Take a fresh look at your lifestyle.

మానవ హక్కులపై మనకు పాక్‌ ‌పాఠాలా..?

మానవ హక్కుల ఉల్లంఘనకు భారత్‌ ‌పాల్పడుతోందంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిటీ సమావేశంలో పాక్‌ ‌ప్రతినిధి ఆరోపించడం దెయ్యాలు వేదాలను వల్లించడమే. పాకిస్తాన్‌లో అసలు  ఏ హక్కులూ లేవు. మత స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేవని అంతర్జాతీయ హక్కుల సంఘాల నాయకులు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పాకిస్తాన్‌లో మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులు, పార్శీల కడగండ్ల గురించి మీడియాలో తరచూ కథనాలు వెలువడుతుంటాయి. పాకిస్తాన్‌లో సాధారణ పౌరులకు హక్కులు లేకపోయినా, ఉగ్రవాదులకు అన్ని హక్కులు ఉన్నాయి. ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసి రిటైరైన వారికి పెన్షన్లు ఇస్తున్నారో లేదో తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి కమిటీ ఉగ్రవాదులని ముద్ర వేసిన వారికి ఠంచన్‌గా పెన్షన్లు ఇస్తున్నారు. వారిని గొప్ప యోధులుగా కీర్తిస్తున్నారు. ముంబాయిపై దాడుల సూత్రధారి అయిన   హఫీజ్‌ ‌సయీద్‌ని గౌరవ భాజనుడని మాజీ  ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ఎన్నోసార్లు పొగిడారు. పాక్‌ ‌సైనిక పాలకుడు జనరల్‌ ‌ముషార్రఫ్‌ అమెరికా నుంచి తమకు అందిన నిధులను జమ్ము, కాశ్మీర్‌లోకి పంపే జిహాదీలకు శిక్షణ ఇవ్వడం కోసం వినియోగించినట్టు  ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ముషార్రఫ్‌ ‌హయాంలో  ఉగ్రవాదులకు ఏ విధంగా సాయం అందుతున్నదీ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ అప్పట్లో బహిరంగంగానే ప్రకటించారు. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నాయకునిగా ముషార్రఫ్‌ ‌సైనిక పాలనను వ్యతిరేకించారు. అంతేకాదు, సమయం వచ్చినప్పుడు తమలో తాము విమర్శించుకున్నా, పాక్‌ ‌నాయకులు భారత్‌  ‌పట్ల వ్యతిరేకత విషయంలో ఒకటవుతుంటారు.

పాకిస్తాన్‌ ‌ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పాకిస్తాన్‌ను చైనా తప్ప ఏ దేశమూ నమ్మడం లేదు. చైనా కూడా భౌగోళికంగా తాను చేపట్టిన ప్రాజెక్టులను అమలు జేయడానికి పాక్‌  ‌సహకారం అవసరం కనుక, సమర్థిస్తోంది. అది కూడా ఆర్థికంగా  మాత్రం కాదు. ఐక్యరాజ్య సమితి కమిటీ సమావేశాల్లో పాక్‌కి అండగా నిలుస్తోంది. పాక్‌కి ఎంతో కాలంగా ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్న సౌదీ అరేబియా ఇటీవల మొండి చెయ్యి చూపింది. పాకిస్తాన్‌ ‌గతంలో తీసుకున్న రుణాల వాయిదాల సొమ్ము చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటూ షరతు పెట్టింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆసియా అభివృద్ది బ్యాంకు వంటి ఆర్థిక సహాయ సంస్థలు ఉగ్రవాద ముద్ర  తొలగించుకుంటేనే సాయం అందిస్తామని     నిర్మొహమాటంగా స్పష్టం చేశాయి. ఇతర దేశాల నుంచి ఆర్థిక సహాయ సంస్థల నుంచి అందే నిధులను అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు  వెచ్చించడానికి బదులు ఉగ్రవాద సంస్థలకు ఉదారంగా సాయం అందించడానికి పాక్‌ ‌ప్రభుత్వం వినియోగిస్తోంది. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నా, సైనిక పాలన అమలులో ఉన్నా ఒకేతీరుగా ఉంటోంది. గట్టిగా మాట్లాడితే పాక్‌ ‌ప్రధానమంత్రికే స్వేచ్ఛ లేదు. ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ఆ ‌మధ్య భోళాగా చేసిన వ్యాఖ్యలకు మత పెద్దలు, సైనికాధికారులు మొట్టికాయలు వేశారు. ఇమ్రాన్‌ ‌ఖాన్‌ అధికారంలోకి రాకముందు  చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారు. అక్కడ సైనికాధికారుల పాత్ర ఎంత కీలకమైందో యావత్‌ ‌ప్రపంచానికీ తెలుసు. పాక్‌లో ఏ పాలకుడైనా ఉగ్రవాద సంస్థల నాయకులూ, సైనికాధికారుల చేతుల్లో బందీ కావల్సిందే. ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌మాజీ క్రికెట్‌ ‌కెప్టెన్‌ ‌కనుక స్పోర్టివ్‌ ‌స్పిరిట్‌తో మాట్లాడుతూ ఉంటారు. అదే ఆయన మెడకు చుట్టుకుంటూ ఉంటుంది.

కాశ్మీర్‌ ‌గురించి పదే పదే ప్రస్తావించే పాకిస్తాన్‌ ‌తమ దేశంలో బలూచిస్థాన్‌, ఆ‌క్రమిత  కాశ్మీర్‌లో మానవ హక్కుల గురించి మాట్లాడదు. ఆక్రమిత కాశ్మీర్‌ను పాక్‌ ‌నాయకులు ఆజాద్‌ ‌కాశ్మీర్‌ అని  పిలుస్తారు. నిజానికి అక్కడి ప్రజలకు ఆజాద్‌(‌స్వాతంత్య్రం) లేదు. గత ఏడాది పాక్‌ ‌స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా బలూచిస్థాన్‌, ఆ‌క్రమిత కాశ్మీర్‌లలో ప్రజలు తాము పాక్‌ ‌నుంచి విడిపోతామంటూ ర్యాలీలను నిర్వహించారు. బలూచిస్థాన్‌లో   సైనికులు ఇళ్ళల్లోకి చొరబడి స్త్రీ, పురుషలనే తేడా లేకుండా మనుషులను ఎత్తుకుని పోవడం, నెలల తరబడి నిర్బంధించడం సర్వసాధారణం. బలూచిస్థాన్‌లో సైనికుల అత్యాచారాలు, దాడుల కారణంగానే అక్కడి ప్రజలు పాక్‌ ‌నుంచి విముక్తిని కోరుకుంటున్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లో ఉపాధి స్వేచ్ఛ లేదు. అక్కడి ప్రభుత్వానికి భద్రతా దళాలపై పట్టు లేదు. అలాగే, హిందూ పూజారులు, అర్చకులపై దాడులు చేయడం, హత్యలు చేయడం సర్వసాధారణం. పాక్‌  ‌ప్రతినిధి వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు భారత ప్రతినిధి సమితి మానవహక్కుల కమిటీ సమావేశంలో ఇవన్నీ ఏకరవు పెట్టారు. పాక్‌కి సాయం చేస్తే నేరుగా ఉగ్రవాదులకు నిధులు అందుతాయని ఫ్రాన్స్, ‌జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే వ్యాఖ్యానించాయి. పాక్‌ ‌మనతో పాటు స్వాతంత్య్రాన్ని పొందినప్పటికీ,  స్వాతంత్య్రం అనేది అక్కడి ప్రజలకు అందని ద్రాక్ష పండు. పాక్‌ ‌ప్రజలు ఆర్థికంగా దుర్భర స్థితిని ఎదుర్కోవడానికి అక్కడ ఉగ్రవాదుల గుప్పిట్లో  చిక్కుకోవడమే. ఉగ్రవాద సంస్థల నాయకులకు అక్కడ లభిస్తున్న ఆదరణకు  ఉదాహరణ దావూద్‌ ఇ‌బ్రహీమ్‌, ‌హఫీజ్‌ ‌సయ్యద్‌ ‌వంటి ఉగ్రవాద సంస్థల నాయకులకు రాచమర్యాదలు లభించడమే. అలాంటి పాకిస్తాన్‌ ‌మన దేశంలో మానవహక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడటం విడ్డూరం కాకమరేమిటి?.

Leave a Reply