Take a fresh look at your lifestyle.

‘‘పాణాలగుత్త’’ రాజకీయాలు!

“|సామాజిక మీడియాల అబద్దాల సాహిత్యం రాషేటోళ్ళు, అభద్రతా భావంల పడి వైద్య పరీక్షలకు నిరాకరించెటోళ్ళు, వైద్య సిబ్బంది మీద దాడులు జేషేటోళ్ళు, అందరూ కొరోనాకు సమానమే! మనం జూడకపోయిన ఆన్ని మతాలను సమానంగా జూషేటి కొరోనా తోని మతవిద్వేషాల గేమ్స్ ఆడుడు ఆపుజేయండి. దేశమంత ‘‘నూనె జ్యోతులు’’ కాదు గని ‘‘జ్ఞానజ్యోతులు’’ ఏలిగియ్యాలె!.”

vikramarkudu‘‘మతములన్నియు మాసి పోవును !, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును!’’ అని గురజాడ చెప్పిన జ్ఞానమే అసలు సిసలు ముందుసూపున్న జ్ఞానం. కండ్లముందు కానచ్చే నికాలసైన సత్యం. కొరోనా మృత్యుకోరలు చాచి విషం చిమ్మే విషమ సమయాన వికృత రాజకీయాల క్రీడా ప్రాంగణాల్లో మతవిద్వేషాలు కత్తియుద్ధం జేయబట్టినయి. మనకున్నట్టు కొరోనాకు మతం జాతి విభేదాలు లేవు. ఈ ఇగురం మరిషి మతం రోతల కొరోనా రాతలు సోషల్‌ ‌మీడియా వేదికగా జోరందుకున్నయి. దొరికిన అవకాశాన్ని వాడుకుంటూ లాక్‌ ‌డౌన్‌కు మతం రంగు పూసుడు, ఒక వర్గం ప్రజలపైన దేశ జనులకు ద్వేషం పెంచే ‘‘సరికొత్త సంస్కృతి’’గా తీర్చిదిద్దబడుతూన్నది. ‘‘గోలీ మారో సాలావోంకో’’! అనే జాతి విద్వేషపూరిత నినాదం సహ స్రావతారాలతో అవకాశాలకోసం కాసుకోని వుంటదనే సత్యం మరోసారి ఈ కొరోనా లాక్‌ ‌డౌన్‌ల నిజమైతాంది. అజ్ఞానపు చీకట్లతోని కొట్టుక పోయెటి జనం కోసం జ్ఞాన దీపమేమన్న ఎలిగిత్తడని, వేలమైళ్ళ దూరం నడిచిపోయే వలస కూలీలబతుకు తిప్పలేమన్న తీరుత్తడనుకుంటిమి. ప్రధాని సారు తీరజెప్పిందేందుల్లా అంటె! ఆదివారం రాత్రి ఎన్ని గంటలకు లైట్లు ఆపాలె ! కొవ్వొత్తులు, దీపాలు, ఫ్లాష్‌ ‌లైట్స్ ఏడ ఎలిగియ్యాలె ! గిసోంటి ముచ్చట్లు ప్రధాని సారు నోటిపొంటచ్చుడు ఇచ్చంత్రం కాబట్టె! ఎనుకముందు ఇచారణ లేకుంట కొరోనా రోగంతోని ఏం గాదుల్లా! అది వుట్టి ‘‘దాల్చా’’సొంటిదని ఓ మంత్రి ఆ మధ్య జెప్పుడు అందర్ని జాగ్రత్తల పడకుంట ఆగం జేషినట్లయింది.

తబ్లీత్‌ ‌జమాత్‌ల దేవుని ప్రార్థనలు జరుగుతయని సర్కారుకు తెల్వంది కాదాయె! పుసుక్కున కొరోనా మీద పడంగనె తబ్లీజ్‌ ‌జమాత్‌ ‌మీద దుమ్మూమన్ను పోసుడు షురువైంది. చిన్నా పెద్దా ఆపీసర్లందరికి మతలబు జేషిండ్లని జెప్పే రాషిన ఉత్తరాల్ని బయటికి సూపబట్టె! ‘‘లాక్‌ ‌డౌన్‌ ‌లొల్లి మోపయింది.జర వీల్లందరికి పాసులు ఇయ్యండ్ర’’ని మర్కజ్‌ ‌కమిటీ నెత్తీనోరు కొట్టుకుంటె ‘‘సెసు’’అని నోరిప్పరైతిరి. ఇంకోదిక్కు మధ్యప్రదేశ్‌ల శివరాజ్‌ ‌సింగ్‌ ‌సారుకు పట్టం గట్టే పనిల మంది జమయితె కొరోనా రాదు గని, నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌కమిటీ సమావేశాల మీద విషంకుండలతోనె కుమ్మరించిండ్లు. కిందికో మీదికో ఇండ్లకు జేరుకుంటె ఇంట్లోళ్ళకు సూతరోగమంటుకునె! ఇంతమందిని రోగం పాల్జేషిందెవలన్న సత్తెం దేశమంత తెల్వాలె! వందలమందిని కదలకుంటజేషి వాళ్ళ పాణాలతోని ఆడుకునుడు రాజకీయం కాదా? కొరోనా పరీక్షలకు రానోళ్ళను కాల్షిసంపాలని ఓ ఎమ్మెల్లే సారంటె, దావకాన్ల ఎకిలి కతలు పడ్డోళ్ళ మీద జాతీయభద్రతాచట్టం బెడ్తనంటడు ఇంకో సి.ఎం.సారు. మీడియా సూత యెప్పటికప్పుడు వేడి బువ్వ వండినట్టు రోజుకో తీర్గ రోతకతలల్లి రాయబట్టె! అని మర్కజ్‌ ‌కమీటోళ్ళనబట్టె! గివీటికి జవాబేడున్నది! మతం రంగు బూసుట్ల ఎవలికెవలూ తక్కువేం గాదు. దేవుడు పనిమీద పంపుతె వచ్చిన సైనికుడే ‘‘కొరోనా’’ అని జెప్పుడు తిప్పలచ్చే ముచ్చట గాదా! మంది కూడితె రోగమంటుకుంటదని జెప్పంగ సూత క్వారెంటిన్‌ ‌దావకన్ల సూత నమాజు జేసుడు పాణాలు పోయేకాడికి వత్తదని తెల్వదా! దావకాన్ల పాణాలు అరిచేతిల బట్టుకోని వైద్దెం జేషే నర్సులు, డాక్టర్లతోని ఎకిలి చేష్టలు మంచిదేనా! రోగమచ్చిందా లేదాని పరీక్ష చేయనీకి వచ్చే డాక్టర్లను రాళ్ళతోని కొట్టుడు, దావకాన కొంటబోయె పోలీసుల మీద గాండ్రించి ఊంచుడు మంచిపనేనా!?ఈ కతలన్ని కండ్ల ముందు జూపెట్టే వీడియోలైతె అబద్దమాడయి గదా! దేశంల రోగం జరంత తగ్గేటాలెకు నిజాముద్దీన్‌ ‌కత మోపయింది. అంటె గిట్ల కంటయితం గని నిజాముద్దీన్‌ ‌ముచ్చట తర్వాత సూత దేశంల మస్త్ ‌మీటింగులయినయని, రాముని పెండ్లి గిట్ల అయిందని తెల్షిందేనాయె! లాక్‌ ‌డౌన్‌ ఉల్లంఘించినోళ్ళపై చర్యలుంటే ఎవలి పాలెంతనో మాగనే తెలిషేది.

- Advertisement -

కోట్లమంది దేవుళ్ళున్న మన దేశాన్నికోరోనా ఏం జేయయదని ఒకలు జెప్పబట్టె! అన్ని మతాలు గజ్జుమనుణుక్కుంట సెల్ఫ్ ‌క్వారెంటిన్ల బోయి దర్వాజలు దగ్గరేసుకున్నంక ప్రజలను కాపాడే దేవుడేడున్నడో తెల్వకపాయె! దేశం మూలమూలనా పీఠాలున్నయి, గా పీఠాలనేలే దేముల్లాంటి సాములెందుకు లాపత్తయిండ్లో తెల్వదాయె! అవు మూత్రం ఇంటి సుట్టు సల్లు కోవాలని, పొద్దు మాపు గిలాసెడు తాగుతె కొరొనా మనజోలి కొందరనబట్టె! మంది గూడితె రోగం పెరుగతని డాక్టర్లు జెప్పుతాంటె రాముని పెండ్లి మాత్రం ఊరూర్లె బరాబరి జేషిమరీ సూపిండ్లు. యాద్గిరి నర్సన్న, యెములాడ రాజన్న, తిరుపతెంకన్న, అల్లాహ్‌, ‌జీసస్‌ ‌లందరు ఎవలిసక్కన వాళ్ళు దాసుకున్నరు. పూజలు జేత్తిమి, ముడుపులు గడ్తిమి, గుండ్లు కొట్టించుకుంటిమి, జాతరలు జేత్తిమి. వారంల రోజోదేమునికి ఉపాసముంటిమి. దిక్కుమెల్ల రోగమోటిమోపాయె! దేముడా! మీరే దిక్కంటె, ఒక్కలన్న గిటుమొకాన జూడరాయె! రాజ్జెమంత బాగుండాలని మునుపు యజ్ఞాలు మాగనే జరిగేటియి. ఇప్పుడు దేశమంత ఆగమైతాంటే సూత యాగం జాడపత్త లేదు. సాములు ముందువడాలె! మళ్ళోపాలి యజ్ఞాలు జేయాలె! ఈపాలి పదివేలమంది కాదు లక్షమందిని మోపు జేషి కొరోనా యజ్ఞం సేయాలె! పాతబస్తీల జేత్తె జర్రింత మంచిగ గొడుతది. యజ్ఞాలతోని కొరోనా రోగం పోతదని ఒక్కలన్న జెప్పరాయె! కిలోలక్కిలోలె బంగారు పోతలు పోషి కిరిటాలు, గదలు, నగలు నట్రా తీరొక్క దేమునికి జేయించినోళ్ళు సప్పుడు జేత్తనే లేరు. కొరోనా నుంచి కనీసం కాపాడేందుకు రాని దేవుళ్ళకు గింతగనం జేయించి లాభమేందో యేమో! ఇప్పుడివన్ని లెక్కకు లేకుంటబాయె! కొరోనా రోగం వూళ్ళెకూళ్ళను పీనుగల జేయబట్టె! సామాజిక మీడియాల అబద్దాల సాహిత్యం రాషేటోళ్ళు, అభద్రతా భావంల పడి వైద్య పరీక్షలకు నిరాకరించెటోళ్ళు, వైద్య సిబ్బంది మీద దాడులు జేషేటోళ్ళు, అందరూ కొరోనాకు సమానమే! మనం జూడకపోయిన ఆన్ని మతాలను సమానంగా జూషేటి కొరోనా తోని మతవిద్వేషాల గేమ్స్ ఆడుడు ఆపుజేయండి. దేశమంత ‘‘నూనె జ్యోతులు’’ కాదు గని ‘‘జ్ఞానజ్యోతులు’’ ఏలిగియ్యాలె!.

సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్!
ఇన్నవు కద! బతుకు భారమై ఇంటిల్లి పాది తట్ట బుట్ట సదురుకోని వేల మైళ్ళు ఆకలి యాత్ర జేషేటి వలస కూలీల బతుకులు ఏం జెప్పబట్టిననయి? తబ్లీజ హజ్రత్‌ ‌వాళ్ళలో ఎక్కువమందికి కొరోనా సోకేందుకు బాధ్యులెవ్వరు? నేనడిగే ప్రశ్నలకు జవాబు లియ్యాలె!? లేకుంటె నీకు కొరోనా పాజిటివ్‌.అని సోషల్‌ ‌మీడియాల ఇడిషిపెడ్త! అని బెదిరిచ్చేటి భేతాళ్‌ ‌శవాన్ని ఎప్పటి లాగనే భుజానేసుకోని ‘‘విను! భేతాళ్‌ ! ‌కొత్తలొడువని ఒల్లెక్కాల మాటలు జెప్పేకాడ కోట్లమంది వలసకూలీల మంచిచెడులు సూసుకునుడు ఏ సర్కార్‌ ‌కైనా తిప్పలే! గిట్ల వలసకూలీలు రోడ్డెక్కుడుతోని వాళ్ళ బతుకు తిప్పలు దేశమంతా చర్చకొచ్చింది. తబ్లీజ్‌ల మస్త్ ‌మంది వున్నరని, బయిట లాక్‌ ‌డౌన్‌ ‌చాలైంది. కాబట్టి మమ్ములను కాపాడుమని మేజిస్ట్రేట్‌ ‌లకు వాళ్ళు రాషిన ఉత్తరాలకు స్పందించుట్ల ఆలిషెం జేషిన రొండు సర్కార్లు జేషింది ‘‘పాణాలగుత్త’’ రాజకీయమని ఎందుకనద్దు? అని జెప్పుకుంట నడ్వబట్టిండు…నడ్వబట్టిండు…
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply