- తాలిబన్లతో పోరాటంలో అలసిన యోధులు
- సాయం కోరినా స్పందించని ప్రపంచ దేశాలు
- సంధికోసం యత్నిస్తున్న అహ్మద్ మసూద్
- ఆర్థిక చక్రబంధనంలో అఫ్ఘాన్: సాయం నిలిపివేసిన ప్రపంచబ్యాంక్
అఫ్ఘాన్‌లో తాలిబన్లు పట్టు బిగిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా అమెరికన్ దళాలు వెళ్లాల్సిందే అన్న అల్టిమేటం ఇచ్చారు. ఇప్పుడు తమను ఎదరించి..తమ సేనలను మట్టుబెట్టిన పంజ్‌షేర్ ప్రావిన్స్‌ను కూడా గుప్పిట్లోకి తీసుకోబోతున్నారు. ఇన్నాళ్లూ శత్రు దుర్భేద్యంగా ఉన్న పంజ్‌షేర్ కోటకు బీటలు వారుతున్నాయి. ఆ ప్రాంత అధినేత అహ్మద్ మసూద్ ముందు ప్రస్తుతం రాజీపడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇక అఫ్గానిస్థాన్ యావత్తూ తాలిబన్ల వశం కానుందన్న సంకేతాలు వొస్తున్నాయి. పోరాటానికి తగిన వనరులు అందుబాటులో లేక, అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం అందక.. తాలిబన్లకు లొంగిపోయే దిశగా మసూద్ అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 150 కిలోవి•టర్ల దూరంలో ఉండే పంజ్‌షేర్ ప్రావిన్సు దశాబ్దాల నుంచి తాలిబన్లకు కొరకరాని కొయ్యే! హిందుకుష్ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతం శత్రు దుర్భేద్యం. 1980ల్లో సోవియట్ సేనలుగానీ, 1990ల్లో తాలిబన్లుగానీ దాన్ని ఆక్రమించుకోలేకపోయారు. పంజ్‌షేర్ సింహంగా పేరున్న అహ్మద్ షా మసూద్ నాటి పోరాటాల్లో ఈ ప్రావిన్సు బలగాలను ముందుండి నడిపించారు. ఆయన కుమారుడే అహ్మద్ మసూద్. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ఇటీవల మళ్లీ విజృంభించిన తాలిబన్లు అఫ్గాన్ మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు.
ఒక్క పంజ్‌షేర్‌ను తప్ప! పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ప్రావిన్సు ప్రస్తుతం అహ్మద్ మసూద్ నాయకత్వంలో ఉంది. తాలిబన్ల విజృంభణ అనంతరం అప్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సహా గత ప్రభుత్వంలోని పలువురు నేతలు పంజ్‌షేర్‌కే వొచ్చేశారు. తాలిబన్లపై సాయుధ పోరుకు వారు ఇక్కడి నుంచి ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అమ్రుల్లా సలేహ్ సహా పలువురు నేతలతో ఇటీవల పలు దఫాలు చర్చలు జరిపిన 32 ఏళ్ల మసూద్.. తండ్రి బాటలోనే తానూ నడుస్తానని ప్రకటించారు. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. తమ బలగాల సంఖ్య 6 వేలకు పైగానే ఉందని తెలిపారు. మళ్లీ పోరుబాట పట్టే సమయం వొస్తుందని గ్రహించి.. తన తండ్రి హయాం నుంచే తాము ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చు కుంటున్నామని చెప్పారు. అయితే తాలిబన్లపై పోరుకు అవి సరిపోవని పేర్కొన్నారు. అంతర్జాతీయ మద్దతు అవసరమన్నారు. సహాయం చేయాల్సిందిగా ఫ్రాన్స్, ఐరోపా, అమెరికా, అరబ్ దేశాలను కోరారు. కానీ వాటి నుంచి స్పందన కరువైంది. తన గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగకుండానే లొంగిపోయి, తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా మసూద్ యోచిస్తున్నారని ఆయన సలహాదారుడొకరు తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో తెలిపారు. తాలిబన్లతో పంజ్‌షేర్ పోరాడలేదు. మాతో పోలిస్తే తాలిబన్ల బలం చాలా ఎక్కువ. 1980లు, 1990ల నాటి పరిస్థితులు వేరు. యుద్దాల్లో ఆరితేరిన ఫైటర్లు ఇప్పుడు తాలిబన్లకు ఉన్నారని ఆచన పేర్కొన్నారు.
ఆర్థిక చక్రబంధనంలో అఫ్ఘాన్: సాయం నిలిపివేసిన ప్రపంచబ్యాంక్
అఫ్గానిస్థాన్‌ను తాలిబప్లు ఆక్రమించడంతో ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే అఫ్గాన్ రిజర్వులను అమెరికా స్తంభింపజేయగా.. తాజాగా ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అక్కడ చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. తాలిబప్లు అధికారంలోకి వొస్తే..ఆ దేశ అభివృద్ధి భవిష్యత్తుపై, మహిళల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ అప్గాన్‌కు చెల్లింపులు నిలిపివేసిన కొన్ని రోజుల్లో ప్రపంచ బ్యాంకు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఇది అప్గానిస్థాన్కు గట్టి ఎదురు దెబ్బ. ‘అప్గానిస్థాన్‌లో మా ప్రాజెక్టులకు చెల్లింపులను నిలివేశాం. పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఇన్నేళ్లు కష్టపడి సాధించిన అభివృద్ధిని కాపాడుకొనేందుకు అక్కడ కొనసాగే విషయంపై మా భాగస్వాములతో కలిసి సరైన మార్గాన్ని అన్వేషిస్తున్నాం. అయితే అక్కడి ప్రజలకు మా మద్దతు కొనసాగుతుంది’ అని ప్రపంచబ్యాంకు ప్రతినిధి పేర్కొన్నారు.