Take a fresh look at your lifestyle.

‌నాటి పల్లె పాదముద్రలు

చెరువులో విసిరిన పెంకాసు..
చెంగు చెంగున నీటి అలలపై..
నవ్వుతూ తూలుతూ ఎగిరెగిరి..
తుదకు మునిగి పోవును పాపం
జీవిత కాల అలలపై ఊగుతూ..
వయసు ముదిరి అదిరి పోయి..
ముడతల తోలుతో బతుకు బక్కచిక్కి ..
మట్టిలో కలవడమే తుదకు పెంకాసులా !

తాటికాయలు నలుపే మరి..
కత్తివాటుతో తీవ్ర గాయం చేయ..
మృదు హృదయాకార ముంజలు..
ఆరోగ్యాన్నిచ్చును తియ్యగా చల్లగా సదా
మనిషి తోలు నలుపు తెలుపైనా..
అంతర భావాలు పరహితాలై..
స్వచ్ఛతల నెలవులుగా నిలిచి..
జనహృదయాల్ని రంజింపజేయాలె !

కుమ్మరి మట్టిని కాళ్లతో తొక్కి..
మన్ను ముద్దల్ని మద్దించి..
కుండగా రూపమిచ్చి కాల్చగా..
శీతల జలాన్నిచ్చే రంజనవుతది
ఏమీ తెలియని నవ శిశువు..
సమాజపు చేతులో నలిగి నిలిచి..
ఎగుడు దిగుడుల్ని అధిగమించి..
నీడనిచ్చే చెట్టులా ఎదిగి నిలబడాలి !

వర్షాకాలపు నిండు గర్భిణిలా..
చెరువు దిగుబడులు మత్తడి దూకిను..
వేసవిలో చెరువు నెర్రెలు బారినా..
రాగడి సత్తువ మన్ను ఇచ్చును కదా
అన్ని గాబులు నిండుగా ఉన్నపుడు..
పది మందికి ఆదరువు కావాలె..
అన్ని కరిగి పోతే దిగులు చెందక..
మానవీయ విలువల ఆస్తులు పంచాలె !

– మధుపాళీ
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply