Take a fresh look at your lifestyle.

నేటి నుంచి పార్లమెంటు.. రభస అనివార్యం….

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలో చీలికలు సృష్టించి ఉద్యమ వేడిని చల్లార్చడానికి కేంద్రం చేయగలిగినదంతా చేస్తోంది. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఇంతవరకూ బీజేపీ పట్ల సానుభూతి కలిగిన వారు సైతం అసహ్యించుకుంటున్నారు.ఇదేమీ వ్యక్తిగత అంశం కాదనీ, దేశంలో కోటానుకోట్ల ప్రజల బతుకుతెరువు సమస్య అనీ, దీనిని పరిష్కరించేందుకు సమాజంలో అన్ని వర్గాల వారినీ, వారి ప్రతినిధులను సంప్రదించాల్సి ఉండగా కేంద్రం తూతూ మంత్రంగా చర్చలు జరిపి అయిందనిపించే ధోరణిలో వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. శుక్రవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి సంప్రదాయకంగా చేసే ప్రసంగాన్ని బహిష్కరించేందుకు 16 ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ప్రభుత్వం ఈ చట్టాలపై ఏ దశలోనూ ప్రతిపక్షాలను సంప్రదించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రైతు ఉద్యమాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి బీజేపీ అనుకూల మీడియా శతవిధాల ప్రయత్నిస్తోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. నిజానికి గణతంత్ర దినోత్సవం నాడు తాము ర్యాలీ నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయానికీ,ఆరోజున జరిగిన దానికీ పొంతన లేదనీ, ప్రభుత్వ అనుకూల శక్తులు ఉద్యమంలో ప్రవేశించి పెడతోవ పట్టించాయని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీప్‌ ‌సిద్ధూ అనే యువరైతు సన్నీడియోల్‌ ‌సన్నిహితుడు. బీజేపీ నాయకులందరితోనూ అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రిని కూడా రెండు మూడు సార్లు ప్రతినిధి వర్గాల పేరిట కలిశాడు. అతడికి పలుకుబడి ఉంది కనుకనే రైతుల ర్యాలీని పెడతోవ పట్టించాడు. ఢిల్లీ శివార్లలో జరగాల్సిన ర్యాలీని ఎర్రకోటవైపు నడిపించాడు.అతడి కారణంగానే తాము అప్రదిష్ట పాలయ్యామని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షాల ఆరోపణ కూడా ఇదే .ఈ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి బలప్రయోగంతో అణచివేయాలన్నది ప్రభుత్వ వ్యూహమని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఏభై రోజులు పైగా ఉద్యమం నడిపినా,ఒక్కరికి కూడా హాని తలపెట్టని రీతిలో అత్యంత శాంతియుతంగా సాగించిన ఉద్యమానికి మచ్చ తెచ్చేందుకు ప్రభుత్వమే పథకం ప్రకారం సంఘ విద్రోహ శక్తులను అనుమతించిందని వారు ఆరోపించారు. ఇంతకీ ప్రభుత్వం ఈ విషయమై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించడానికి వచ్చే నష్టమేమిటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. ప్రతిపక్షాలను లెక్కలేని రీతిలో ప్రధాని నరేంద్రమోడీ వ్యవహరిస్తున్నారనీ, ప్రజాస్వామ్యానికి హాని కరమని ఆయన అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ ఇందిర హత్యానంతరం అధికారంలోకి వచ్చినప్పుడు తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షాలను లెక్క చేయడం లేదని బీజేపీ తరచూ ఆరోపించేది.ఇప్పుడు బీజేపీ చేస్తున్నదీ అదే. ఇందిరాగాంధీ ది నియంతృత్వ పోకడ అని ఆరోపించిన కమలనాథులు ఇప్పుడు తమ నాయకుడు అంతకన్నా దారుణంగా ప్రతిపక్షాలను అవమానపరుస్తుంటే నోరు మెదపడం లేదని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. రైతుల సమస్యపై పార్లమెంటులో చర్చకు పట్టుపట్టేందుకు ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి.

- Advertisement -

ప్రభుత్వం ఇందుకోసం తగిన సమయాన్ని కేటాయించాలి. లేని పక్షంలో బడ్జెట్‌ ‌సమావేశాలు రసాభాస కాకతప్పదని అంటున్నారు. ప్రతిపక్షాల సూటిప్రశ్నలకూ, రైతు ఉద్యమంపై సంధించే ప్రశ్నలకూ సమాధానం చెప్పలేకే ప్రభుత్వం శీతాకాల సమావేశాలను రద్దు చేసింది. బడ్జెట్‌ ‌ను ఆమోదించడం తప్పని సరి కనుక ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా ఈ సమావేశాలు సజావుగా సాగుతాయన్న నమ్మకం ప్రభుత్వానికి లేదు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వ శాఖల పద్దులను ఆమోదింపజేసుకోవడానికే పార్లమెంటు సమావేశాలను నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం ఇప్పటికే సర్వత్రా నెలకొంది. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వారు ఇంతమంది ఇన్నివిధాల వ్యతిరేకిస్తున్న వ్యవసాయ చట్టాలను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించరు. ఎర్రకోటపై రైతుల జెండా ఎగురవేసిన ఘటనలో బీజేపీ అనుకూల కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. వారిపై తేలికైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ‌తదితర పార్టీలు ఆరోపించాయి.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పశ్చిమ బంగాల్‌ ‌శాసనసభ గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ చట్టాలు ప్రగతికి మెట్లు అని కేంద్రం ప్రచారం చేస్తోందనీ, కానీ, వాస్తవానికి చీకటికి దారులని తృణమూల్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నందునే తమ నాయకురాలు మమతా బెనర్జీని కేంద్రం టార్గెట్‌ ‌చేసి బలహీన పర్చే ప్రయత్నాలు సాగిస్తోందనీ,కానీ, కేంద్రం ఎంత ప్రయత్నిస్తే అంత ఎక్కువగా మమతా బెనర్జీ బలపడతారనీ,వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలుపొందుతారని తృణమూల్‌ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తృణమూల్‌ ‌నుంచి బీజేపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యూ,ఇతర ప్రజాప్రతినిధులు నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ ‌చేసారు. తమ పార్టీ నైతిక ప్రమాణాలకు కట్టుబడిన పార్టీ అని చెప్పుకునే కమలనాథులు పశ్చిమ బెంగాల్‌ ‌లో అవినీతికి పరాకాష్టగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేసాల్లో రైతుల సమస్యలపై తీవ్రమైన వాగ్వాదాలు, ఆరోపణలు ,ప్రత్యారోపణలు తప్పవనిపిస్తోంది. ప్రభుత్వం ప్రతిపక్షాల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. రైతు సమస్యలపై చర్చించేందుకు ఇప్పటికైనా అనుమతి ఇవ్వాలని ప్రజాస్వామ్య హితైషులు కోరుతున్నారు.

Leave a Reply