Take a fresh look at your lifestyle.

ఓజోన్‌ ‌పరిరక్షణే మన లక్ష్యం

(సెప్టెంబర్‌ 16 ఓజోన్‌ ‌పరిరక్షణ దినోత్సవం)
ప్రపంచ ఓజోన్‌ ‌పొర పరిరక్షణా దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 16‌న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ ‌పొర వాతావరణ కాలుష్యం వలన క్రమంగా దెబ్బ తింటున్నది . దీనివలన కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఓజోన్‌ ‌పొర రక్షణ కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృత స్థాయిలో ప్రచారం మరియు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఓజోన్‌ ‌పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్‌ ఒప్పందంపై ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్‌ 16 ‌న సంతకాలు చేశాయి. భూమ్మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్‌ ‌పొరను పరిరక్షించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు. తర్వాత 1995 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 16 ‌న ప్రపంచ ఓజోన్‌ ‌పరిరక్షణ దినం జరుపుకుంటున్నాం. మాంట్రియల్‌ ఒప్పందం 1987ప్రకారం వాతావరణ మార్పులు మరియు ఓజోన్‌ ‌క్షీణతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఈ రోజు చేపడతారు.మాంట్రియల్‌ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఓజోన్‌ ‌పొర క్షీణతకు కారణం అయ్యే పదార్థాల ఉత్పత్తిని తగ్గించి ఓజోన్‌ ‌పొరను పరిరక్షించడం. ఐక్యరాజ్యసమితి 2020 ప్రపంచ ఓజోన్‌ ‌దినోత్సవం సందర్భంగా ఽజీవితానికి ఓజోన్‌’’(ఓజోన్‌ ‌ఫర్‌ ‌లైఫ్‌)అం‌శంగా తీసుకున్నారు.భూమిపై మన జీవితానికి ఓజోన్‌ ‌కీలకమని మరియు మన భవిష్యత్‌ ‌తరాల రక్షణ కొరకు కూడా ఓజోన్‌ ‌పొరను రక్షించడం కొనసాగించాలని ఈ అంశం తెలుపుతున్నది.

సూర్యుని నుండి వెలువడే అతిశక్తి వంతమైన,ప్రభావవంతమైన అతినీలలోహిత కిరణాలను శోషించుకొని సకల జీవకోటికి రక్షణగా నిలుస్తోంది ఓజోన్‌ ‌పొర .ప్రాణకోటికి ప్రకృతి అందించిన వరం ఓజోన్‌.‌వాతావరణ కాలుష్యం కారణంగా భూమికి రక్షణగా ఉన్న ఓజోన్‌ ‌పొర క్రమంగా దెబ్బతింటున్నది.ఓజోన్‌ ‌పొర వాతావరణంలోని స్ట్రాటో ఆవరణంలో 25నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంటుంది.మానవుని యొక్క అవసరాల కొరకు ,విలాసాల కొరకు,తాత్కాలిక ఆనందాల కొరకు ఉపయోగిస్తున్న అనేక రకాల పరికరాలతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని భురక్షణ కవచం ఓజోన్‌ ‌ప్రమాదం లోకి నెట్టివేయబడుచునది. ఓజోన్‌ ‌పొర దెబ్బ తినడం వలన సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు జీవ రాశులపై అనేక హానికర ప్రభావాలను కలుగజేస్తాయి. దీని వలన చర్మ సంబంధ కాన్సర్లు,చర్మానికి సంబంధించిన వ్యాధులు,రోగనిరోధక శక్తి కోల్పోవడం,కంటి శుక్లాలు దెబ్బతినడం,దగ్గు,గొంతు నొప్పి, శ్వాస కోశ వ్యాధులు లాంటివే గాకుండా సముద్ర జలచరాలకు కూడా ప్రమాదం ఉంటుంది. దీనితోపాటుగా పంటలు,మొక్కలు కూడా దెబ్బ తిని పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుందని చెప్పవచ్చు.కాలుష్యాన్ని నియంత్రించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటే ఽఓజోన్‌ ‌పొర’’ ను రక్షించుకోవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 నుండి 30 లక్షల మంది వరకు చర్మ కాన్సర్‌ ‌బారిన పడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నవి.వీరిలో 20 శాతానికి పైగా రోగులు సూర్యకాంతి నేరుగా సోకడం వలన కాన్సర్‌ ‌బారిన పడుతున్నారని ఒక అంచనా.

ముఖ్యంగా ఏసీలు,రిఫ్రిజిరేటర్లు,స్ప్రేలు,ప్లాస్టిక్‌ ‌వస్తువుల వినియోగం నిత్య జీవితంలో భాగంగా మారిపోయినవి.వీటిని పరిమితికి మించి వాడడం కూడా పర్యావరణానికి హాని కలిగిస్తున్నది.ఓజోన్‌ ‌పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజలను చైతన్య వంతులను చేయవల్సిన భాద్యత ప్రభుత్వాలపై కలదు.మానవుడు చేసే అనేక పనులు ఓజోన్‌ ‌పొరను దెబ్బతీస్తున్నవి.మానవుడు చేసే అనేక తప్పిదాల వలన భూతాపం పెరగడం,వర్షాలు కురవక పోవడం,అడవులు తగ్గిపోవడం, వాతావరణంలో కాలుష్యం ఎక్కువ కావడం లాంటి అనేక కారణాలతో ఓజోన్‌ ‌పొరకు తీరని నష్టం కలుగుతున్నది.దీనితో పాటుగా పంటలలో అధిక దిగుబడుల కొరకు మితిమీరిన రసాయనాలు వాడడం, అధిక ఇంధనాన్ని ఉపయోగించడం,వాహనాల కాలుష్యం,పరిశ్రమల నుండి వెలువడే హానికర వాయువులు ఓజోన్‌ ‌పొరను దెబ్బ తీస్తున్నవి.మానవుడు తన అత్యాశ కొరకు చేస్తున్న పనులతో భూమిపై గల జీవరాశులకు యెనలేని హాని కలుగుతున్నది. దీని వలన మానవుడు భారీ మూల్యాన్ని చెల్లించడమే కాకుండా రాబోయే తరాలకు కూడా తీరని నష్టం చేస్తున్నాడని చెప్పవచ్చు.

మానవుడు నిపుణులు చెప్పిన సూచనలు పాటిస్తూ వాతావరణ సమతుల్యతను కాపాడాల్సిన ఆవశ్యకత కలదు.ముఖ్యంగా వాహన కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం కలదు.వాహన కాలుష్యాన్ని తగ్గించుటకొరకు ప్రజారవాణా వ్యవస్థను విరివిగా ఉపయోగించుకోవాలి.దగ్గరి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే నడక లేదా సైకిల్‌ ‌ను ఉపయోగించడము మంచిది.దీని వలన ఇంధనం మరియు డబ్బు ఆదా అవుతాయి మరియు శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది.ఏసీలు,రెఫ్రిజిరేటర్లు,కాస్మెటిక్స్,‌స్ప్రేలు ,ప్లాస్టిక్‌ ‌వాడకంపై పరిమితులు విధించుకోవాలి. సోలార్‌ ‌విద్యుత్‌ ‌వాడకాన్ని పెంచుకోవాలి.వ్యవసాయంలో అధిక దిగుబడుల కొరకు రసాయన క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించి,సేంద్రీయ పద్దతిలో పంటలను పండించుకోవాలి.మొక్కలు,చెట్లు పెద్ద ఎత్తున పెంచాలి.అడవుల నరకివేతను అడ్డుకోవాలి. తెలంగాణా రాష్ట్రం అడవుల విస్తీర్ణం కొరకు యజ్ఞంలా చేపట్టిన హరితహారం కార్యక్రమం అనేక సత్పలితాలను ఇస్తున్నది. దీనితో పర్యావరణ సమతుల్యత మరియు పచ్చదనం పెరిగినది.24శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణం 28శాతంగా అయినది.ఈ విషయాన్ని ఫారెస్ట్ ‌సర్వే అఫ్‌ ఇం‌డియా స్వయంగా ప్రకటించింది. మరో 5శాతం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న 33శాతం అడవుల విస్తీర్ణం లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఇదే విధముగా దేశ వ్యాప్తంగా మొక్కల పెంపకం అనునది ఒక యజ్ఞం లాగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం కలదు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కొరకు మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు భారతదేశం 1993 నుండే అనేక చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మాంట్రియల్‌ ఒప్పందం కొరకు అనేక దేశాల కంటే ముందుగానే నియంత్రణ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. మాంట్రియల్‌ ఒప్పందాన్ని అత్యుత్తమంగా అమలు చేసే దేశాలకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డును భారత్‌ ‌కెనడాలోని మాంట్రియల్‌ ‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 2007 సెప్టెంబర్‌ 16‌న అందుకుంది.

ముఖ్యంగా మానవుడు భూమి మీద జీవుల ఆవిర్భావానికి మరియు మనుగడకు పర్యావరణ సమతుల్యతతో పాటు ఓజోన్‌ ‌పొర కల్పిస్తున్న రక్షణే అనే విషయాన్ని మరువరాదు.ప్రకృతికి అధిపతులం అన్న అహంకారం మానవాళికి పనికిరాదు.కరోనా అనునది జీవితం ఎంత విలువైనదో మనకు నేర్పించింది. మనకు మరణ భయాన్ని పరిచయం చేసింది. కరోనా వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం మరియు నిపుణులు చేస్తున్న సూచనలు ప్రాణభయంతో తూచా తప్పక పాటిస్తున్నాం. ఇదే చిత్తశుద్ధితో గ్లోబల్‌ ‌వార్మింగ్‌, ‌జీవ జాతులు అంతరించిపోవడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం లాంటి సమస్యల పట్ల కూడా చిత్తశుద్ధిని చూపిస్తే ఓజోన్‌ ‌పొరను కాపాడుకునేవాళ్ళం అవుతామని చెప్పవచ్చు.కోవిడ్‌ ‌భయంతో ముఖానికి రక్షణగా మాస్క్ ‌కట్టుకొని కరోనా వైరస్‌ ‌నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామో అంతే చిత్తశుద్ధితో సమస్త జీవరాశులకు ముప్పు వాటిల్లకుండా రక్షణ కవచంగా వున్నా ఓజోన్‌ ‌పొరను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై కలదు. 2050 సంవత్సరం నాటికీ ఓజోన్‌ ‌పొరను 1980 కి ముందున్న స్థాయికి తేవడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న లక్ష్యం. ఓజోన్‌ ‌పొరకు పడ్డ రంద్రాలను పూడ్చడం కోసం ప్రతి ఒక్క దేశం ఓజోన్‌ ‌పోర పరిరక్షణకు మరియు పర్యావరణ సమతుల్యత కొరకు తమ వంతు కృషిని చిత్తశుద్ధితో చేయాలి. ఇది అంతర్జాతీయ ఓజోన్‌ ‌పరిరక్షణ దినోత్సవం మానవాళికి ఇస్తున్న సందేశం. ‘ఓజోన్‌ ‌పొరను కాపాడుకుందాం -భూమిని రక్షించుకుందాం.

pulluru venugopal
పుల్లూరు వేణు గోపాల్‌, 9701047002

Leave a Reply