Take a fresh look at your lifestyle.

విదేశాల్లో గుట్టలుగా అక్రమాస్తులు… గుట్టువిప్పిన పాండోరా పత్రాలు…

అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంతదూరం,కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో’’ అంటూ అంతరాలు లేని సమాజాన్ని కోరుకున్న ఆ మహాకవి దాశరథి కన్నకలలు ఎప్పటికీ కల్లలుగానే ఉండాలా అనే నిరాశా,నిస్పృహలు కొన్ని చేదునిజాలు మనం చూసినప్పుడు కలగక మానదు.2014 పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎల్కే అధ్వాణీ ఓ సందర్భంలో మాట్లాడుతూ విదేశీ ఖాతాల్లో డెబ్బైలక్షల కోట్లకు పైగా నల్లధనం మూలుగుతోందని దాన్ని గనక వెనక్కి తీసుకొచ్చినట్లయితే దేశంలో ప్రతీ కుటుంబానికి పదిహేను లక్షల చొప్పున వారి ఖాతాల్లో వేయవచ్చని అన్నారు.ఒకవేళ అదే జరిగి ఉంటే ఈ చర్చకు సందర్భం వచ్చేది కాదేమో.గతంలో వికీలీక్స్, ‌పనామా పత్రాల మాదిరిగానే ఈసారి పాండోరా పత్రాల రూపంలో ప్రపంచనేతలు, క్రీడాకారులు, కార్పొరేట్‌ ‌దిగ్గజాల అక్రమాస్తుల బాగోతాన్ని పాండోరా పత్రాలు బట్టబయలు చేశాయి.
ఇంటర్నేషనల్‌ ‌కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ‌జర్నలిస్టస్ ‌పేరుతో ప్రపంచవ్యాప్తంగా 600 మంది జర్నలిస్టులు ఈ ప్రాజెక్టులో పాల్గొని 330 మంది ప్రపంచనేతల అక్రమాస్తుల వివరాలు బయట పెట్టాయి.మనదేశం నుంచి ఇండియన్‌ ఎ‌క్స్ప్రెస్‌ ‌పత్రిక ఈ ప్రాజెక్టులో పాల్గొనడం మరోవిశేషం.మొత్తం అరవై నాలుగు లక్షల పత్రాలు, పదిలక్షల ఈమెయిల్స్, ‌ముప్పైవేల ఫోటోలు ఈ పత్రాల్లో బయటపడి ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.అజర్‌ ‌బైజాన్‌ అధ్యక్షుడు మరియు ఆయన అనుచరులు బ్రిటన్లో యాబై నాలుగు కోట్ల డాలర్లు పెట్టి ఆస్తులు కొన్నట్టు వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి, పొరుగుదేశం పాకిస్తాన్‌ ‌ప్రధాని పేరు ఈ పత్రాల్లో నేరుగా ఉండడం ఆయనకి రాజకీయ ఇబ్బందులు పెడుతూ గతంలో నవాజ్‌ ‌షరీఫ్‌ ‌పేరు రాకుండా ఆరోపణల మీదే శిక్ష పడిందని మరి ఇమ్రాన్‌ ‌పేరు వచ్చింది ఆయనేం సమాధానం ఇస్తారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.జోర్డాన్‌ ‌రాజు అక్రమాస్తుల కూడగట్టారని ఓ పక్క ఆరోపణలు వస్తుంటే ఆయన న్యాయవాదులు దాంట్లో అనుచితమేమీ లేదని వాదిస్తుండడం విశేషం.గత ఎన్నికల్లో పన్ను సంస్కరణల మీద హామీ ఇచ్చి నేడు పాండోరా పేపర్లలో లండన్లో అక్రమంగా విదేశీ సంస్థను తనపేరుతో కొన్నారని బ్రిటన్‌ ‌మాజీ ప్రధాని టోనీబ్లేయర్‌ ‌మీద ఆరోపణలు రావడం ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఆయాదేశాల్లో పన్నులు పెద్దమొత్తంలో చెల్లించాల్సి రావడం,ఆదాయ దృవీకరణలు చూపించాల్సి ఉండడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పన్నురేట్లు తక్కువగా ఉండి,అక్రమంగా సంపాదించిన ఆస్తులకు అండగా నిలిచే చట్టాలున్న దేశాలను వెతుక్కుంటూ ఈ అక్రమార్కులు ఆయాదేశాల్లో తమ ఆస్తులు భద్రంగా దాచుకుంటారు.ఇది పన్ను వసూలుకు స్వర్గధామమైన ఆయాదేశాలకు లాభం చేకూరుస్తూ ఉండగా రోజురోజుకూ పేదరికం,అవినీతి,నిరుద్యోగిత వంటి సమస్యలని వర్తమాన దేశాల్లో తెచ్చిపెడుతోంది.
మనది పేదలున్న ధనికదేశం…
పాండోరా బయటపెట్టిన జాబితాలో 380 మంది భారతీయుల పేర్లు ఉన్నాయంటే మనది ఖచ్చితంగా పేదలున్న ధనిక దేశమే.అనిల్‌ అం‌బానీ,నీరవ్‌ ‌మోడీ,కిరణ్‌ ‌మజుందార్‌ ‌షా,సచిన్‌ ‌టెండూల్కర్‌ ‌వంటి వాళ్ళ పేర్లు ఈ జాబితాలో ఉండి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.పైగా ఇందులో అనిల్‌ అం‌బానీ బ్రిటన్‌ ‌కోర్టులో పన్ను ఎగవేత కేసును ఎదుర్కొంటూ ఉండగా నీరవ్‌ ‌మోడీ పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంకులో పదమూడు వందల కోట్లు ఎగ్గొట్టి ఉన్న ఆరోపణల్లో ఉన్నారు.స్వాభావికంగా మనదేశంలో మరియూ ఇతర దేశాల్లో రాజకీయంగా మరియూ కార్పొరేట్‌ ‌రంగంలో ఉన్న అవినీతిని ఈ పత్రాలు బట్టబయలు చేశాయి.పన్ను ఎగవేత కోసం స్వచ్ఛంద సంస్థల పేరుతో నిధులు మళ్లించడం,పన్నుల భారం తక్కువ ఉన్న సింగపుర్‌, ‌కెమెన్‌ ‌దీవుల్లాంటి దేశాలకు వెళ్లి ఆస్తులు దాచుకోవడం ఓ ఒరవడి అయ్యింది.దాచిన సొమ్మునంతా పేదరిక నిర్మూలన,అవినీతి అంతానికి,వాతావరణ మార్పుకోసం ఖర్చు పెట్టాలని ఆక్స్ఫామ్‌ ‌సంస్థ ఆశపడ్డా ఆచరణలో లెక్కలేనన్ని రాజకీయాలు సామాన్యుడికి నిరాశ కలిగించక మానవు.
– పిల్లుట్ల నాగఫణిMA education)అజిమ్‌ ‌ప్రేమ్‌ ‌జీ విశ్వవిద్యాలయం బెంగుళూరు.8074022846.

Leave a Reply