Take a fresh look at your lifestyle.

పండుగలొస్తున్నా… పూర్తి స్థాయిలో బస్సుల నిర్వహణపై ఉలుకు లేని ఆర్టీసీ

దసరా పది రోజులే ఉన్నా కనిపించని హడావుడి
ప్రత్యేక బస్సుల నిర్వహణపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ?

తెలంగాణలో పండుగల సీజన్‌ ‌సమీపిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఇంకా ప్రారంభం కాకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దసరా పండగ మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, తమ సొంత ఊళ్లకు ఎలా చేరుకోవాలి అనే అంశంపై డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే దసరా పండగకు దాదాపు వారం రోజుల ముందు నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించేది. దీంతో •రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హైదరాబాద్‌ ‌నగరంలో నివసించే ప్రజలు ముందుగానే రానుపోను టికెట్లు బుక్‌ ‌చేసుకోవడం, బస్‌ ‌స్టేషన్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వంటి కార్యకలాపాలతో సందడి నెలకొని ఉండేది. ప్రస్తుతం కొరోనా కారణంగా ఆర్టీసీ పాక్షికంగా బస్సు సర్వీసులను నడిపిస్తోంది. ఆర్టీసీలో ఉన్న బస్సుల సంఖ్యలో కేవలం నాలుగోవంతు మాత్రమే ప్రస్తుతం ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. రైల్వే శాఖ రైళ్లను నడుపుతున్నప్పటికీ అవి కూడా నామమాత్ర సంఖ్యలోనే ఉంటున్నాయి. మరోవైపు, సిటీ బస్సులు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. మరోవైపు, దసరా పండగకు ఇతర దేశాలలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు కూడా తమ సొంత జిల్లాలకు వస్తుంటారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని నిజామాబాద్‌, ‌కామారెడ్డి, నిర్మల్‌, ‌మంచిర్యాల వంటి ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో అరబ్‌ ‌దేశాలలో జీవనోపాధి కోసం వెళ్లారు. ప్రతీ దసరా పండగను తమ సొంత గ్రామంలోని జరుపుకోవడానికి వారం రోజుల ముందుగానే ఇక్కడికి వస్తుంటారు. గతంలో వారు శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో దిగగానే జేబీఎస్‌, ఇమ్లిబన్‌ ‌బస్‌స్టేషన్లకు వెళ్లి అక్కడి నుంచి సిద్ధంగా ఉన్న బస్సుల ద్వారా తమ సొంత ఊళ్లకు వెళ్లేవారు. గత కొన్నేళ్లుగా దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ప్రాంతానికి ప్రత్యేక బస్సులు నడిపినప్పటికీ ప్రైవేటు బస్సులను ఆశ్రయించే వారు. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఆర్టీసీ చార్జీ కంటే దాదాపు రెట్టింపు చార్జీని వసూలు చేసే వారు.

అయితే, ప్రస్తుతం కోవిడ్‌ ‌కారణంగా  ఇప్పటి వరకూ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసుల విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కొరోనా కారణంగా దాదాపు మూడు నెలలుగా ఉపాధి లేక బోసిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ ‌నిర్వాహకులు రాజధాని హైదరాబాద్‌ ‌నుంచి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వాహనాలను నడిపే అంశంపై ఆరా తీస్తున్నారు. హైదరాబాధ్‌ ‌నుంచి దసరా సందర్భంగా ఏ రూట్‌కు వాహనాలను నడిపితే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.? చార్జీ ఎంత వసూలు చేయవచ్చు అనే అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు. ఇదే విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారిని సంప్రదించగా, దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందనీ, కొరోనా దృష్ట్యా వాటిని ఏ విధంగా నడపాలనే కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.  ఇదిలా ఉండగా, ఏపీ రాష్ట్రానికి చెందిన వారు సైతం హైదరాబాద్‌లో లక్షల సంఖ్యలో నివాసం ఉంటారు. దసరా సెలవులకు తాము కూడా తమ సొంత రాష్ట్రానికి వెళుతుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల పున:ప్రారంభంపై ఇంకా ఒక స్పష్టత రాకపోవడంతో వారిలోనూ ఈ విషయంపై ఆందోళన నెలకొంది.

Leave a Reply