వనపర్తి,మే,14(ప్రజాతంత్ర విలేకరి): శీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన 203 జివో ను పార్టీల కతీతంగా అడ్డుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారి అవుతుందని తెలుగుదేశం పార్టీ నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గ అధ్యక్షులు బి.రాములు అన్నారు. గురువారం వనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయాంలో రాయలసీమకు నీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు పథకాన్ని చేపట్టారని అప్పుడు కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు.
తెలంగాణకు సాగునీటి అన్యాయం ఒక ప్రధానంగా ఉద్యమం సాగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, కేసీఆర్ దోస్తీ చేశారని తెలిపారు. పోతిరెడ్డి పాడు నుంచి అదనంగా 25 క్యూసెక్కుల నీరు తరలించేందుకు 203 జీవో వచ్చిందని విమర్శించారు. గతంలో 55వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడుకు తరలించే వారని ఈ జీవో ద్వారా 80 వేలకు పెరుగుతుందన్నారు. దీని వల్ల పాలమూరు జిల్లా ఎడారి గా మారే ప్రమాదం ఉందని కృష్ణాజలాలలపై ఆధారపడిన నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గం ఇంకా తీవ్రంగా నష్టపోనున్నదని ఆయన చెప్పారు. కాలేశ్వరం కంటే ముందుగా శంకుస్థాపన చేసిన పాలమూ రు రంగారెడ్డి పనులు 20 శాతం మాత్రమే జరిగాయని ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దస్తగిరి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిమల్ల రమేష్, బిసి సెల్ అధ్యక్షులు కాగితాల లక్ష్మన్న, జిల్లా కార్యాలయ కార్యదర్శి ఎం.డి గౌస్, టిడిపి మైనార్టీ సెల్ జిల్లా నాయకులు వహీద్. సింగిల్ విండో డైరెక్టర్ చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.