Take a fresh look at your lifestyle.

పాల్వంచ ఘోరానికి మూల కారణం ఈ ‘ఈ అక్రమ సంబంధం’..!

‘‘‌గతంలో పోస్టింగ్‌ ‌లకు పైరవీలు అనధికారికంగా జరిగేవి. ఇప్పుడు బదిలీపై ఎస్‌ఐ, ‌సిఐ పోస్టింగ్‌ ‌లకు స్థానిక శాసనసభ్యుడి సిఫారసు లేఖ ఉండాలని అధికారికంగానే కోరుతున్నారు. ఒక్క పోలీసు డిపార్టుమెంటే కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని విభాగాలలో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు. శాసనసభ్యుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పోస్టింగ్‌ ‌సంపాదించుకున్న అధికారి ప్రజల కోసం పని చేస్తాడా, ఆ ప్రజా ప్రతినిధి కోసం పని చేస్తాడా..?’’

పాల్వంచలో జరిగిన ఘోరకలి తలచుకుంటేనే కడుపులో దేవుతుంది. నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో బయటకు రాకముందే అతని కుటుంబం ఆత్మాహుతి వార్త అందరినీ కదిలించింది. రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతుల కవల పిల్లలు సాహిత్య, సాహితి కూడా మంటలకు ఆహుతై పోవడం కన్నీరు తెప్పించింది. బంగారు బొమ్మల్లాగా ఉన్న ఆ ఇద్దరి జీవితం మొగ్గలోనే బూడిదైపోయింది. 13 ఏళ్లకే వారికి నూరేళ్లు నిండాయన్న విషాదాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇంతలో రామకృష్ణ సెల్ఫీ వీడియో వచ్చింది. అందులో..ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ రామకృష్ణ చెప్పిన మాటలు వినేసరికి బాధ కాస్తా ఆపుకోలేని ఆగ్రహంగా మారింది.

ఒక్క కొత్తగూడెం ప్రాంతంలోనే కాదు. పాల్వంచ ఆత్మాహుతి విషాదం, దానికి దారి తీసిన కిరాతకం రాష్ట్రం అంతటా ప్రజలను నిర్ఘాంతపరిచింది. సహాయం కోరితే ఆ కోరిన వాడి భార్య శరీరాన్ని లంచంగా డిమాండ్‌ ‌చేయడమా..! ఎంత దారుణం..? రామకృష్ణకు తిరగబడే ధైర్యం లేదు. తాను ఒక్కడే ప్రాణం తీసుకుంటే ఆ కీచకుడి నుంచి తన భార్యకు రక్షణ ఉండదని..మొత్తం కుటుంబమే నిష్క్రమించాలని నిర్ణయించాడా అభాగ్యుడు. ప్రాణాలు తీసుకునే ముందు ఏ మూలనో ఉన్న వివేచన పని చేసింది. తాను ఇంత ఘోరకలికి ఎందుకు పాల్పడాల్సివస్తున్నదీ వీడియోలో వివరించాడు. సూయిసైడ్‌ ‌నోట్‌ ‌కూడా ఒకటి రాశాడు కానీ అదొక్కటే ఆధారం అయితే గతంలో జరిగిన చాలా సంఘటనల్లో లాగా వనమా రాఘవేంద్రరావు మళ్లీ తప్పించుకునే వాడు. రాఘవేంద్రరావు అంటే రామకృష్ణ భార్యతో పొందును లంచంగా కోరిన దుర్మార్గుడు. కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు కుమారుడు. వయస్సు 59 సంవత్సరాలు. తండ్రి పేరుకే ఎమ్మెల్యే. నియోజకవర్గంలో పెత్తనం అంతా రాఘవేంద్రరావుదే.

MLA Vanama should be suspended

రామకృష్ణ వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను అక్కడి మీడియా మిత్రులతో మాట్లాడాను. నాకు వచ్చిన పిక్చర్‌ ఏమంటే అతను అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతటి దురాగతానికైనా తెగించే వ్యక్తి. భయంకరమైన స్త్రీ లోలుడు. అతను గతంలో చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. పాపం పండింది కాబట్టి ఇప్పుడీ వీడియో బయటకు వచ్చిందని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మాహుతికి దారి తీసిన రాఘవేంద్రరావు డిమాండ్‌ ‌గురించి తలచుకుంటే మనకే సిగ్గుగా ఉంది. అవునా… బయట పడిన దుర్మార్గం ప్రజలందరిలో ఆగ్రహావేశాలు కలిగించింది కాబట్టి పోలీసు యంత్రాంగం రాఘవేంద్రరావును అరెస్టు చేసి కేసు పెడుతుంది. ప్రాసిక్యూట్‌ ‌చేస్తుంది. శిక్ష పడుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. అధికార పార్టీ కూడా పరువు దక్కించుకునేందుకు ఏం చేయాలో అది చేస్తుంది. కానీ దానితో సరిపోతుందా..? మరెప్పుడూ ఇలాంటి ఘోరాలు జరగవని ధీమాగా అనుకోగలమా. లేదు..!

మనకు తెలుసు. రాఘవేంద్రరావులు చాలా మంది మన చుట్టూ ఉన్నారని మనకు తెలుసు. రాఘవేంద్రరావు గానీ.. అతని లాంటి వారు మరెవరైనా గానీ..వారి అధికారమదానికి గతంలో ఎందరు మౌనంగా బలయిపోయారో. భవిష్యత్తులో మరెందరు బలయిపోతారో. మరి దీనికి పరిష్కారం. లోపం ఎక్కడ ఉంది. లోపం మన రాజకీయ వ్యవస్థలో ఉంది. పోలీసు యంత్రాంగాన్ని ఎవరు అధికారంలో ఉంటే వారికి గులాంగిరీ చేసే బాంచను కాల్మొక్త తరహా వ్యవస్థగా మార్చిన రాజకీయ వ్యవస్థలో ఉంది లోపం. కావాల్సిన పోలీసు ఠాణాలకు బదిలీ కోసం లక్షల రూపాయలు లంచం ఇచ్చే పోలీసు అధికారి ఎంత న్యాయంగా పని చేస్తాడు..? అతని అవినీతిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు భాగం కాకుండా ఉంటారు. ఆ ప్రజా ప్రతినిధులో వారి బంధువులో మహిళలను చెర పట్టడం వంటి హీనమైన నేరాలకు పాల్పడే వారయితే బాధితులకు పోలీసు ఠాణాలో న్యాయం ఎందుకు దొరుకుతుంది. అసలు అక్కడి వరకూ వెళ్లే ధైర్యం ఎవరు చేస్తారు.

గతంలో పోస్టింగ్‌ ‌లకు పైరవీలు అనధికారికంగా జరిగేవి. ఇప్పుడు బదిలీపై ఎస్‌ఐ, ‌సిఐ పోస్టింగ్‌ ‌లకు స్థానిక శాసనసభ్యుడి సిఫారసు లేఖ ఉండాలని అధికారికంగానే కోరుతున్నారు. ఒక్క పోలీసు డిపార్టుమెంటే కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని విభాగాలలో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు. శాసనసభ్యుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పోస్టింగ్‌ ‌సంపాదించుకున్న అధికారి ప్రజల కోసం పని చేస్తాడా, ఆ ప్రజా ప్రతినిధి కోసం పని చేస్తాడా..? ప్రజల ప్రయోజనాలు, ప్రజా ప్రతినిధి ప్రయోజనాలూ పరస్పర విరుద్ధంగా ఉన్నపుడు అధికారి ఎవరి కొమ్ము కాస్తాడు.

ప్రతిపక్షాల చేతిలో ఉన్న నియోజకవర్గాలలో అధికారపక్షం తరపున ఇన్‌ ‌ఛార్జిగా ఉన్న వ్యక్తి మాట చెలామణీ అవుతుంది. మన వ్యవస్థలో పోలీసు స్టేషన్‌ ‌లో ఎవరి మాట చలామణీ అయితే అతడే నాయకుడు. రాజకీయాలలో పైకి రావాలంటే ముందు ప్రజలలో పని చేయాలన్నది పాతకాలం మాట. నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లలో మాట నెగ్గించుకోగలడన్న ఒకే ఒక్క అర్హత ఉంటే చాలు ఇప్పుడు, వాడు రాజకీయాలలో పైకి వచ్చినట్లే. రాజకీయులకూ పోలీసు అధికారులకూ మధ్య ఉన్న ఈ అక్రమ సంబంధం వ్యవస్థలోని అసలు లోపం. ఇది కొనసాగినంత కాలం వనమా రాఘవేంద్రరావులు కూడా కొనసాగుతారు. వారి అకృత్యాలు చాప కింద నీరులా కొనసాగుతుంటాయి. ఎప్పుడో పొరపాటున ఒక దారుణం బయటపడ్డప్పుడు మధ్యతరగతి మానవత్వంతో మనం గగ్గోలు పెడతాం. తర్వాత మళ్లీ మామూలే..

Leave a Reply