Take a fresh look at your lifestyle.

దావూద్‌ ఇ‌బ్రహీమ్‌పై పాక్‌ ‌పిల్లిమొగ్గ

దావూద్‌ ఇ‌బ్రహీమ్‌…ఇరవై ఏడేళ్ళ క్రితం ముంబాయి పేలుళ్ళ సంఘటనకు ప్రధాన సూత్రధారి. అతడు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని మన దేశంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాక్‌ ‌ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తూనే ఉన్నాయి. కానీ, పాక్‌లో సైనిక పాలకులే కాదు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా మన అభ్యర్థనను పట్టించుకోలేదు. దావూద్‌ ‌తమ దేశంలో లేడని బుకాయిస్తూ వచ్చారు. పాకిస్తాన్‌ ఇప్పుడు నిండా ఆర్థిక సంక్షోభంలో మునిగి ఉంది. పాక్‌కి ఇంతవరకూ వెన్నుదన్నుగా నిలిచిన సౌదీ అరేబియా పాక్‌కి సాయం అందించేందుకు నిరాకరిస్తోంది. చైనా పాకిస్తాన్‌ను ఉపయోగించుకోవడమే తప్ప ఎటువంటి సాయం అందించదు. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది. ఆక్రమిత కాశ్మీర్‌ ‌మీదుగా చైనా తలపెట్టిన మహామార్గం(ఒన్‌ ‌బోర్డర్‌- ఒన్‌ ‌రోడ్‌) ‌పథకం, ఆర్థిక నడవ(ఎకనామిక్‌ ‌కారిడార్‌) ‌కార్యక్రమాల కోసం పాక్‌ ‌సాయం అవసరం కనుక పాక్‌ని వెనకేసుకోస్తోంది. సౌదీ అరేబియా మాత్రం పాకిస్తాన్‌ను ఇంతవరకూ ఆర్థికంగా ఆదుకుంటూ వచ్చింది. సౌదీ వైఖరిలో మార్పు వచ్చేట్టు అమెరికా తీవ్రమైన వొత్తిడి తెచ్చింది. ముఖ్యంగా, కాశ్మీర్‌ ‌విషయంలో అమెరికా మన వైఖరిని సమర్థిస్తోంది. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం భారత్‌కి గల సార్వభౌమాధికార హక్కుగా అమెరికా ప్రకటించింది. అమెరికాకు, సౌదీ అరేబియాకూ వ్యాపార రిత్యానూ, గల్ఫ్‌లో వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా సౌదీ అరేబియా అమెరికా మాట వినక తప్పదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ను సౌదీ ఆదుకోకపోవడానికి మన దేశమే కారణమంటూ పాక్‌ ‌మంత్రులు చిర్రుబుర్రులాడారు. అంతేకాక, ఉగ్రవాద సంస్థలకూ, వాటిని సమర్థిస్తున్న దేశాలకూ నిధులు అందకుండా పర్యవేక్షించే ఫైనాన్షియల్‌ ‌యాక్షన్‌ ‌టాస్క్ ‌ఫోర్స్(ఎఫ్‌టిఎఫ్‌ఎ) ‌పాకిస్తాన్‌ను ఇప్పటికే పెక్కు సార్లు హెచ్చరించింది.

జైష్‌ ఎ ‌మహ్మద్‌, ‌లష్కర్‌ ఎ ‌తోయిబా వంటి సంస్థలకు ఆశ్రయం ఇచ్చినంత కాలం పాకిస్తాన్‌కు సాయం అందకూడా చూస్తామని హెచ్చరించింది. అంతేకాక, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్‌ ఇ‌బ్రహీమ్‌ను పట్టి ఇవ్వాలన్ని భారత్‌ ‌డిమాండ్‌ను సమర్థించింది. ఇంత కాలం పాకిస్తాన్‌ ‌తనపై వేటు పడకుండా అమెరికన్‌ ‌పాలకుల సాయంతో బయటపడుతూ వచ్చింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌పాక్‌ ‌పట్ల కఠిన వైఖరి అనుసరిస్తుండటంతో ఎఫ్‌టిఎఫ్‌ఏ ‌తో ఎన్ని రాయబారాలు నెరిపినా ఫలించలేదు. దాంతో దావూద్‌ ఇ‌బ్రహీమ్‌ ‌తమ దేశంలోనే ఉన్నాడంటూ పాకిస్తాన్‌ ‌ప్రకటించింది. దాంతో భారత్‌ ‌తన వాదనను ఇప్పటికైనా పాక్‌ అం‌గీకరించిందంటూ ప్రపంచ దేశాల దృష్టికి తెచ్చింది. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే పాక్‌ ‌మాట మార్చింది. దావూద్‌ ‌తమ దేశంలోనే లేడనీ, అతడి ఆస్తులు ఉన్నాయంటూ మాట మార్చింది. దావూద్‌ ఇ‌బ్రహీమ్‌ ఆస్తులు ఉన్నాయంటే అతడికి సంబంధిత వ్యక్తులు ఎవరో ఒకరు పాక్‌లో ఉన్నట్టే కదా. కానీ, ఈ మాటను కూడా పాక్‌ అం‌గీకరించడం లేదు, భారత్‌పై ఎదురు దాడి ప్రారంభించింది. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి తాము అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తుండటం వల్లనే భారత్‌ ‌తమపై గురి పెట్టిందంటూ పాక్‌ ఆరోపించింది. పాక్‌ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. కొరోనాని ఎదుర్కోవడంలో పాక్‌ ‌పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ సంస్థలేవీ పాక్‌కి సాయం అందించడం లేదు. చైనా కూడా తన అవసరాలకు మాత్రమే పైసలు విదిలిస్తోంది. వాటి కోసం పీక మీద కత్తి పెట్టి అడిగినట్టు డిమాండ్‌ ‌చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌ ‌టిఎఫ్‌ఏ ఆం‌క్షలు లేదా, షరతులకు అంగీకరీంచడం తప్ప పాకిస్తాన్‌కి వేరే మార్గం లేదు. ఇందుకోసం సౌదీ వ్యతిరేక దేశాలతో పైరవీలు జరిపింది. ప్రస్తుత పరిస్థితులలో అంటే, కొరోనా వ్యాప్తి కారణంగా ఏ ఒక్క దేశమూ ఇతర దేశాలకు సాయం చేసే స్థితిలో లేవు. అంతేకాక, పాక్‌ ‌నైజం గురించి అన్ని దేశాలకూ తెలుసు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు చందంగా పాక్‌ ‌వ్యవహరిస్తుంటుంది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపిస్తున్న జమాత్‌ ఉద్‌ ‌దవా, జైష్‌ ఎ ‌మహ్మద్‌, ‌లష్కర్‌ఎ ‌తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల నాయకులంతా పాక్‌ ‌లోనే తలదాచుకున్నారు. వీరికీ పాక్‌ ‌సైన్యానికీ ఉన్న లింకులు జగద్విదితం.

అంతేకాక, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల నుంచి కూడా పాక్‌ ఉ‌గ్రవాదులకు సాయం అందుతూ ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌ ‌నుంచి గంజాయి, మత్తు పదార్థాలు సరిహద్దులను దాటించి భారత్‌లోకి పంపిస్తున్నది ఈ ఉగ్రవాద సంస్థలే. వీటి ప్రధాన ఆదాయ వనరులు గంజాయి ఎగుమతులే. ఇటీవల ఢిల్లీలో పట్టుబడిన ఉగ్రవాదులను ప్రశ్నించిన మీదట ఈ విషయం వెల్లడైంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేయడానికి పాక్‌ ‌నుంచి ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించారు. వారిని ఢిల్లీలో పట్టుకున్నారు. వారందించిన సమాచారం ప్రకారమే తబ్లిగీ సభ్యుల ఖాతాల గురించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆరాలు తీసి, వారికి నోటీసులు జారీ చేస్తోంది. కాశ్మీర్‌ ‌విభజన వల్ల ఉగ్రవాదాన్ని అరికట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నా, సరిహద్దులలో చొరబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2003 లో వాజ్‌ ‌పేయి హయాంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ‌సైనికులు ఇప్పటికీ ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో పాక్‌ ‌మంత్రులు ఈ మధ్య భారత్‌తో అణు యుద్ధానికైనా సిద్ధమేనంటూ వదరు బోతు మాటలకు దిగుతున్నారు. పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌పాలనపై పట్టు కోల్పోయారు. పూర్తిగా సైనికాధికారుల చెప్పుచేతలలో పాలన సాగిస్తున్నారు. జనం దృష్టిని మళ్ళించేందుకు ప్రస్తుత సంక్షోభానికి మాజీ ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ‌కారకుడనీ, ప్రకటిత నేరస్తునిగా కోర్టులు ప్రకటించిన అతడిని తమకు అప్పగించమని బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి ఇమ్రాన్‌ ఇటీవల విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, పాక్‌లో అంతర్గత పరిస్థితి గురించి యావత్‌ ‌ప్రపంచానికీ తెలుసు.

Leave a Reply