అమరావతి, జనవరి 26 : ప్రముఖ తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని గరికపాటి అన్నారు. నా ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలన్నారు. పద్మశ్రీ అవార్డు కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని, కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా గరికపాటి నరసింహరావు అన్నారు. ప్రవచనాల్లో, ప్రసంగాల్లో తల్లి, భార్య ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. యువత దైవత్వంపై శ్రద్ధ కలిగి ఉండటం శుభపరిణామంగా గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు. నా ప్రసంగాల వల్ల కొంతమంది నొచ్చుకొని ఉండొచ్చు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేను ప్రసంగాలు చేయను. నాది విషయ గత విమర్శ అని గరికపాటి అన్నారు. నేను ఎవ్వరికీ భయపడను, ఎవ్వరి సన్మానాల కోసమో, ఎవ్వరి సత్కారాల కోసమో ప్రసంగాలు చేయనని గరికపాటి స్పష్టం చేశారు. ఇంకా ప్రవచనకర్తలు తయారు కావాలి. ఇప్పటి వరకు ఉన్న ప్రవచనకర్తల మధ్య ఆరోగ్యకరమైన పోటీనే ఉందని గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు.