Take a fresh look at your lifestyle.

మొక్కుబడి పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజు సోమవారం లోక్ సభలో మంత్రులకూ, ప్రతిపక్ష సభ్యులకూ వాదోపవాదాలతో వాతావరణం వేడెక్కింది. కొరోనా వైరస్ కారణంగా ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమనీ, ప్రతిపక్షాల నోళ్ళను నొక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. అయితే, పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ఉభయ సభల సభ్యులు కోవిడ్ -19 పరీక్షలు చేయించుకుని రావాలని ప్రభుత్వం ముందుగానే ఆదేశించింది. తొలి రోజున 24 మంది సభ్యులకు కొరోనా పాజిటివ్ నమోదు అయింది. వారిలో ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు. ప్రస్తుత సమావేశాల్లో ముఖ్యమైన బిల్లులను, రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వంటి అంశాలను ముగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కోవిడ్ వ్యాప్తి కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజల కష్టాలనూ, సమస్యలనూ అత్యున్నత ప్రజావేదికలో ప్రస్తావించేందుకు ఈ సమావేశాలు ఉపయోగ పడతాయని ఎంతో ఆశించామనీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరాశ కలిగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఎప్పుడూ ప్రతిపక్షాలను సంప్రదించిన దాఖలాలు లేవనీ, పెద్ద నోట్ల రద్దు, జిఎస్ టి వంటి కీలకమైన నిర్ణయాలన్నీ ఏకపక్షంగానే తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షాల ఆరోపణలు నిరాధారం కాదు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటులో ప్రకటన చేసిన తర్వాత రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించి ఉంటే ఎంతో సమంజసంగా ఉండేది. ఇప్పుడు అత్యంత విలువైన పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ప్రతిపక్షాలు విరుచుకుని పడ్డాయి. అయితే, ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిపక్షాలు వృధా చేస్తున్నాయంటూ ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. గడిచిన ఐదేళ్ళలో లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయం 60 శాతం, రాజ్యసభలో 40 శాతం వృధా అయ్యాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సంప్రదించాలన్న సంప్రదాయం లేదని ప్రతిపక్షాలు ప్రత్యారోపణ చేశాయి.

మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలతో కన్నా , ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతోనే ఎక్కువగా సంప్రదింపులు జరుపుతున్నారు. వారి సలహాలనే ప్రధానంగా తీసుకుంటున్నారు. అయితే, కొరోనా వంటి అతి ముఖ్యమైన సమస్యలపై ప్రతిపక్షాలు సభా ముఖంగా తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం కోల్పోయేట్టు చేయడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు. ప్రభుత్వం ఎన్ని కారణాలు చెప్పినా అది ప్రజాస్వామ్య యుతం కాదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడల ను సమయం వచ్చినప్పుడల్లా విమర్షించే కమలనాథులు ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నది కూడా అదే. ఎమర్జెన్సీ సమయంలో కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ఇందిర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేసిందంటూ కమలనాథులు మహోద్యమాన్ని నిర్వహించారు. అయితే, అప్పట్లో బీజేపీ భారతీయ జనసంఘ్ గా వ్యవహరించబడేది.

1962లో భారత- చైనా యుద్ధ సమయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అప్పట్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 11వ తేదీనుంచి ప్రారంభం కావల్సి ఉండగా, ముందుకు జరిపి అక్టోబర్ 26 నుంచి తొందరగా ముగించేశారు. అప్పుడు కూడా భారతీయ జనసంఘ్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు., పార్లమెంటు సమావేశాలకు ముందు ఉభయ సభల అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించి ప్రశ్నోత్తరాల సమయం గురించి చర్చించడం,ఎవరెవరికి ఎంతెంత సమయం కేటాయించాలనేది నిర్ణయించడం ఆనవాయితీ, ఈసారి అలా జరగలేదని ప్రతిపక్షాలు అంటుండగా, అందరినీ సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇదొక్కటే కాదు. బిజేపీ అన్ని విషయాల్లోనూ ప్రతిపక్షాల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం బిల్లులను ఆమోదింప జేసుకోవడంలో చూపుతున్న ఆసక్తి ప్రజా సమస్యలపై ప్రతి పక్షాలు తమ వాణిని వినిపించుకునే అవకాశం ఇవ్వడం లేదన్న ఆరోపణ సహేతుకమే. కోవిడ్ వ్యాప్తి విషయంలో కూడా ప్రధాన మంత్రి మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తరచూ మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను సమావేశ పరచి చర్చించలేదనే ఆవేదన ప్రతిపక్షాల్లో ఉంది. ఈ విషయాన్ని వారు పెక్కు సందర్భాల్లో వ్యక్తం చేశారు. జిఎస్టి పరిహారం విషయంలో బీజేపీయేతర రాష్ట్రాల అభ్యర్ధన గురించి కేంద్రం పట్టించుకోవడం లేదు. అలాగే, కొరోనా బాధితులకు ప్రకటించిన ప్యాకేజీల విషయంలో చర్చించేందుకు ఈ సమావేశాల్లో ఒక అవకాశం లభించగలదని ప్రతిపక్షాలు ఎదురు చూశాయి. ప్రతిపక్షాలన్నట్టుగా బీజేపేయేతర పార్టీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ప్రశ్నోత్తరాల రద్దు ఓ ఉదాహరణ. వర్షాకాల సమావేశాలను మొక్కుబడిగా నిర్వహించాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

Leave a Reply