Take a fresh look at your lifestyle.

పంచాంగ శ్రవణమా.. రాజ్యాంగ శ్రవణమా..!

“కేవలం పంచాంగంలో భవిష్యత్తు ఊహలు ఉండవుజ్యోతిషం జోడించి పన్నెండు రాశుల్లో ఉన్నవారికి రాబోయే కాలం ఎలా ఉంటుందో ఊహిస్తారు. రాజ్యాంగంలో పంచాంగాలు ఉంటాయి గాని అదే పంచాంగం కాదు. రాజ్యాంగం ఒక దేశాన్ని నడిపే మార్గదర్శక గ్రంధమే కాని దానంతట అదే మంచీ చెడూ చేయదు.  రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేసే మంచి వారుంటే అది మంచిదిచెడ్డవారి చేతిలో అది చెడ్డది అని అంబేద్కర్ ముందే చెప్పారు.  రాజ్యాంగాన్ని నడిపేది రాజకీయంనాయకత్వంవారు తప్పు చేస్తే అది రాజ్యాంగం తప్పు కాదు.  తప్పు చేస్తారో చేయరో రాజ్యాంగం చూసి చెప్పలేము.”

శార్వరి ఉగాది 25.3.2020

janadharma madabhushi sridhar
న్యాయశాస్త్ర ఆచార్య మాడభూషి శ్రీధర్

శార్వరి ఉగాది నాడు మనం తెలుసుకోవలసినది కాల నిర్ణయం చేసే పంచాంగం గురించా లేక దేశగతిని నిర్ధారించే మన సంవిధాన రాజ్యాంగం గురించా? పంచాంగ శ్రవణం సంగతి సరేగాని రాజ్యాంగం శ్రవణం మాత్రం మరవకూడదనిపిస్తుంది. పంచాంగం మనకు తిథి వారం నక్షత్రం చెబితే మన రాజ్యాంగం మనకు యోగం, కరణం ఏమిటో కూడా తెలియజేస్తుంది. పంచాంగంలో రోజు, గ్రహం, దాని సంచారం, రాశి ఫలం వివరిస్తారు కాని కర్తవ్యం కూడా బోధిస్తే బాగుండేది. ఆ పనిని రాజ్యాంగం ద్వారా తెలుసుకోవడమే రాజ్యాంగ శ్రవణం.

మనకు హోమియోలు ప్రకృతి చికిత్సలు, యునానీ వేరు వైద్యవిధానాలను ఉన్నాయి, వాటికి ఉపయోగం కూడా ఉంది. కాదనడం లేదు. కాని ఇప్పుడు కరోనా అనే కనిపించని వైరస్ పై పోరాటానికి తక్షణం చేయవలసినదేమిటో? తెలుసా? ఏవి ఉపయోగపడతాయో తెలుసుకుని అవే చేయాలి కదా. ఉగాది పచ్చళ్లు, మామిడి తోరణాలు, రాశి ఫలాలు, గోమూత్రాలు, యోగాసనాలు, ప్రాణాయామాలు మంచివైతేకావచ్చు. ఇప్పుడు తక్షణం మన ఇంటి ముందు ముట్టడికి సిద్ధంగా ఉన్న కరోనా వైరస్ వైరిని అవి కట్టడి చేయగలవా? ఎక్కువ మంది జనం గుమికూడితే, లేదా వీధుల్లో దుకాణాల్లో, కాగితాలమీద, నోట్ల మీద, స్టీల్ వస్తువుల మీద, లిఫ్ట్ మీద, తలుపుల మీద వైరస్ రోజులకొద్దీ ఉంటుందని, తాకిలే తగులుకుంటుందని చెబుతూ ఉంటే అర్థం చేసుకోవాలి కదా.

శ్రీరామనవమి కల్యాణాలు, బహిరంగ సమావేశాలు, కరచాలనాలు, మందిర నిర్మాణాలు, విగ్రహ స్థాపనలు ఇప్పుడు కరోనాను వ్యాపింపచేసేందుకు సానుకూల అవకాశాలుగా కనిపిస్తున్నాయి. కనుక శాస్త్రీయ దృక్ఫథంతో వ్యవహరించి, ఆలోచించే స్వేచ్ఛను సాలోచనగా వాడుకుని, నిజాన్ని నిర్భయంగా డాక్టర్ లీ వెన్ లియాంగ్ వలె చెప్పి విజిల్ బ్లోయర్ గా ఉండి, ప్రజలను జాగృతం చేయవలసిన బాద్యత ప్రజల పైన చదువుకున్న వారిపైన ఉంది.

నిజం చెప్పే స్వేచ్ఛనివ్వకపోవడం వల్ల కరోనా వైరస్ ప్రమాదం ముంచుకొస్తుందని ముందే చెప్పిన డాక్టర్ లీ వెన్ లియాంగ్ ను చైనా అరెస్టు చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఫలితం ఇవ్వాళ ప్రపంచమే ప్రమాదం లో పడింది.వైద్యం అందరికీ అందుబాటులో ఉంచే బాధ్యత ప్రభుత్వాలది అనే నిజం వదిలేయడం వల్ల ఈ రోజు కరోనా ను ఎదుర్కొనడానికి మనదగ్గర కావలసిన వనరులు లేవు. అంతా ప్రయివేటు రంగానికి వదిలేయడం వల్ల ప్రభుత్వం రంగంలో పేదలకు కావలసిన చికిత్స దొరికే అవకాశాలు తక్కువైనాయి.

వైద్యం తోబాటు విద్య ప్రభుత్వాలు పాలకులు ప్రజలకు అందివ్వడం కనీస విధి. జనం చైతన్యవంతం అయితే తమను నిలువ నీయరనే భయంతో, నిర్లక్ష్యంతో విద్యను కూడా నిర్లక్ష్యం చేసారు. కనుక ఈ రోగం గురించి శాస్త్రీయంగా చెబితే అర్థం చేసుకునే సహేతుక దృక్ఫథం కొరవడింది. వాక్ స్వాతంత్ర్యం లేకపోవడం వల్ల, విద్య ఇవ్వకపోవడం వల్ల, వైద్య వనరులు లేకపోవడం వల్ల వైరస్ కరోనా మనను భయపెడుతున్నది. ఇది రాజ్యాంగ యుత పాలన చేయని లోపం. ఇది పాలకుల దుర్మార్గం వల్ల వచ్చిన సంక్షోభం. కరోనాను ప్రభుత్వాలు ప్రత్యక్షంగా కారకులు కాకపోయినా, దాన్ని ఎదుర్కోలేని బలహీనతకు పాలకులదే బాధ్యత. కనీస జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఇంటికే పరిమితం కావడం అనేది ఈనాటి సత్యం. దీనికి సిద్ధంగా లేకపోతే ప్రజల బాధ్యతా రాహిత్యానికి ప్రజలే బలవుతారు.

ఇది మతవిశ్వాసాల గురించి చర్చ కాదు, రాజ్యాంగ పాలిత ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రజల బాధ్యతల గురించిన ఆలోచన. రాజ్యాంగంలో పంచాంగాలు ఉన్నాయి. అంటే పాలక ప్రభుత్వ వ్యవస్థ, శాసన రచనా సభా వ్యవస్థ, న్యాయ నిర్ణయ వ్యవస్థ కీలకమైన మూడు. కాగా నాలుగోది అందరికీ సమాచారం చేరవేసే నాలుగో ఎస్టేట్ మీడియా, అందులోనే సోషల్ మీడియా, పౌర సమాజం కూడా కలిసి ఉంది. అయిదోది పోలీసులు, సైన్యం, డాక్టర్లు, ప్రభుత్వోద్యోగుల వర్గం. ఈ అయిదు అంగాలు సరిగ్గా పనిచేయాలనేదే ఈనాటి రాజ్యాంగ పంచాంగ శ్రవణం. ఇందులో ఎవరు ఎంత మేరకు లోపం చేసినా కరోనా బూచి కబళించడానికి సిధ్దంగా ఉంది.

కళ్లు మెదళ్లు తెరవండి. ఇళ్లు దాటి బయటకు రాకండి.

ముహుర్తాలు దుర్ముహూర్తాలు

మంచి పని చేయడానికి ముహూర్తం అవసరం లేదు. చెడ్డపని చేసేవాడు ముహూర్తం చూడడు. మనం మంచి పనులు చేద్దాం.

పంచాంగం
పంచాంగాలు రెండు రకాలు చాంద్రమానం (చంద్రుని సంచారం ఆధారంగా). సూర్యమానం (సూర్యుని సంచారం ఆధారంగా) ఇవి కాలానికి కొలమానాలు. పంచాంగం గురించి కొంత పరిచయం అవసరం. పంచాంగం అంటే ప్రవహించే కాలంలో అయిదు అంగాలు, 1 దినం, 2 తిధి, 3 నక్షత్రం, 6 యోగం, 7 కరణం. నక్షత్రం, తిథి, దినం మొదటి మూడు యోగాలు. నక్షత్రం అంటే తేదీ (27 నక్షత్రాలు), పక్షం అంటే తిథి, వారం సోమ మంగళ వగైరా. అంతిమ అంగం: సాధన, అదే కర్మ, అదే కరణం.

1. కాలాన్ని దైవం అని నమ్ముతారు. ఆ దైవం నివసించి ఉండేది తిధి అంటారు.

2. ఆ గ్రహం దైవానికి ప్రదక్షిణ చేసేది దినం, లేదా వారం,

3. క్షతం లేకుండా రక్షించేది నక్షత్రం (తేదీ వంటిది),

4. చంద్రుడు నక్షత్రంలో ఉన్న కాలాన్ని యోగం అంటారు.

5. కరణం అంటే చేయవలసిన పని… సాధన. విచిత్రమేమంటే పంచాంగంలో సాధన గురించి అడగరు, చెప్పరు, అర్థం చేసుకోరు, చేయరు. అసలు చేయవలసింది ఇదే, చెప్పవలసింది కూడా ఇదే.పంచ అంగాలు అంటే మరో విశ్లేషణ, 1 ఉపాయం, 2 సహాయం, 3 దేశ కాల విభజన, 4 ఆపదకు ప్రతిక్రియ, 5. కార్యసిధ్ది. ఇది కూడా చాలా వరకు ఎవరూ చెప్పరు.

క్రాంతి వృత్తంలో సూర్యుడు మొదలైన గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తము అశ్విని మొదలైన 27 నక్షత్రాల ఆధారంతో నిర్ణీతమైంది. ఈ వృత్తాన్ని 27 నక్షత్రకాలాలుగా 12 రాశులుగా విభజించారు. కాల నిర్ణయం, విభజన. రోజు, పక్షం, నెల, ఆయనం, రుతువులు, సంవత్సరం కూడా కాల విభజనలే.

అమావాస్య నుంచి పూర్ణిమ

తిధి: చంద్రుడు సన్నని రేఖ చంద్రరేఖ గా కనిపించి క్రమంగా వృద్ధి చెందుతూ 15 వ రోజుకి పూర్తిగా కనిపిస్తాడు, అది పూర్ణిమ, మళ్లీ క్రమంగా క్షీణిస్తూ 15 వ రోజుకి అసలు కనిపించడు. అది అమావాస్య. ఈ ప్రక్రియ మొత్తం 29 ½ రోజులలో జరుగుతుంది. పూర్ణిమ నుండి పూర్ణిమ కి 29.5 రోజులు. (30 రోజులు కాదు. సౌలభ్యం కోసం నెలకి 30 రోజులు అంటాం.) కనుక 12 నెలలకి, 12 x 29.5 = 354 రోజులు. పన్నెండు రాశులు, ఇదే చంద్ర సంవత్సరం!

కాలగమనానికి కొలమానం ‘రోజు’. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల వచ్చేవి పగలు, రాత్రి, పగలు, “ఒక పగలు + ఒక రాత్రి = ఒక రోజు” కాల గమనాన్ని కొలవటానికి అనుకూలమైన, సహజమైన, ఒక కొలమానం “రోజు.” రాంత్రింబవళ్ళ “నడక” లో ప్రకృతి దృశ్యాలు చంద్ర కళలు. చంద్రకళలు కూడా కాల గమనానికి కొలబద్దలు.

చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని పూర్ణిమ నుండి పూర్ణిమకి మధ్య ఉండే వ్యవధికి “నెల” అని పేరు పెట్టుకున్నాం. అందుకే చంద్రుడు నెల రాజు. వెన్నెల రాజు.

ఉత్తరాయనం, దక్షిణాయనం

సూర్యుడు ఉదయించే దిశ రోజు రోజుకీ కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు ఎప్పుడూ ఒకే చోట ఉదయించడు. సూర్యోదయం ఉత్తర దిశగా కొన్నాళ్ళు జరిగి, మరికొన్నాళ్ళు దక్షిణ దిశగా జరుగుతుంది. సూర్యోదయ స్థానం ఉత్తర దిశగా జరుగుతూన్నంత కాలం ఉత్తరాయణం. సూర్యోదయ స్థానం దక్షిణ దిశగా జరుగుతూన్నంత కాలం దక్షిణాయణం.

సౌరసంవత్సరం

ఆకాశంలో ఒక రోజు సూర్యుడు ఉదయించిన చోటు గుర్తు పెట్టుకుని సరిగ్గా మళ్ళా అక్కడే ఉదయించటానికి సుమారు 365 రోజులు పడుతుందని మన పూర్వులు గ్రహించారు; అదే సౌర సంవత్సరం. ఈ సౌర సంవత్సరంలో రుతువులు ఎప్పుడు మొదలవుతాయో లెక్క కట్టి చెప్పవచ్చు. ఈ జ్ఞానం పంటలు పండించే వ్యవసాయదారులకీ, చేపలు పట్టే బెస్త వారికీ, ఇతర వృత్తులవారికి ఎంతో ఉపయోగం. కాలగణన, భారతీయ తేదీలు, సంఘటనలను గుర్తుచేసుకునేందుకు పంచాంగం కాలెండర్ గా ఉపయోగపడుతుంది. కాలేందర్ మన పంచాంగం. భూమి చంద్రుడు సూర్యుడు, వారి చుట్టూ తిరిగే గ్రహాల కదలికలను గ్రహచారం అంటారు. ఆయాగ్రహాలు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటే ఎంత ప్రభావమో చెప్పడమే కాలజ్ఞానం. లేదా జ్యోతిషం మొదలైనవి.

మనం అందరమూ సంవత్సరానికి 365 రోజులని చదువుకున్నాం. ఇది సూర్య (సౌర) సంవత్సరం! చంద్రుడిని పట్టించుకోకుండా ఒక్క సూర్యుడి కదలికపైనే ఆధారపడే ఏడాది ఇది. చంద్రుడుని కొలబద్దగా వాడగా వచ్చిన “సంవత్సరం” లో 11 రోజులు తక్కువ. http://lolakam.blogspot.com/2009/03/blog-post.html

సూర్యుడు రుతువులకు కారకుడు.

  • వసంతఋతువు: చైత్రమాసము, వైశాఖమాసము. చెట్లు చిగురించి పూవులు పూస్తాయి.
  • గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసము, ఆషాఢమాసము. ఎండలు మెండుగా ఉంటాయి.
  • వర్షఋతువు: శ్రావణమాసము, భాద్రపదమాసము. వర్షములు విశేషముగా ఉంటాయి.
  • శరదృతువు: ఆశ్వయుజమాసము, కార్తీకమాసము. మంచి వెన్నెల కాస్తుంది.
  • హేమంతఋతువు: మార్గశిరమాసము, పుష్యమాసము. మంచు కురిసే కాలం, చల్లగా ఉండే కాలము.
  • శిశిరఋతువు: మాఘమాసము, ఫాల్గుణమాసము. చెట్లు ఆకులు రాల్చేకాలము.

చంద్రుడికి ఉన్నట్టు సూర్యుడికి కళలుండవు. చంద్రుడు మనసుకు నిదర్శనం, మనిషి మానసిక మార్పులకు చంద్రకళలకు సంబంధం ఉంది. ఇంగ్లీషులో లూనార్ అంటే చంద్ర సంబంధం, లూనాటిక్ అంటే పిచ్చివాడు. కదలని సూర్యుడు కళలు లేని సూర్యుడు కూడా కాలానికి సరైన కొలమానం.

కృష్ణ dark పక్షం, శుక్ల brightపక్షం

అమావాస్యనుంచి పూర్ణిమ దాకా 14 తిథులు, అదంతా ఒక పక్షం, తరువాత పూర్ణిమ నుంచి అమావాశ్య దాక 14 తిథులు మరొక పక్షం. అమావాశ్య నుండి అమావాశ్యకి మధ్య 30 రోజులు. చంద్రుడు భూమి చుట్టూ 30 రోజులలో ఒక పూర్తి ప్రదక్షిణం చేస్తాడు కనుక, చంద్రుడు ప్రయాణం చేసిన కోణీయ దూరం 360 డిగ్రీలు. (డిగ్రీలని జ్యోతిషశాస్త్రంలో “భాగలు” అంటారు.) లేదా రోజు ఒక్కంటికి సగటున 360/30 = 12 డిగ్రీలు కోణం తిరుగుతాడు చంద్రుడు. అమావాశ్య నాడు భూమి నుండి చూస్తే చంద్రుడు, సూర్యుడు ఒకే దిశలో ఉంటారు. కనుక భూమి నుంచి చీకటి గా కనిపిస్తుంది. అది అమావాస్య. ఆ మరునాటికి చంద్రుడు సూర్యుడిని అధిగమించి 12 డిగ్రీలు ముందుకి జరుగుతాడు. ఇలా ముందుకి జరగటానికి పట్టే కాలం ఒక “తిథి”. సూర్యుడు నుండి 12 డిగ్రీల దూరానికి ఒక తిధి ఏర్పడుతుంది. ఈ విధంగా 180 డిగ్రీల దూరం ఇద్దరి మధ్య ఏర్పడే సమయానికి పౌర్ణిమ, ఒకే డిగ్రీలో కలిసినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. ఈ తిథులలో మొదటిది పాడ్యమి. మరో 12 డిగ్రీలు ముందుకు జరగటానికి పట్టే కాలం రెండవ తిథి, విదియ. మూడోది తృతీయ. చతుర్థి పంచమి షష్టి సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్థశి అని 14 వరుస తిథులకు అంకెలతోకూడిన పేర్లు. ఇలా 15 తిథులని దాటేసరికి ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఎదురెదురుగా ఉంటారు – మధ్యలో భూమి ఉంటుంది. ఇదే పూర్ణిమ. మరో 15 తిథులని దాటేసరికి మళ్ళా అమావాశ్య వచ్చేస్తుంది. ఇవే రెండు పక్షాలు..శుక్ల పక్షం, కృష్ణ పక్షం, కలిపితే నెల.

నెలరాజు, రోజు, మానం, మాసం, మూన్

తెలుగులో “నెల” అంటే చంద్రుడు అనే అర్ధం కూడా ఉంది. తెలుగులోనే కాదు. చాల భాషలలో “మాసం” కు “చంద్రుడు” కీ ఒకటే పేరు. రష్యన్ భాషలో “మేస్యత్స” అంటే చంద్రుడు, మాసం అనే రెండు అర్థాలూ ఉన్నాయి. సంస్కృతంలో “మానం” అంటే కొలత. ఇందులోంచే moon అన్న మాట వచ్చింది. కాలాన్ని కొలవడానికి చంద్ర కళలు ఉపయోగిస్తాం.

ఇంగ్లీషులో moon అనే మాట నుంచే month అనే మాట వచ్చింది. “మానం” అన్నా “మాసం” అన్నా ఒక్కటే. చంద్రుడుని ఒక కొలమానంగా పరిగణించేవారు. లేటిన్ లో “me” అనే ధాతువుకి “కొలుచుట” అని అర్థం. ఈ ధాతువులోంచే measurement వచ్చింది.

తారా చంద్రులు, 27 నక్షత్రాలు- తిథులు

సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో నడిచే దారి వెంబడి గుర్తు పెట్టుకోటానికి వీలుగా నక్షత్రాలని గుంపులుగా విడగొట్టి, వాటికి కొన్ని పేర్లు పెట్టారు. ఆ నక్షత్రాల గుంపులనే మనం అశ్వని, భరణి, మొదలైన 27 పేర్లతో పిలుస్తాము. కనుక “అశ్వనీ నక్షత్రం” “అశ్వని” అన్నది ఒక గుంపు పేరు. ఇంగ్లీషులో asterism అంటారు. కనుక 360 డిగ్రీలని 27 చేత భాగిస్తే ఒకొక్క “ఇల్లు” 13 డిగ్రీల 20 నిమిషాల ప్రమాణంలో ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు ప్రయాణం చేస్తూ “ఒకొక్క ఇంట్లో ఒకొక్క రోజు గడుపుతాడు” అన్నది చమత్కారం.

చంద్రుడు మగ అనీ నక్షత్రాలను “ఆడ” అనీ ఊహించి “నెల రాజు” ఒకొక్క రాత్రి ఒకొక్క “రాణి”తో గడిపినట్లు భావించి, చంద్రుడికి 27 నక్షత్రాలూ భార్యలనీ, తారా చంద్రులనీ కథలు రాశారు. ఇంగ్లీషు 30 అంకెల డేట్లకు ఈ 27నక్షత్రాలున్న రోజులను సమానార్థకంగా వాడతారు.

ముహుర్తాలు దుర్ముహూర్తాలు:

మంచి పని చేయడానికి ముహూర్తం అవసరం లేదు. చెడ్డపని చేసేవాడు ముహూర్తం చూడడు. ఇది పంచాంగం గురించి నా అవగాహన. నేను కూడా తెలుసుకునే చెబుతున్నాను. నాకు పూర్తిగా పాండిత్యం లేదు. పంచాంగాలు రాసే వారికి ఇవన్నీ తెలుస్తాయి. పంచాంగం అనేది ఒక లెక్క. ఆ లెక్కల ప్రకారం కాలగమనాన్ని విభజించి వివరిస్తారని తెలుసుకున్నాం. ఇది వ్యవసాయ తదితర వృత్తి పనుల వారికి ఉపయోగపడేది. ఆ గ్రహాలను సంచారాన్ని బట్టి భవిష్యత్తును ఊహించి చెబుతూ ఉంటారు. అది నిశితమైన లెక్కలను బట్టి, సరైన అన్వయాన్ని బట్టి నిజంకావడమో కాకపోవడమో జరుగుతుంది.

sheershikalu janadharma madabhushi sridhar

రాజ్యాంగంలో గ్రహాలు సంచారాలు

గవర్నర్, రాజ్ భవన్, శాసనసభ, శాసనవ్యవస్థ, రాజ్యాంగంలో కీలకమైంది. ప్రజలెన్నుకున్న శాసనసభ్యులు సమావేశమై తమ నేతను ఎన్నుకోవాలి. న్యాయంగా పోటీ జరిగి ఎన్నికైన నేతను గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అంటే గవర్నర్ విడిగా ఉండి, ముఖ్యమంత్రిని స్వతంత్రంగా పనిచేయనీయాలి. జోక్యంచేసుకోకూడదు. రాజ్ భవన్ లో ఉండాల్సిన గ్రహం శాసనసభ వ్యవహారాలలో కార్యవర్గనిర్ణయాలలో తల దూర్చకూడదు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణం.

ప్రభుత్వాలు – శాసనసభలు

ముఖ్యమంత్రి, మంత్రి వర్గం తాము చర్చించి తీసుకున్న నిర్ణయాలకు శాసనసభ ఆమోదం పొందాలి. దానికి ముందు తాము తీసుకున్న నిర్ణయానికి కారణాల పూర్తి వివరాలను శాసనసభ్యుల ముందుంచాలి. నివేదికలు, ప్రకటనలు, బిల్లులు, ఖర్చులు అన్నీ వివరించాలి. శాసనసభ స్వతంత్రంగా ఆలోచించి, చర్చించి ఆమోదం తెలపడమో తిరస్కరించడమో చేయాలి. ఇది ప్రజాస్వామ్య అవసరం. శాసనసభలో బలం లేదని తెలిసి అల్లరి చేసి స్తంభింపచేయడం, అవాస్తవాలు తెలపడం రాజ్యాంగ శాస్త్ర విరుద్ధం. అందువల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతుంది.

Separation of powers, అధికారాల వేర్పాటు

ప్రభుత్వమూ – న్యాయవ్యవస్థా…శాసనిక సంస్థ. భారత రాజ్యాంగం ఈ మూడూ కలవ కూడదని, ముఖ్యంగా పాలక, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాలు పూర్తిగా వేరుగా ఉండాలని నిర్ధారించింది. పాలక వ్యవస్థ శాసనసభల నిర్ణయాలు రాజ్యాంగం అనుసరించి ఉన్నాయా లేక ఉల్లంఘించాయా లేదా అని పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. న్యాయస్థానం ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి న్యాయంగా స్వతంత్రంగా వ్యవహరించాలి. జడ్జిలు పెళ్లిళ్లకు రాజకీయ నాయకులను పిలవకూడదు. వీరు వెళ్లకూడదు. ఇద్దరూ కలిసిపోతే యోగం కాదు సంక్షోభానికి దారితీస్తుంది. వీరు విడిగా ఉండడమే రాజ్యాంగ ధర్మం.

పంచాంగం, రాజ్యాంగం, నడిపేదెవరు?

కేవలం పంచాంగంలో భవిష్యత్తు ఊహలు ఉండవు, జ్యోతిషం జోడించి పన్నెండు రాశుల్లో ఉన్నవారికి రాబోయే కాలం ఎలా ఉంటుందో ఊహిస్తారు. రాజ్యాంగంలో పంచాంగాలు ఉంటాయి గాని అదే పంచాంగం కాదు. రాజ్యాంగం ఒక దేశాన్ని నడిపే మార్గదర్శక గ్రంధమే కాని దానంతట అదే మంచీ చెడూ చేయదు. రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేసే మంచి వారుంటే అది మంచిది, చెడ్డవారి చేతిలో అది చెడ్డది అని అంబేద్కర్ ముందే చెప్పారు. రాజ్యాంగాన్ని నడిపేది రాజకీయం, నాయకత్వం, వారు తప్పు చేస్తే అది రాజ్యాంగం తప్పు కాదు. తప్పు చేస్తారో చేయరో రాజ్యాంగం చూసి చెప్పలేము.

రాజ్యాంగంలో పంచాంగాలు, గ్రహచారం

sheershikalu janadharma madabhushi sridhar

శార్వరి లో నవనాయకులు, పంచాంగం లెక్క

sheershikalu janadharma madabhushi sridhar

ఏడాది నాలుగు భాగాలు: మొదటి భాగం: మార్చి 25 నుంచి జూన్ 30 వరకు

sheershikalu janadharma madabhushi sridhar

2వ భాగం: జులై 1 నుంచి సెప్టెంబర్ 31 దాకా

sheershikalu janadharma madabhushi sridhar

3వ భాగం: 1 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ దాకా

sheershikalu janadharma madabhushi sridhar

4వ భాగం: 2021 జనవరి 1 నుంచి ఏప్రిల్ 12 దాకా

sheershikalu janadharma madabhushi sridhar

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!