Take a fresh look at your lifestyle.

పరిషత్‌ ‌ఫలితాలు టిడిపికి భంగపాటు

ప్రభావం చూపలేకపోయిన కంచుకోటలు – అనేక చోట్ల వైసిపి నేతల విజయాలు
అమరావతి,జూలై 20 : పరిషత్‌ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్షపార్టీలు ఓ రకంగా  డీలాపడ్డాయి. ఈ ఎన్నికల్లో వైసిపి తన బలాన్ని చాటింది. ఎన్నికలు గతంలోనే జరిగినా ఫలితాలు మాత్రం ఆదివారం వెల్లడయ్యాయి. దీనికితోడు టిడిపి కూడా ఎన్నికల బహష్కరణకు పిలుపునిచ్చినా ఫలించలేదు. అసెంబ్లీ ఎన్నికల కంటే దారుణమైన ఫలితాలు టిడిపికి వచ్చాయి.  పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలకు మించి వైసిపికి ప్రజలు బలం చాటారు.

టిడిపి బలంగా ఉన్న చోటకూడా వైసిపి పాగా వేయగం గమనించాలి. ఈ ఎన్నికల ఫలితాలతో టిడిపి పని అయిపోయిందన్న ప్రచారాన్ని అధికార వైసిపి చేపట్టింది. తమకు ప్రజల మద్దతు ఉందని, టిడిపిని ఆదరించడం లేదని అధికార పార్టీ ప్రకటించుకుంది. అయితే వైసిపి దౌర్జన్యాలతో గెలిచిందని టిడిపి ప్రచారం చేస్తోంది. 13 జిల్లా పరిషత్‌ల్లో వైసిపి హవా సాగింది. కనీసం పోటీ ఇవ్వలేక టీడీపీ అభ్యర్థులు చతికిలపడ్డారు. 6,659 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసి అర్థరాత్రి ఫలితాలు వెలువడుతున్న సమయానికి 803 స్థానాలకు పరిమితమైంది. 482 జెడ్పీటీసీలకు పోటీ చేసి కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది. 7 జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల్లో టీడీపీకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ ఒక్క జెడ్పీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. మిగిలిన ఆరు జిల్లాలకు గాను ఐదు జిల్లాల్లో ఒక్కో స్థానాన్ని, కృష్ణా జిల్లాలో రెండు  జెడ్పీటీసీ స్థానాలను అతికష్టం ద సాధించింది. కుప్పంలోకూడా టిడిపి కుదేలయ్యింది.

అక్కడ వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ ‌చేయడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీడీపీకి మిగిలిన 19 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను కూడా దక్కించుకోలేక పోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ దరిదాపుల్లోకి రాలేక చేతులెత్తేశారు. 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా ఒకే ఒక్క మునిసి పాల్టీకి టీడీపీ పరిమితమైంది. ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల్లో అంతకు మించిన పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ చరిత్రలో ఇది అతి పెద్ద ఓటమిగా  విశ్లేషిస్తున్నారు.

ఎన్టీఆర్‌ ‌స్వగ్రామం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఎన్టీఆర్‌ ‌సొంత మండలమైన పామర్రులో మండల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత తొలిసారి టీడీపీ ఓడిపోయింది. పామర్రు మండల పరిషత్‌ను తొలిసారి వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ఇన్నేళ్ల తర్వాత అక్కడ వైఎస్సార్‌సీపీ పాగా వేయడం విశేషం. కొమరోలులోనూ టీడీపీకి పరాజయం తప్పలేదు. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా సొంత నియోజకవర్గంలో బోల్తా పడ్డారు. ఒక్క జెడ్పీటీసీ, ఎంపీపీని కూడా గెలుచుకోలేకపోయారు.

విజయనగరం జిల్లాలో సీనియర్‌ ‌నేత అశోక్‌ ‌గజపతిరాజు కుమార్తె అతిథి పోటీ చేసిన జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.  జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఇన్‌చార్జిగా ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ కైవశం చేసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు సొంత నియోజకవర్గం టెక్కలిలో కోలుకోలేని దెబ్బ తగిలింది. టెక్కలిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచు కుంది. అచ్చెన్న సొంత మండలం కోటబొమ్మాళిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుబ్బ వెంకటరమణరావు విజయబావుటా ఎగుర వేశారు. నియోజకవర్గంలో 78 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ప్రకాశం జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు (పర్చూరు), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), డోలా బాలవీరాంజనేయస్వామి (కొండెపి) తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒక్క జెడ్పీటీసీగానీ, మండల పరిషత్‌గానీ గెలిపించుకోలేక పోయారు. వారి సొంత గ్రామాల్లో సైతం ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందడం గమనార్హం.

- Advertisement -

గుంటూరు జిల్లాలో టీడీపీకి ప్రస్తుతం మిగిలిన ఏకైక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ‌రేప్లలె నియోజకవర్గంలో చిత్తుగా ఓడి పోయారు. 65 ఎంపీటీసీలకు కేవలం నాలుగు చోట్లే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అక్కడ 42 ఎంపీటీసీలకు కేవలం 5 మాత్రమే టీడీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంతగ్రామం అగర్తపాలెంలో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. ఉండి ఎమ్మెల్యే రామరాజు సొంత గ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ, మండల పరిషత్‌ల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలవలేకపోయింది. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్‌ ‌నాయకుడు యనమల రామకృష్ణుడు సొంత గ్రామం తొండంగి మండలం ఏవీ నగరంలో టీడీపీ ఓడిపోయింది.

అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఒక్క జెడ్పీటీసీ, మండల పరిషత్‌ను కూడా టీడీపీ సాధించలేకపోయింది. టీడీపీకి పట్టున్న పలు గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ ‌పయ్యావుల కేశవ్‌ ఒక్క జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, జేసీ దివాకర్‌రెడ్డి వారి సొంత నియోజకవర్గాలైన రాప్తాడు, తాడిపత్రిలో కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. మొత్తంగా టిడిపి కంచుకోట అన్నదగ్గ ప్రాంతాల్లో కూడా వైసిపి పాగా వేసింది. ఇప్పటికే దూకుడు దున్న వైసిపి ఈ ఫలితాలతో మరింత దూకుడు ప్రదర్శించడం ఖాయం.

Leave a Reply