జెన్సీ చీకటి రోజులను అనుభవించారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు కేంద్రంలో మళ్లీ వ్యక్తి ఆరాధన పెరిగిపోయింది. భారతీయ జనతాపార్టీని ప్రధాని నరేంద్ర మోదీ తనజేబు సంస్థగా మార్చేసుకున్నారు. ఆయన చెప్పినట్లు గానే ఇప్పుడు పార్టీ, ప్రభుత్వం నడుస్తోంది. అధికారాలన్నీ మోదీ వద్ద కేంద్రీకృతం కావడంతో మంత్రులు డ్మగా మారిపోయారు. తెలుగు రాష్టాల్రలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమను తాము నియంతలుగా భావించుకుంటున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ తమ మనసులో ఏమనుకుంటే అదే ప్రభుత్వ నిర్ణయం అయిపోతోంది. మంత్రులు, ఇతర వ్యవస్థలు నిమిత్తమాత్రంగా మిగిలిపోతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ వ్యవహారాం కూడా ఇలాగే ఉంది. తాము గెలిచాం కనుక చెప్పిదే వేదం..చేసిందే చట్టం అన్న రీతిలో ప్రాంతీయ పార్టీల నేతలు నడుచుకుంటున్నారు. వారిని కాలదన్నేలా మోదీ కూడా అంతకుమించి అన్న రీతిలో ఉన్నారు. ప్రజలు తమకు అధికారం అప్పగించారు కనుక తాము ఏం చేసినా చెల్లుబాటు అవు తుందని ప్రధాని మోడీ సహా కేసీఆర్, జగన్ మమతా బెనర్జీలు నమ్ముతున్నారు. తమ నిర్ణయాలను, విధానాలను విమర్శించే వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ఎపి సిఎం జగన్‌కు సాటి వచ్చే వారు లేరు. పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని తమను విమర్శించే వారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. ప్రత్యర్థులను జైలుకు పంపడానికి వెనకాడడం లేదు. ఇలా నిరంకుశ విధానాలపైనా మరోమారు చర్చ సాగాలి. అందుకు పార్లమెంట్ సరైన వేదికగా గుర్తించాలి.