- ప్రతీ ఏడాది అన్ని చెరువులను ముందుగానే నింపాలి
- పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
వలసల జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరిలోగా వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీటిని అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. శనివారం ప్రగతి భవన్లో పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సలహాదారు పెంటారెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌస్, నార్లాపూర్ ఏదులకాల్వ, పంపుహౌస్, ఏదుల వట్టెం కాల్వ, వట్టెం రిజర్వాయర్ పనులను సమీక్షించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు.
పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రూ. 2 వేల కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమైన సందర్భంగా అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి బిగించే పనులను పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో ఉండాలనీ, ప్రతీ ఏడాది ముందుగానే అన్ని చెరువులను నింపాలని సూచించారు. మిషన్ భగీరథకు నీరు ఇవ్వడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమమ్ డ్రాయింగ్లెవల్ను మెయింటెయిన్ చేయాలని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ ద్వారా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు వాటిని తాగేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచించారు.